సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ స్థానంపై అధికార టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్య నేతలు గురిపెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగా తమ పరిధిలోని సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు డైరెక్టర్లుగా నామినేషన్లు వేశారు. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికై, సొసైటీ చైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ రేసులో ఉన్న నాయకులు తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చైర్మన్ రేసులో ఉన్న కొందరు నేతలు తమ సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో డీసీసీబీతో పాటు, డీసీఎంఎస్ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రేసులో పలువురు..
డీసీసీబీ చైర్మన్ రేసులో ప్రధానంగా పోచారం భాస్కర్‌రెడ్డి, కుంట రమేశ్‌రెడ్డి, బిగాల కృష్ణమూర్తి గుప్తా, మార గంగారెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి ఆశిస్తున్న దేశాయిపేట్ సొసైటీ డైరెక్టర్ల స్థానాలు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్న భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌తో పాటు, టీఎస్ కాబ్ పదవి రేసులో కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పటికే ఏకగ్రీవమైన వేల్పూర్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్న కుంట రమేశ్‌రెడ్డి డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బంధువైన రమేశ్‌రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిని ఆశిస్తున్నారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అంకాపూర్ సహకార సంఘం చైర్మన్‌గా పనిచేసిన మార గంగారెడ్డి, బోధన్‌కు చెందిన గిర్దావార్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మార గంగారెడ్డి కేటీఆర్‌ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చివరి వరకు ఇవేవీ కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవి విషయంలో అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది త్వరలోనే తేలనుంది.
డీసీసీబీ దక్కకపోతే డీసీఎంఎస్
డీసీసీబీ ప్రయత్నాల్లో ఉన్న నేతలు ఆ పదవి దక్కని పక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీబీ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనుండగా, డీసీఎంఎస్ మాత్రం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment