ఆమెకు అందలం | Womens Reservations Seats In Telangana Panchayat Elections | Sakshi
Sakshi News home page

ఆమెకు అందలం

Published Thu, Jan 3 2019 8:51 AM | Last Updated on Thu, Jan 3 2019 8:51 AM

Womens Reservations Seats In Telangana Panchayat Elections - Sakshi

జెడ్పీ సెంటర్, మహబూబ్‌నగర్‌ : మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో రాణించడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుంది.. అంతేకాకుండా సాధికారత కూడా సాధ్యమవుతుంది.. ఇదే భావనతో ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కేటాయించడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఈనెలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించగా.. జనరల్‌ స్థానాల్లో వారు పోటీ చేసేందుకు వెసలుబాటు ఉంది. తద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలో అతివలకు కేటాయించిన 359 స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లో కూడా వారు పోటీకి గెలిస్తే మహిళా సర్పంచ్‌ స్థానాల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది.

26 మండలాల్లో 359 స్థానాల కేటాయింపు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో 26 మండలాలు ఉండగా.. 721 గ్రామపంచాయితీల్లో ఎన్నికల జరగనున్నాయి. ఇందులో 359 గ్రామపంచాయితీలు మహిళలకు రిజర్వేషన్‌ కావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. నూతన పంచాయితీ రాజ్‌ చట్టం ద్వారా మహిళలకు పెద్దపీట దక్కగా.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ కేటగిరీల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. అత్యధికంగా జిల్లాలో నవాబుపేట మండలంలో 27 స్థానాలకు మహిళలకు రిజర్వ్‌ కాగా, ఆ తర్వాత గండీడ్‌లో 25, మద్దూరులో 24, జడ్చర్లలో 23, మక్తల్‌లో 21, కోయిల్‌కొండలో 20 స్థానాలు దక్కాయి. అత్యల్పంగా మూసాపేట, కృష్ణా మండలాల్లో ఏడు చొప్పున స్థానాలకు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. ఇక మిగిలిన స్థానాల్లో కూడా పురుషులతో పాటు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
అతివల ఆనందం 
పంచాయితీ ఎన్నికల్లో సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపై శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. కలిసొచ్చిన రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని పలువురు మహిళలు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
సాధికారత 
పంచాయతీల్లో రిజర్వేషన్‌ కారణంగా వేలాది మంది మహళలు రాజకీయం రంగంలోకి వస్తున్నారు. నాయకత్వం వహించాలని, రాజకీయాల్లో రాణించాలనే తపన ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వరంగా మారాయి. సర్పంచ్‌లు గా, వార్డు మెంబర్లుగా గెలిచిన పలువురు ఇప్పటికే ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ మేరకు వారి స్ఫూర్తి, కలిసొ చ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.

సమస్యలు కూడా... 
చట్ట ప్రకారం మహిళలకు పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్‌ అందుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉంటం లేదనే విమర్శలున్నాయి. మహిళా రిజర్వేషన్‌ వచ్చిన చోట అప్పటికే ప్రజాప్రతినిధులుగా, రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న వారు తమ కుటుంబం నుంచి మహిళను పోటీకి దింపి గెలిపించాక మళ్లీ తామే పెత్తనం చెలాయిస్తుండడం గమనార్హం. అయితే, సొంత తెలివితేటలు, కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే తీసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న వారు కూడా ఉన్నారు. 

రాజకీయంగా రాణించేందుకు అవకాశం 
పంచాయితీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో రాజకీయంగా రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ఇంటికే పరిమితమైన మహిళలు పలువురు రాజకీయల్లో రాణించేందుకు అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఎదగాలంటే పల్లె స్థాయిలోనే మొదటి అడుగు పడాలి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. – తిరుపతమ్మ, పీలేరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement