డీలరే బాస్! | telangana ration cards absorbs too ration dealers | Sakshi
Sakshi News home page

డీలరే బాస్!

Published Tue, May 5 2015 3:51 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

డీలరే బాస్! - Sakshi

డీలరే బాస్!

రేషన్ డీలరే బాస్... అతనితో ‘డీల్’ కుదిరితేనే ఆహార భద్రత కార్డు... అతను కన్ను గీటితే కార్డు రెక్కలు కట్టుకొని వచ్చి మన ఇంటి ముంగిట వాలిపోతుంది... లేదంటే కాళ్లరిగేలా తిరిగినా కార్డు దొరకదు.... ఆహార భద్రత కార్డుల జారీలో ప్రస్తుతం జిల్లాలో సాగుతోన్న తంతు ఇదే. అధికారుల ఇష్టారాజ్యంతో కూలీనాలి చేసుకునే నిరుపేదల జీవితం ఆహార భద్రత కార్డుల వేటలో కునారిల్లిపోతోంది. డీలర్‌తో ప్రమేయం లేకుండా ఎంతకాలం తిరిగినా ఆహార భద్రత కార్డు అందటం లేదని సగటు జీవులు ఆందోళన చెందుతున్నారు.
 
డీల్ కుదిరితేనే రేషన్ కార్డు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేషన్ దుకాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేశాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఆహార భద్రత కార్డులు జారీ చేస్తోంది. దానితో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం తీసుకుని జీవితాన్ని గడిపే పేదలు ఈ మార్పులకు అనుగుణంగా తమ వివరాలు పొందుపరిచేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు నింపి, వీఆర్‌ఓతో విచారణ జరిపించుకుని, మాడే కడుపుతో తహశీల్ కార్యాలయానికి వెళ్లి, గంటల తరబడి వరుసలో నిల్చున్నా పని మాత్రం కావడం లేదు. కానీ రేషన్ డీలర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే కొత్త కార్డులు మంజూరవుతున్నాయి. డీలర్‌ను కాదని ఎన్నిరోజులు కార్యాలయాల చుట్టూ తిరిగినా కొత్త కార్డులు వచ్చే సమస్యే లేదు. ముఖ్యంగా పేదలు అటు పనులకు వెళ్లలేక ఇటు ఆఫీసుల్లో పని కాక నానా తంటాలు పడుతున్నారు.
 
అక్కడ జిత్తులమారి ఎత్తులు...

కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సిన అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది సొంత ఎజెండాను అమలు చేయడంలో తీరిక లేకుండా ఉంటున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు పేదరికం, కుటుంబ వార్షిక ఆదాయం అర్హతగా కాకుండా తమకు నచ్చిన, తమను మెప్పించిన రేషన్ డీలర్ పరిధిలోకి వస్తాడా? రాడా? అనే అంశం ప్రాతిపాదికన పనులు చక్కబెడుతున్నారు. లేదా సదరు దరఖాస్తుదారుడి ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్‌తో ‘డీల్’ కుదిరేదాక కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నారు.

దాంతో ఇప్పటివరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించిన వారిలో మూడొంతుల మందికి కొత్త కార్డులు మంజూరు కాలేదు. జిల్లాలో 26,84,020 ఆహార భద్రత కార్డు యూనిట్లు ఉండగా అధికారులు ఇప్పటివరకు  23,54,286 యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. మరో 3,29,734 యూనిట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ జాప్యానికి లోపాయికారి కారణమేమిటో తెలియక కళ్లలో వత్తులు వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు నిరుపేదలు.
 
బియ్యం ఇస్తలేరు...
కొత్త కారటు రాలేదని బియ్యమిస్తలేరు. ఎమ్మార్వో సారు కాడికి పోయి కారటు తెచ్చుకోమని చెప్పిండ్రు. మూడు నెలల నుంచి తిరుగుతున్నా పనైతలేదు. ఆటోలకే డబ్బులు అయితన్నై. కారటు మాత్రం ఇస్తలేరు, ఎప్పుడిచ్చేది సెప్తలేదు. బియ్యం వస్తలె..
- మంజుల, జహీరాబాద్
 
ఆధార్ కార్డు పట్టుకొని తిరిగినా....
ఆలుమగలం కూలి పని చేసుకుంటం. మాకు పాతది తెల్లరేషన్ కార్డు ఉండే. ఇప్పుడు ఇవ్వటం లేదు. ఆధార్ కార్డుతో సహా రేషన్ కార్డు కోసం ఇప్పటికే రెండుసార్లు దర ఖాస్తు చేసినా రాలేదు. మాకు కార్డు ఇప్పించాలని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఇప్పటిదాక ఇవ్వలేదు.    
- కడమంచి సుధాకర్, రామాయంపేట
 
గతంలో ఇచ్చిండ్రు.. ఇప్పుడేమో తీసిండ్రు..
నాలుగేళ్ల సంది నాకు అంత్యోదయ కార్డు ఉంది. నేను నిరుపేదను. అంత్యోదయ కార్డు కింద వచ్చే 35 కిలోల బియ్యంతో కుటుంబమంతా బతికినం. ఇప్పుడు ఆ కార్డు తీసేసిండ్రు. ఎందుకు తీసిండ్రని అడిగితే ఎవరు చెప్తలేరు. ఎమ్మార్వో సారు ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేదు. అంత్యోదయ కార్డు తీసేయడంతో 18 కిలోల బియ్యమే ఇస్తున్నరు. ఈ బియ్యం సరిపోతలే.
- బందెల సాయిలు, జంగరాయి, చిన్నశంకరంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement