సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతో ప్రజాతీర్పునకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీపీసీసీ నిర్ణయించింది.తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓటేయడం, ముందుగా తుక్కుగూడకు టీఆర్‌ఎస్ ఎక్స్‌అఫీషియోగా కేటాయించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని మళ్లీ నేరెడుచర్లకు మార్చడం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలుత బడంగ్‌పేటకు ఆప్షన్ ఇచ్చి, ఆ తర్వాత తుక్కుగూడలో ఓటేయడం వంటి ఉదంతాలపై చట్టపరంగా కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఆయా సందర్భం, అవసరాన్ని బట్టి రాజ్యసభ ఎంపీల ఎక్స్ అఫీషియో ఓటు వ్యవహారంపై రాజ్యసభ చైర్మన్‌ను, సెక్రటేరియట్‌ను కోరాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ ఓటు విషయంలో తాము ముందు నుంచి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిగా స్పందించలేదని, అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించిన తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రజాతీర్పును కాదని ...
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అక్రమాలు, ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరుపై చర్చించారు. న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు దీనిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్‌నేతలతో పాటు, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పాల్గొన్నారు. త్వరలోనే జరగనున్న సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో అధికార టీఆర్‌ఎస్ ఎక్స్ అఫీషియో ఓటింగ్ విషయంలో వ్యవహరించిన తీరుపై చర్చించినట్టు తెలిపారు.ప్రజాతీర్పును కాదని పలు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ అక్రమంగా కైవసం చేసుకుందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా భయపెట్టారని ధ్వజమెత్తారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ హయాం లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఈ భేటీలో సహకార ఎన్నికల పై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించామన్నారు. టీఆర్‌ఎస్‌ను సహకార ఎన్నికల్లో ఓడించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యనేతల సమావేశంలో సీఎల్‌పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు డా.జి.చిన్నారెడ్డి, డా.సీహేచ్ వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రులు మహ్మద్ అలీ షబ్బీర్, మర్రి శశిధర్‌రెడ్డి, కిసాన్‌సెల్‌నేత ఎం.కోదండరెడ్డి, టీపీసీసీనేత నిరంజన్ పాల్గొన్నారు.
సమావేశంలో ఉత్తమ్. చిత్రంలో జగ్గారెడ్డి, నిరంజన్, జీవన్‌రెడ్డి, జానా, కోదండరెడ్డి, వంశీ చంద్, షబ్బీర్ అలీ, శశిధర్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు
Comments
Please login to add a commentAdd a comment