సాక్షి, మహబూబాబాద్ : ఈ విద్యా సంవత్సరం గవర్నమెంట్ పంతుళ్లకు పరీక్ష కాలమని చెప్పొచ్చు. అదేమిటీ.. విద్యార్థులకు కదా పరీక్ష.. పంతుళ్లకెందుకు అనుకుంటున్నారా.. ఒక్కసారి వారి విధుల వివరాలు చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. విద్యార్థులకు చదువు చెప్పడం అట్లుంచితే.. ఎన్నికల విధులతో సతమతమవుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు కేటాయించిన ఎన్నికల విధులు విద్యార్థులకు శాపంగా మారుతోంది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు, వరుస ఎన్నికలతో నిత్యం విద్యాశాఖ సిబ్బందికి రెండు పడవలపై పయనం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. డిసెంబర్ చివరినాటికి అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తికావాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటకీ, ఇప్పటికీ జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాలేదు. అలాగే రానున్నది పరీక్షకాలం కావడంతో పదోతరగతిలో విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులకు ఆటంకం కలుగనుంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించడం వల్ల ఇప్పటికే విద్యార్థులకు నష్టం జరిగింది. ఇప్పుడు వరుసగా గ్రామపంచాయతీ, సహకార, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వల్ల విద్యార్థులకు మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లో మూడు దశల్లో 4,020 పోలింగ్ కేంద్రాల్లో ఈనెలాఖరు వరుకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 3,025మంది ఉపాధ్యాయులు ఉండగా, జిల్లావ్యాప్తంగా 44,703 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సుమారు 3,878మంది సిబ్బంది అవసరం ఉంది. దీంతో ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్లతో పాటు, సీనియర్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా ఎన్నికల విధులు కేటాయించనున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన రెండు సంవత్సరాలుగా పదోతరగతి ఫలితాల్లో చివరిస్థానంలో నిలుస్తోంది. దీంతో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ఫలితాలపై మరోసారి పడనుందోననే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది.
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు..
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలుగా గెజిటెడ్ అధికారులను నియమించాలి. కానీ గెజిటెడ్ అధికారులు ఎక్కువగా లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓలతో పాటు, ఇతర పోలింగ్ సిబ్బందిగా ఏదో రకమైన విధులను ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోంది. మూడు నాలుగు గ్రామపంచాయతీలకు కలిపి ఒక క్లస్టర్ చేసి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలను నియమిస్తారు. వీళ్లు స్టేజ్–1లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మొదలు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, విత్‌డ్రా, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పనులు చేయాలి. స్టేజీ–2లో ఆర్‌వోలు ఎన్నికల పోలింగ్, ఓట్లు లెక్కింపు, విజేతల ప్రకటన, ఉపసర్పంచ్ నియామకం వంటి పనులు చేయాలి. ఇతర సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ, విధుల నిర్వహణ వంటి పనుల కోసం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇన్ని రోజులు బోధనా పనిదినాలు విద్యార్థులు నష్టపోతే, అది విద్యార్థుల సిలబస్ పూర్తిచేయడంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
సిలబస్ పూర్తయ్యేనా..!
మార్చి 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి, దానికనుగుణంగా డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి కావాలి. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ టీచర్లు పాల్గొన్నారు. నాలుగైదు రోజులు పనిదినాలు నష్టపోయాయి. ఇప్పుడేమో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం వందలాది మంది ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్‌ఓ, ఏఆర్‌ఓలుగా నియమించారు. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత వెంటాడుతోంది. సిలబస్ సమస్య ఎలా అధిగమించాలా అని ఉపాధ్యాయులు మదనపడుతుంటే మళ్లీ ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల రూపంలో మరోసారి ఉపాధ్యాయులపై భారం పడింది. ఈ సారి ఏకంగా స్కూల్ అసిస్టెంట్లకు సైతం బాధ్యతలు అప్పగిస్తుండడంతో ఏం చేయాలో తోచక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు.
Published Sat, Jan 5 2019 3:41 PM | Last Updated on Sat, Jan 5 2019 3:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment