ఆత్మకూరు(పరకాల): గ్రామ స్వరాజ్యమే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అన్నారు మహాత్మాగాంధీ. గ్రామాల్లో రాజకీయ పరిమితి పెరిగి అవి రాజకీయంగానూ చైతన్యమయ్యాయి. నేతలను ఎన్నుకోవడం నుంచి రాజకీయాలను శాసించే వరకు ఎదిగాయి. జిల్లాలో మొదటి విడతలో ఈ సారి ఎక్కువ ఏకగ్రీవమవ్వడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. గత పర్యాయం జిల్లా మొత్తంలో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇప్పుడు మొదటివిడతలోనే 45 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా పర్వతగిరి మండలంలో 16 జీపీలు ఏకగ్రీవం కావడం విశేషం.
అధికార పార్టీ వ్యూహం..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ జీపీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైనా అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయాలని గులాబీబాస్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఏకగ్రీవం వైపు పావులు కదిపారు. ఈ దిశలో సక్సెస్ సాధించారు. ఏకగ్రీవం కోసం అన్ని పార్టీల నాయకులతో మంతనాలు జరిపారు. ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఎక్కువ నిధులు మంజూరు చేయిస్తామని హామీలు ఇచ్చారు. వినని వారికి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని నచ్చజెప్పారు. గ్రామాలభివృద్ధే ధ్యేయంగా అందరూ పనిచేయాలని అవగాహన కల్పించారు. ఏకగ్రీవమైన 45 గ్రామ పంచాయతీల్లో రెండు ఇండిపెండెంట్లు తప్పా అన్ని అధికార పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం.
ఏకగ్రీవం వైపు మొగ్గు..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల నజరానాకు తోడు ఎమ్మెల్యేల నిధుల నుంచి రూ.15లక్షల నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గ్రామానికి రూ.25లక్షల నిధులు వస్తుండడంతో గ్రామాల్లో ప్రజలు పార్టీలను పక్కనపెట్టి ఏకగ్రీవం వైపు కదిలారు. ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ముందుకొచ్చారు. యునానమస్ అయితే తమ గ్రామానికి అభివృద్ధి సాధించొచ్చని పలు గ్రామాల ప్రజలు ఒకే తాటిపైకి వచ్చారు.
ఏకగ్రీవమైన గ్రామాలు ఇవే..
జిల్లాలో మొదటి విడతలోని 145 జీపీలకు గాను 45 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. నర్సంపేట మండలంలో బోజ్యానాయక్ తండా, రాములునాయక్ తండా, రామవరం, చంద్రయ్యపల్లె, పాత ముగ్దుంపురం, రాజుపల్లె, చిన్న గురిజాల ఉన్నాయి. దుగ్గొండిలో చలపర్తి, గొల్లపల్లి, గుడ్డేలుగులపల్లె, గుడి మహేశ్వరం, కేశవాపురం, పీజీ తండా, పొనకల్లు, శివాజీనగర్, స్వామిరావుపల్లె, సంగెం మండలంలో కొత్తగూడెం, గాంధీనగర్, బిక్కోజినాయక్ తండా, ఎల్గూ ర్ స్టేషన్, కాపుల కనిపర్తి, షాపూర్, పెద్ద తండా, సోమ్లా తండా ఉన్నాయి. వర్ధన్నపేటలో రామ్‌థాన్ తండా, రామవరం, దివిటిపల్లి, బొక్కలగూడెం, కొత్తపెల్లి ఉన్నాయి. పర్వతగిరి మండలంలో అన్నారం షరీఫ్, కల్లెడ, బూర్గుమళ్ల, సీకే తండా, గుగులోతు తండా, తూర్పు తండా, మల్య తండా, హత్య తండా, దూప తండా, మంత్య తండా జమాల్‌పురం, నారాయణపురం, గోరుగుట్ట తండా, శ్రీనగర్, రావూరు, పెద్ద తండా ఉన్నాయి.
ముగిసిన రెండో విడత
నామినేషన్ల స్వీకరణ ..
రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నెల 25న జరగనుండగా నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది.కాగా ఈప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది.రెండో విడతలో పరకాల మండలంలో 10 గ్రామపంచాయతీలకు, నడికుడ మండలంలో 14 గ్రామపంచాయతీలు, శాయంపే ట మండలంలో 24 గ్రామపంచాయతీలు, నల్లబెల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు, ఖానాపూర్ మండలంలో 20 గ్రామపంచాయతీలు, రాయపర్తి మండలంలో 39 గ్రామపంచాయతీలకుగాను మొత్తం 136 గ్రామపంచాయతీలకు నామినేషన్లను ఆదివారం వరకు స్వీకరించారు. నడికుడ మండలంలో 14 గ్రామ పంచాయతీలకు 102 నామినేషన్లు దాఖలయ్యాయి.
పరకాల మండలంలో 10 గ్రామ పంచాయతీలకు 69 నామినేషన్లు దాఖ లాయ్యాయి. శాయంపేట మండలంలో 24 గ్రామ పంచాయతీలకు 142 నామినేషన్లు వచ్చాయి. నల్లబెల్లి మండలం ముచ్చింపుల తండాలో గుగులోత్ రవలిక ఒకే నామినేషన్ వేశారు. శాయంపేట మండలం హుస్సేన్‌పల్లిలో గుండెకారి రజిత, గంగిరేణిగూడెంలో శానం మంజూలలు మాత్రమే నామినేషన్ వేశారు. వార్డుల వారీగా నడికుడ మండలంలో 112 వార్డులకు 488 నామినేషన్లు వచ్చాయి. శాయంపేట మండలంలో 212 వార్డులకు 549 నామినేషన్లు దాఖలయ్యాయి. పరకాల మండలంలో 94 వార్డులకు 247 నామినేషన్లు పడ్డాయి. ఒక వైపు మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం.. మరోవైపు రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. చివరి గంటలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు బారులు దీరారు. అధికారులు ఇబ్బందులు లేకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment