ఏకగ్రీవమైన తలకొండపల్లి మండలం పడమటితండా సర్పంచ్ బుజ్జిని సన్మానిస్తున్న స్థానికులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఆదివారంతో ముగిసింది. తుదిపోరులో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది తేలడంతోపాటు వారికి అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. ఇక ప్రచారానికి పదును పెట్టేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. షాద్‌నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, శంషాబాద్ మండలాల్లో ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 179 పంచాతీయతీలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడగా.
ఇందులో 8 పంచాయతీలకు మొన్నటి వరకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంకొన్ని జీపీల్లో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరిరోజు నామినేషన్లను ఉసంహరించుకోగా.. మరో 12 జీపీల్లో ఒకరు చొప్పున అభ్యర్థులే మిగిలారు. ఇలా మొత్తం 20 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి మినహాయించి మిగిలిన 159 జీపీలకు ఎన్నిక జరగనుంది. ఈ పంచాయతీలకుగాను 468 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. అలాగే మొత్తం 1,580 వార్డులకుగాను 201 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవిపోనూ మిగిలిన 1376వార్డులకు ఎన్నిక అనివార్యంగా మారింది. మొత్తం 3,654 మంది గెలుపుకోసం పోటీపడుతున్నారు. కేశంపేటలో మూడు వార్డుల్లో ఎన్నికను బహిష్కరించడంతో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు.
భారీగానే బరిలోకి..
పోటీ పడుతున్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయా రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఆయా మండలాల్లో పదుల సంఖ్యలో మాత్రమే నామినేషన్లను చివరి రోజు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. 179 పంచాయతీలకు మొత్తం 982 నామినేషన్లు అందగా.. 514 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
నామినేషన్లల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలతోనే ముగిసినా.. సకాలంలో ఈ తంతును పూర్తిచేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకూ తుది బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది వెల్లడించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment