పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామపంచాయతీ భవనం
కోస్గి (కొడంగల్) : అటు ప్రజలు.. ఇటు పల్లెలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.. సరిగ్గా ఆరు నెలల అనంతరం గ్రామపంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, పాలకవర్గాలు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇదే రోజు పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంతో పాటు మామిడి ఆకుల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు.. స్వపరిపాలన నినాదంతో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో తొలిసారి పాలన మొదలుకానుండడంతో ఆయా పంచాయతీల్లో సందడి నెలకొంది.
733.. 721.. 719
జిల్లాలో గతంలో 468 గ్రామపంచాయతీ ఉండేది. స్వపరిపాలన నినాదంతో కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాలోని 265 ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసింది. ఇందులో 107 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరగా.. ఇందులో 12 జీపీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో జీపీల సంక్య 721కి చేరింది. అయితే, జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి, శంకరాయపల్లి తండాల పాలకవర్గాల గడువు ఇంకా ముగియలేదు. ఫలితంగా జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది.
మూడు విడతలుగా ఎన్నికలు
గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1వ తేదీన వెల్లడించింది. ఈ మేరకు మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా తొలి విడత జనవరి 21న 10 మండలాల్లోని 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల్లో, రెండో విడతగా జనవరి 25న ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడతగా 30వ తేదీన ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీలు, 2,024 వార్డుల్లో పోలింగ్, లెక్కింపు జరిపి విజేతల వివరాలను ప్రకటించారు.
టీఆర్‌ఎస్ హవా
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను ఏకగ్రీవం చేసేందుకు యత్నించారు. అలా వారి కృషి ఫలించి మొత్తంగా 126 జీపీల కార్యవర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. మిగతా వాటికి మాత్రం మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఏకగ్రీవమైన వాటితో కలిపి టీఆర్‌ఎస్ మద్దతుదారులు 503 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 47 స్థానాలను, స్వతంత్రులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకున్నట్లయింది.
ఆరు నెలల అనంతరం
అంతకుముందు ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు గత ఏడాది ఆగస్టు 2న ముగిసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక డిసెంబర్ మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జనవరి 30న ముగిసింది. ఇక 2వ తేదీ శనివారం అని గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించింది. అంటే సరిగ్గా ఆరు నెలల తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది. ఇందులో 265 కొత్త పంచాయతీలు ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment