
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఇన్‌చార్జి సచిన్ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్ ప్రకటించారు.