మిగిలేది ఎవరు?  | Telangana Panchayat Elections Second Phase Nominations | Sakshi
Sakshi News home page

మిగిలేది ఎవరు? 

Published Fri, Jan 11 2019 9:47 AM | Last Updated on Fri, Jan 11 2019 9:47 AM

Telangana Panchayat Elections Second Phase Nominations - Sakshi

రామడుగు మండలం వెదిరలో నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణతో పోరు హోరెత్తనుంది. తొలివిడతలో 22 మండలాల్లోని 414 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్‌ కోసం 3513 నామినేషన్లు దాఖలు చేశారు. 3758 వార్డుల కోసం 10,018 మంది తమ నామినేషన్లను సమర్పించారు. 17 గ్రామాల్లో సర్పంచ్‌ కోసం ఒక్కొక్క నామినేషన్‌ దాఖలైంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై గురువారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కాగా, పలు గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలైన 17 గ్రామ పంచాయతీల్లో 15 టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులే. తొలిదశ నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా శుక్రవారం తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఎంతమంది ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే కీలకం
గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషిస్తున్నారు. వారు సూచించిన నాయకులే పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసేలా చూస్తున్నారు. మొదటి విడతలో 414 గ్రామాల్లో స్పష్టంగా ఈ పరిస్థితి కనిపించింది. ఉమ్మడి కరీంనగర్‌లో సింగిల్‌ నామినేషన్‌ దాఖలైన 17 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి తదితర నియోజకవర్గాల్లో నిధులు, అభివృద్ధి మంత్రం ఫలించింది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగే 22 మండలాల్లోని 414 గ్రామాల్లో దాదాపు ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 12 అసెంబ్లీ స్థానాలకు 11 నియోజకవర్గాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవం సాధ్యం కానిపక్షంలో అధికార పార్టీ నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండేలా చూస్తున్నారు.

మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా గెలుపొందేందుకు మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మాజీ విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, రమేష్‌బాబు, కె.విద్యాసాగర్‌రావు తదితరులు పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఏకగ్రీవం చేయడం వంటి అంశాల్లో తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పరిమితమవుతూ గ్రామపంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులకు తీవ్ర పోటీ ఉంది. పెద్ద గ్రామపంచాయతీలు కావడం, పన్నుల వసూళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ స్థానాలకు టీఆర్‌ఎస్‌లోనూ తీవ్ర పోటీ నెలకొంటోంది. ఒక్కో మండల కేంద్రం నుంచి ముగ్గురు.. నలుగురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

ఇందులో మండలస్థాయి నేతలు సైతం ఉండటంతో పార్టీ తరఫున ఎవరికి మద్దతు ఇవ్వాలన్నదానిపై ఎమ్మెల్యేలు దృష్టి సారిస్తున్నారు. ఎక్కువ మంది పోటీదారులున్న మేజర్‌ గ్రామపంచాయతీల్లో వారిని కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని శాసనసభ్యులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నారు. ప్రధానంగా చిన్న గ్రామపంచాయతీలు, తండాలపై దృష్టి సారిస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.10లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని స్థానిక నేతలకు విడమరచి చెబుతున్నారు. ఎమ్మెల్యే, సర్పంచులు ఒకే పార్టీవారుంటే పెద్దఎత్తున నిధులను సులభంగా తీసుకురావచ్చన్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మిగతా పార్టీలు గెలిస్తే నిధులు రావని, టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని గ్రామ ముఖ్యులకు వివరిస్తున్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే పెద్దఎత్తున నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసేలా చూస్తామని ఎమ్మెల్యేలు భరోసా కల్పిస్తున్నారు. మొత్తానికి భారమంతా తమపైనే వేసుకొని పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు.

అయోమయంలో కాంగ్రెస్, కూటమి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో అవలంబించే వ్యూహం విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ అయోమయ స్థితిలోనే ఉంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా నాలుగు పార్టీలతో ప్రజా కూటమిగా ఏర్పడ్డ పక్షాలన్నీ మళ్లీ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థికి మద్దతు ఇచ్చే అంశంపై స్పష్టత కొరవడుతోంది. ఉమ్మడి జిల్లాలో మంథని నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు కీలక భూమిక పోషించనున్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసినవారే గ్రామపంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించనున్నారు. ఇదే విషయమై ఇటీవల కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల సమావేశంలో రసాభాస కూడా జరిగింది.

కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి, రామగుండంలలో కాంగ్రెస్‌ మద్దతుదారులు పొన్నం ప్రభాకర్, కటకం మృత్యుంజయం, పాడి కౌశిక్‌రెడ్డి, ఆరెపెల్లి మోహన్, డాక్టర్‌ మేడిపల్లి సత్యం, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌లను ఆశ్రయిస్తున్నారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, అవలంబించే వ్యూహాలపై మరోమారు సమావేశం ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రజాకూటమిలో భాగస్వాములైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు మాత్రం ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్రీయాశీలకంగా ముందుకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో కొంత పట్టుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వీలైనన్ని సర్పంచి స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement