సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌లో పదవుల ముచ్చట్లు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలను శాసన మండలిలో ఏర్పడనున్న ఖాళీలు ఊరిస్తున్నాయి. ఎన్నికల ముందు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఆశలు కల్పించారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం చెప్పినట్టే వినడానికి పలువురు నాయకులు రాజీపడ్డారు. ఇప్పుడు శాసన సభ ఎన్నికలు ముగియడం, అనూహ్యమైన ఫలితాలు టీఆర్‌ఎస్‌కు రావడం, తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపులో తమవంతు కృషి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఉమ్మడి నల్లగొండనుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరంతా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే.
టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అయినా, ఆయన టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్నారు. ఇక, స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేసినా, ఇటీవల ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు జిల్లానుంచే రెండు ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన స్థానాలు మరికొన్ని ఉన్నాయి.
ఆశగా ఎదురుచూపులు
వివిధ సందర్భాల్లో పార్టీ నాయకత్వం పలువురు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఆ సమయం ఇప్పుడు రావడంతో హామీలు పొందిన నేతలంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నిక కావాల్సిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటర్లుగా మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నిక జరగాల్సి ఉంది.
అయితే, కేవలం ఆరు నెలల గడువే మిగిలి ఉండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుందా..? లేక, స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు వచ్చాక జరుగుతుందా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చితో ముగియనుండగా, మరోమారు పూల రవీందర్ టికెట్ ఆశిస్తున్నా రు. ప్రస్తుతానికి ఆ పార్టీకి చెందిన ఉపాధ్యాయ నేతలెవరి పేర్లూ టీచర్ ఎమ్మెల్సీ పదవి కోసం తెరపైకి రాలేదు. ఇక, గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో తమకు అవకాశం దక్కుతుందా, లేదా అన్న చర్చ కొందరు నేతల్లో మొదలైంది.
రేసులో వేనేపల్లి ... వేముల !
కోదాడ నియోజకవర్గం నుంచి చివరి నిమిషం దాకా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక పోతున్నామని, మరో విధంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని టికెట్ల ఖరారు సమయంలో పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిత్వం ఖరారైన బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపులో వేనేపల్లి కృషి ఉందని, ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే మాదిరిగా, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సారి గెలిపిస్తే.. వేముల వీరేశాన్ని ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిలో చూస్తారని ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో వేముల ఓటమి పాలయ్యారు. పార్టీలో సంస్థాగతంగా వివిధ సమీకరణలు, అవసరాల రీత్యా వేముల పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ నెరవేరలేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నల్లగొండ లోక్‌సభస్థానం నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు.
దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును పరిశీలిస్తారా..? లేదా అన్న చర్చ జరుగుతోంది. సాగర్ నుంచి టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ నియోజకవర్గం నాయకుడు చాడా కిషన్ రెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందికి చోటు కల్పించే అవకాశాల్లేవని, ఈ లెక్కన మరికొందరిని స్థానిక సంస్థల కోటా జరిగే ఎన్నిక వరకు వెయిటింగ్‌లో పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘గుత్తా’కు చోటు దక్కేనా ?
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో బెర్తును ఆశిస్తున్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని మంత్రి పదవి కట్టబెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన పార్టీలో చేరే ముందు ఇదే హామీ ఇచ్చారని, గత ప్రభుత్వంలో అవకాశం కల్పించలేక పోయినందున, ఈసారి ఎమ్మెల్సీగా తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గుత్తా ఎన్నికల బాధ్యతలు చూసిన దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. దేవరకొండలో టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించింది. ఈ రెండు స్థానాలతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ ఆయన కొంత బాధ్యత మోశారు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని మండలిలో గుత్తాకు చోట దక్కుతుందా..? లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment