కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబును అదుపులోకి తీసుకుంటున్న పోలీసుల
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, కరెంటు బిల్లుల మోత, నియంత్రిత సాగు పేరుతో సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’కార్యక్రమం భగ్నం అయింది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో నివాసమున్న టీపీసీసీ ముఖ్య నేతలను వారివారి నివాసాల్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు పోలీసులు నాయకుల ఇళ్ల వద్దనే కాపలా ఉండి బయటకు రానీయలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఇదేనా ప్రజాస్వామ్యం: కేసీఆర్‌పై భట్టి ఫైర్
ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కలవాలని అపాయింట్‌మెంట్ కోరిన తమను నిర్బంధించడం పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. ప్రజాసమస్యలపై వారితరఫున ముఖ్యమంత్రిని, మంత్రులను అపాయింట్‌మెంట్ తీసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడం ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణమని, కానీ ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నయా ఫ్యూడలిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడు నెలలుగా తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, తాజాగా కరెంట్ బిల్లుల మోతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, కరోనాతో తెలంగాణ కల్లోలంగా మారుతోందని, రైతు బంధుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొందని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తమ బాధ్యత అని చెప్పారు.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసేందుకు ఈ నెల 11న అపాయింట్‌మెంట్ కోరుతూ 9న లేఖ రాశామని, అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా పోలీసులను ఉపయోగించి తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాము ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలమని, సచివాలయం కశ్మీర్ సరిహద్దుల్లో లేదని, తామేమీ ఉగ్రవాదులం కాదని భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న నాయకులు మాత్రమే ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తారని, సీఎల్పీ నాయకుడిగా ప్రజల గొంతును, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న తనను అణచివేసే కుట్రలను సహించేది లేదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల హక్కులను హరించివేస్తున్న ఈ ప్రభుత్వంపై శాసనసభలో హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తానని చెప్పారు. దీనిపై సభలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.
గురువారం బంజారాహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద మోహరించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment