బాబొస్తే ఇంగ్లిష్‌ మీడియం రద్దే..! | Sakshi
Sakshi News home page

బాబొస్తే ఇంగ్లిష్‌ మీడియం రద్దే..!

Published Wed, May 8 2024 3:48 AM

Chandrababu Politics On English Medium Education in Govt Schools

మేనిఫెస్టోలో పేర్కొన్న ‘కేజీ టు పీజీ విద్య రివ్యూ’ అందుకే..

గతంలో చై–నా స్కూళ్ల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే

తక్కువ మంది విద్యార్థులున్నారని 6 వేల సర్కారు స్కూళ్లకు ఆయన జమానాలోనే మంగళం

ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యం లేదని హేళన

అసలు పేదల విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించిందీ ఆయనే

ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను దూరం చేయాలని కుట్ర

రాష్ట్రంలో 15,784 ప్రైవేటు స్కూళ్లలో 100 శాతం ఇంగ్లిష్‌ మీడియం

ప్రభుత్వ బడుల్లో మాత్రం ఇంగ్లిష్‌ మీడియం ఉండకూడదట

తెలుగు భాషాభిమానం పేరుతో కుతంత్రాలు 

సాక్షి, అమరావతి: తన పాలనలో అన్ని రంగాల్లో ‘ప్రైవేటు’కు పెద్దపీట వేసి ప్రభుత్వ రంగాన్ని నిండా ముంచిన చంద్రబాబు చివరకు పేదింటి పిల్లలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలనూ విడిచి­పెట్టలేదు. తన జమానాలో కార్పొరేట్‌ విద్యా సంస్థలైన ‘చై–నా’లకే ఆయన పెద్దపీట వేయడం ఇందుకు నిదర్శనం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నా­రని ఆరు వేల స్కూళ్లను మూసేసి వాటికి మంగళం పాడేశారు. పేదల విద్య ప్రభుత్వ బాధ్యతే కాదని ప్రక­టించిందీ కూడా ఆయనే. ప్రభుత్వ ఉపాధ్యా­యులకు అసలు నైపుణ్యం ఉండదనేది చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. నారాయణ స్కూళ్ల సిబ్బందితో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ ఇప్పించిన తెంపరితనం ఆయనది. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి పిల్లల చదువులకు పెద్దపీట వేసింది. దేశంలో కనివినీ ఎరుగని స్థాయిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. పేద విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను అమలు చేస్తోంది. దీన్ని చంద్రబాబు, ఆయన ముఠా జీర్ణించుకోలేకపోతోంది. పేద పిల్లలు ఇంగ్లిష్‌లో నిష్ణాతులైతే ఎక్కడ తమ పెత్తందారుల పిల్లలకు పోటీ వస్తారోనని ఇంగ్లిష్‌ మీడియం చదువులను తొలగించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ తాజా మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ విద్య రివ్యూ’ అనే అంశాన్ని చేర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేద పిల్లల చదువుల ఆనందాన్ని తుంచేయాలనే..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను అందిస్తుంటే తెలుగు మీడియం సరైందంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. ఇదే జరిగితే పేదింటి పిల్లల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను మా ఊళ్లో జిల్లా పరిషత్‌ స్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను. ఈ సిలబస్‌ పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంది.. దీంతో చదవడం చాలా కష్టమైంది. 

ఎలాగోలా బట్టీపట్టి పరీక్షలు పాసయ్యాను గాని మంచి మార్కులు సాధించలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇంగ్లిష్‌లోనే చేస్తుండడంతో ప్రశ్నలను అర్థం చేసుకోలేక ఉద్యోగం సాధించలేకపోయాను. నన్ను ఉద్యోగిగా చూడాలన్న నా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. స్కూల్‌ స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో చదివి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. ఇదే పరిస్థితి నా ఇద్దరు పిల్లలకు రాకూడదని వారిని కాకినాడలో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చదివించాను. 

ఇప్పుడు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అని కాకినాడ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్లడించారు. రాష్ట్రంలో అందరి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఇప్పటి లాగా తాము చదువుకున్నప్పుడు సరైన సదుపాయాలు ఉండి ఉంటే తాము మరింత ఉన్నతంగా ఉండేవారిమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న ఇంగ్లిష్‌ మీడియం బోధన, డిజిటల్‌ ఎడ్యుకేషన్, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, 3వ తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీని వారంతా కీర్తిస్తున్నారు. 

తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు సీఎం జగన్‌ పుణ్యమాని నాణ్యమైన విద్య ఇన్నేళ్లకు అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పెత్తందారుల పిల్లలకు పేద పిల్లలు ఎక్కడ పోటీ వస్తారోనని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్‌ సంస్థలకు విద్యను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్య ప్రభుత్వం బాధ్యత కాదని కాడిపారేసిన బాబు.. 
పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని.. ప్రైవేటు బడులు బాగుంటాయని చెప్పిందీ ఆయనే కావడం గమనార్హం. డబ్బున్నవారు వాటిల్లో చదువుకుని మేధావులుగా తయారవుతారని.. పేద పిల్లలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేరాలని పిలుపునిచ్చిందీ చంద్రబాబే. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. వారి చదువులన్నా ఎంతటి చులకన భావం ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తాయి. 

కార్పొరేట్‌ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యను నామరూపాల్లేకుండా చేశారు. తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను చంద్రబాబు మూసివేశారు. అక్కడి విద్యార్థులను గాలికి వదిలేశారు. అంతకుముందు టీడీపీ పాలనలోనే మరో 4,300 ప్రభుత్వ పాఠశాలలను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులను హేళన చేసి..
పేదింటి పిల్లలనే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను సైతం చంద్రబాబు దారుణంగా అవమానించారు. వారిలో బోధనా నైపుణ్యాలు తక్కువగా ఉంటాయని గతంలో బహిరంగంగానే ప్రకటించిన చరిత్ర ఆయనది. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ స్కూళ్ల సిబ్బందితో శిక్షణ ఇప్పించే సాహసానికి కూడా ఒడిగట్టారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా, సదుపాయాలు కల్పించకుండా ఫలితాలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. 

ఎవరైనా ధైర్యం చేసి తమ స్కూళ్లకు సిబ్బందిని అడిగితే బహిరంగంగానే చంద్రబాబు సస్పెండ్‌ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఎంతోమంది ఉపాధ్యాయులు అవమానభారంతో ప్రాణాలు వదిలిన ఘనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2000లో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచి మరీ అవమానించారు. ఆ సంవత్సరం 100 శాతం ఫలితాలు తేవాలని చంద్రబాబు ఆదేశించారు. 

తమ పాఠశాలకు సరిపడినంత మంది టీచర్లు లేరని ఆయన ఎదుటే చెబితే.. ఆగ్రహంతో రగిలిపోయిన బాబు అదే వేదికపై సదరు హెచ్‌ఎంను సస్పెండ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2003లో బాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప గోరంట్ల జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని అనుచరులను రెచ్చగొట్టారు. ఇలా చంద్రబాబు పాలనలో ఉపాధ్యాయులకు అడుగడుగునా అవమానాలే దక్కాయి.

చై–నాలపై ప్రేమ అందుకే..
తన అనుకూలవర్గానికి చెందిన నారాయణ– చైతన్య విద్యా సంస్థలను తలదన్నేలా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తుంటే చంద్రబాబు ఈర‡్ష్యతో రగిలిపోతున్నారు. సర్కారు బడులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు. పేదలు ఎప్పుడూ అలాగే ఉండాలి, పైస్థాయికి వెళ్లగూడదన్న కక్షతో ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దంటున్నారు. పెత్తందారుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం, ఐబీ సిలబస్‌ బోధన ఉండాలని భావిస్తున్నారు. తద్వారా పేద పిల్లలను కూలీలుగా మార్చాలని చూస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 45 వేల ప్రభుత్వ బడులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం తప్పని, దీనివల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి నారాయణ, చైతన్యతో పాటు రాష్ట్రంలోని మొత్తం 15,784 ప్రైవేటు స్కూళ్లలోను ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన సాగుతోంది. మరి అక్కడ లేని ఇంగ్లిష్‌ ఇబ్బంది ప్రభుత్వ బడుల విషయంలోకి వచ్చేసరికి ఏమొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. సర్కారు బడులను నాశనం చేసి, నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచడమే ఆయన ఎత్తుగడల ఉద్దేశమని అంటున్నారు.

పేద పిల్లలు తినే అన్నంలో మన్ను
దాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చంద్రబాబు ప్రభుత్వం అర్ధాకలితో అలమటించేలా చేశారు. బడికి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం పెట్టే భోజనంలోనూ చంద్రబాబు కక్తుర్తి పడ్డారు. రోజూ ముద్దయిపోయిన అన్నం, నీళ్ల సాంబారు ఇదొక్కటే మెనూ. ఈ అన్నం తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లలు ఆకలితో అలమటించారు. తిన్నవారికి కడుపునొప్పి సర్వసాధారణంగా మారింది. ఇక కౌమార దశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచ్చిన పిల్లల్లో గరిష్టంగా 30 శాతం మంది ఈ నాసిరకం మధ్యాహ్న భోజనం చేయలేకపోయేవారు. 

రక్తహీనతతో ఆస్పత్రి పాలైన విద్యార్థులు కోకొల్లలు. ప్రభుత్వ బడుల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబుకు భుజం కాసే ఎల్లో మీడియా ఏనాడూ బడి పిల్లల ఆకలి కేకలను విననట్టే నటించింది. పేదల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాదని బహిరంగంగానే ప్రకటించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే సర్కారు బడులను నిర్వీర్యం చేసేందుకు మధ్యాహ్న భోజనంలో కోత పెట్టారు. ఏటా సగటున రూ.450 కోట్ల బడ్జెట్‌ మాత్రమే కేటాయించారు. ఈ నిధులను సైతం సరుకు సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో చెల్లించిందీ లేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యేదాకా సర్కారు బడి పిల్లలను పట్టించుకున్న వారే కరువయ్యారు.

పాఠశాల భవనాలకు బీటలు.. బెంచీలకు చెదలు
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ బడికి భవనాన్ని నిర్మించిన పాపాన పోలేదు. ఏనాడూ అవి ఎలా ఉన్నాయో చూసింది లేదు. బాబు 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలో బడుల రూపురేఖలు మార్చడం, హైస్కూల్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం, ప్రతి స్కూల్లోనూ బాల, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు వంటి హామీలు ఇచ్చారు. కానీ 2019లో జగన్‌ సీఎం అయ్యేనాటికి దాదాపు 6 వేల స్కూళ్లను చంద్రబాబు మూసివేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపు మూతపడ్డాయి. 

20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట 1,725 స్కూళ్లకు తాళాలు వేసేశారు. 2019 మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు ఇవే అంశాలను పొందుపరిచారు. చివరకు బడిలో సుద్దముక్కలు, పిల్లలు, ఉపాధ్యాయులకు బెంచీలు లేని పరిస్థితిని తెచ్చారు. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలమైపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. గత్యంతరం లేక వేల స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోవడం, అవకాశం లేనివారు బడి మానేసే దుస్థితి బాబు జమానాలోనే సంభవించాయి.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పేరుతో దోపిడీ
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించేందుకు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. వీటికే ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌గా చంద్రబాబు పేరు మార్చారు. కేవలం 33 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన అనుకూలవర్గాల చేతుల్లోని 383 ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం చదువులంటూ భారీగా నిధులను దండుకున్నారు.

నేడు అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలు
టీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. 43 లక్షల మంది పిల్లలకు సమాన అవకాశాలు అందించారు. 

గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు, 159 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు, 1,958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023లోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికి పైగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్‌ ర్యాంకులు సాధించి మెడిసిన్‌ చదువుతున్నారు.

నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులు
విద్యా సంస్కరణలకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.73 వేల కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 సౌకర్యాల కల్పనకు మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరంతరం నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధమైన తాగునీరు, భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించారు. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.

ప్రతి విద్యార్థికీ డిజిటల్‌ బోధన 
నాడు–నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లల్లో ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, 45 వేల స్మార్ట్‌ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్‌ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్‌ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్‌ చానెళ్లు, యూట్యూబ్‌ చానెల్స్‌ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది.

భాషపై పట్టుకోసం టోఫెల్‌
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు వీలుగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. భాషపై పట్టు సాధించేందుకు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేంపదుకు 3వ తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ ఇస్తోంది. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్‌’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించింది. ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైస్కూళ్లల్లో నియమించింది.

సీబీఎస్‌ఈ బోధన 
పేదింటి పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా మొదటి విడతలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విద్యార్థులు పదోతరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ సిలబస్‌లో రాయనున్నారు.

బాలికల కోసం జూనియర్‌ కాలేజీ
హైస్కూల్‌ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ బాలికలకు ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్‌ జూనియర్‌ కళాశాలలను గరŠల్స్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చి రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలను తీసుకొచ్చారు.

ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్‌ టెక్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సుల’ను జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్‌ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), 3డీ ప్రింటింగ్, గేమింగ్‌ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది.

పేదలకు ‘ఐబీ’ విద్య
పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) బోధన 2025 జూన్‌ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి దాకా దేశంలో 210 వరల్ట్‌ క్లాస్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌ అమల్లో ఉంది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement