♦ దొడ్డిదారి ‘రేషన్ కార్డులకు’ చెల్లుచీటీ
♦ 19 వేల ఆహారభద్రత కార్డుల తొలగింపు
♦ ఎన్‌ఐసీతో సమాచారం విశ్లేషించి నిర్ధారణ
♦ అనర్హులుగా తేలడంతో తీసివేతలు..
దొడ్డిదారిన రేషన్‌కార్డులు పొందిన అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా మరో 19 వేల మంది అనర్హుల పేర్లను ఆహారభద్రత జాబితా నుంచి తొలగించింది. రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిన ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం.. ఆహారభద్రతలో అనర్హుల ఏరివేతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
ఆధార్ సీడింగ్‌తో ప్రతి యూనిట్ సమాచారాన్ని నిక్షిప్తం చేసిన జిల్లా యంత్రాంగం.. ఇప్పుడు ఆ సమాచారాన్ని ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్)తో అనుసంధానిస్తోంది. తద్వారా ఉద్యోగుల తల్లిదండ్రులు, పొరుగు రాష్ట్రాల్లో కార్డు కలిగిఉన్నవారి చిట్టాను రాబట్టింది. అదేసమయంలో ఆధార్‌తో సరిపోలని కార్డుదారుల జాబితా కూడా ఎన్‌ఐసీ సేకరించింది. అలాగే ఉద్యోగులు హెల్త్‌కార్డుల్లో పొందుపరిచిన సమాచారంతో వడపోత జరిపారు. ఈ నేపథ్యంలోనే 19,451 మంది అనర్హులున్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి కోటాలో 8,395, మార్చి కోటాలో 11,056 కార్డులు అక్రమమని నిర్ధారించారు. ఈ కార్డుల తొలగింపుతో నెలకు 1,064 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
మార్చి నుంచి ఈ- పాస్ యంత్రాలు
ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మార్చి నుంచి ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెడుతోంది. గ్రేటర్ పరిధిలోని మూడు సర్కిళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది. సర్కిల్‌కు 35 యంత్రాల చొప్పున ప్రవేశపెడుతున్న అధికారులు.. వీటిని చౌకధరల దుకాణాలకు అందజేశారు. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. అదేసమయంలో ఏరోజుకారోజు సరుకు పంపిణీకి సంబంధించిన సమాచారం పౌరసరఫరాలశాఖకు చేరనుంది. మరోవైపు జీపీఎస్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా నిఘా పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జీపీఎస్, వెహికల్ ట్రాకింగ్ యూనిట్లను కూడా ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తోంది.