సీసీ కుంట మండలం ముచ్చింతలలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. తొలి దశలో తప్పిస్తే రెండు, మూడో దశల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చివరి దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో భాగంగా ఎనిమిది మండలాల్లోని 227 పంచాయతీలకు గాను 24 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 203 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవసరం రాకపోవడం.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
85.91 శాతం నమోదు
మూడో దశ ఎన్నికల సందర్భంగా 85.91 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈనెల 21న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.71 శాతం, 25వ తేదీన రెండో దశ ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా మూడో దశలో పోలింగ్ నమోదైనట్లయింది.
పర్యవేక్షించిన అధికారులు
ఎన్నికల సందర్భంగా అటు ఉద్యోగులు, ఇటు ఓటర్లకు ఇటు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎనిమిది మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించిన వారు సజావుగా సాగేలా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.
ఉదయం మందకొడిగా...
మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చలి ప్రభావం పెరిగింది. ఇది బుధవారం జరిగిన పోలింగ్‌పై ప్రభావం చూపింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనా పెద్దగా ఓటర్లు రాలేదు. ఇక 9 గంటల తర్వా త మాత్రం పోలింగ్ జోరందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 31.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత 11 గంటల్లోపు ఇది 66.07 శాతానికి చేరింది. మొత్తంగా ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సరికి పోలింగ్ శాతం 85.91గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
విధి నిర్వహణలో ఉద్యోగి మృతి
పోలింగ్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. కోస్గి మండలంలోని ముశ్రీఫా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న నర్సప్ప (48)కు ఎన్నికల సందర్భంగా అదే పంచాయతీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే కన్నుమూశారు.
ఓటు వేసిన ఎమ్మెల్యే
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూత్పూర్ మండలంలోని సొంత గ్రామమైన అన్నసాగర్‌లో ఆయన ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బారులు తీరిన ఓటర్లు
ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సాహం చూపారు. మూడో విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, అత్యధికంగా దేవరకద్ర మండలంలో 91.49 శాతం, తక్కువగా గండీడ్ మండలంలో 74.75 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో ఉదయం మందకొడిగా సాగినా.. 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక సమయం ముగిసే ఒంటి గంటకు కొద్దిముందు ఓటర్లు ఎక్కువగా> రాగా.. అందరినీ అనుమతించారు.
కట్టుదిట్టమైన భధ్రత
జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఆ బూత్‌ల్లో గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రెమారాజేశ్వరి స్వయంగా పలు కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు.
ఓటు వేసిన 2,17,049 మంది
మూడో విడతగా ఎన్నికలు జరిగిన 203 పంచాయతీల్లో 2,52,647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జీపీల్లో మొత్తం 1,26,476 మంది పురుషులు, 1,26,090 మంది మహిళా ఓటర్లతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1,08,778 మంది పురుషులు, 1,08,269 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇద్దరు ఇతరులు ఓటు వేశారు.
2 గంటల నుంచి కౌంటింగ్
ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. అనంతరం భోజనం కోసం అధికారులు గంట పాటు విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment