గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్‌ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు కొన్ని పంచాయతీల్లో రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలంటే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉం టుంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు సైతం ఆయా పార్టీల మద్దతుదారులే ప్రత్యర్థులుగా ఉం టారు. అయితే ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్‌ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆయా మం డలాల్లో రెండు, మూడు గ్రామ పంచాయతీ లు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు టీఆర్‌ఎస్ నేతలే పోటీ చేయడంతో పోరు రసవత్తరంగా మారింది.
నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో టీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో టీఆర్‌ఎస్ గ్రామ స్థాయి కేడర్ రెండు, మూడు గ్రూపులుగా తయారైంది. ఇటీవ ల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కలిసి పనిచేసిన కేడర్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే అన్న చందంగా మారిపోయింది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ కేడర్ స్తబ్ధుగా ఉండటం తో టీఆర్‌ఎస్ నేతల్లోనే ప్రధాన పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది.
సగటున నలుగురు పోటీ..
జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న 177 గ్రామ పంచాయతీల్లో 36 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 పంచాయతీల్లో మొత్తం 545 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పంచాయతీలో సగటున సుమా రు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా భీంగల్ మండలంలో ఎన్నికలు జరుగుతున్న 20 జీపీలకు 103 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల మధ్యే ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎవరికి మద్దుతు పలకా లో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
42 శాతం వార్డులు ఏకగ్రీవమే..
- సర్పంచ్ స్థానాలు నామమాత్రంగా ఏకగ్రీ వం కాగా, వార్డు సభ్యుల స్థానాలు మాత్రం భారీ గా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం వార్డుల్లో ఏకంగా 42 శాతం వార్డులు ఏకగ్రీవం కావడం గమనార్హం. మొదటి విడతలోని 177 గ్రామపంచాయతీల్లో
- మొత్తం 1,746 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏకంగా 736 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగీవ్రంగా ఎన్నిక జరిగింది.
- మిగితా 1004 వార్డు సభ్యుల స్థానాలకు 2,386 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా మరో ఆరు వార్డు సభ్యుల స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, ఈ 6 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు.
జోరందుకున్న విందు రాజకీయాలు..
బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలడంతో గ్రామ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గుర్తులు కూడా అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెరపైకి తెచ్చి తమను గెలిపిస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీలు ఇస్తున్నారు. గంప గుత్తాగా ఓట్లు రాబట్టుకునేందుకు ఆయా కుల సంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు విందులు ఇస్తున్నారు. అలాగే యువకుల ఓట్లకు గాలం వేసేందుకు యువజన సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తున్నారు.
రూ.లక్షల్లో వ్యయం..
జనాభా ఐదు వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షలకు మించి ఉండరాదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.2.5 లక్షలుగా నిర్దేశించింది. కాగా అభ్యర్థుల వ్యయం భారీగా ఉంటోంది. నాలుగైదు వందల ఓటర్లు ఉన్న పంచాయతీల్లో సైతం రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు అభ్యర్థులు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment