ఎలికట్టలో నామినేషన్ పత్రాలు పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లె పోరులో నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈనెల 21న జరిగే గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు బుధవారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సాగింది. సాయంత్రం 5 గంటలకే గడువు ముగిసినా ఆలోపే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి చేరుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణకు సమయం పట్టింది. జిల్లావ్యాప్తంగా తొలిదశలో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామ సర్పంచ్ పదవులకు 673 మంది 982 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. అలాగే 1,580 వార్డు స్థానాలకు 3,684 మంది 4,735 నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణే కాదు.. పరిశీలనలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి పొద్దుపోయే వరకు స్క్రూట్నీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
ఎనిమిది ఏకగ్రీవం!
మొదటి దశలో ఎనిమిది గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పదవులకు సింగిల్ నామినేషనే దాఖలు కావడంతో గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈనెల 13న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి (నర్సింలు), జిల్లేడ్ చౌదరిగూడ మండలం ముష్టిపల్లి (యాదమ్మ), ఫరూఖ్‌నగర్ మండలంలోని ఉప్పరిగడ్డ తండా (రేఖాచందానాయక్), కొత్తూరు మండలం పరిధిలోని మల్లాపూర్ తండా (సభావట్ రవినాయక్), నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ (జెట్ట కుమార్), కాన్హా (సరిత)సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట సర్పంచ్ స్థానానికే కవిత ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆమె విజయం ఖాయమైంది. చింతకొండపల్లి గ్రామ సర్పంచ్‌గా పార్వతమ్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
రెండో దశకు నేటినుంచి నామినేషన్లు
ఈ నెల 25న పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. రెండో దశలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, మంచాల, యాచారం. కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలు, 1656 వార్డు స్థానాలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment