హుజురాబాద్‌ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్‌ ఉంటేనే రండి! | Huzurabad Bypoll: Full Vaccination Must For Candidates To Nomination | Sakshi
Sakshi News home page

హుజురాబాద్‌ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్‌ ఉంటేనే రండి!

Published Wed, Oct 6 2021 12:14 PM | Last Updated on Wed, Oct 6 2021 4:58 PM

Huzurabad Bypoll: Full Vaccination Must For Candidates To Nomination - Sakshi

నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చి సరైన పత్రాలు లేక తిరిగివెళ్తున్న రిటైర్డు ఉద్యోగులు 

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్‌ వేదికలా మారితే, కోవిడ్‌ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. దీనిపై నామినేషన్‌ వేసేందుకు వస్తున్న అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల వ్యక్తులు, బాధితులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, నిరుద్యోగులు తమవాణిని ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలన్న ఆశయంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా వచ్చేవారిలో కొందరికి ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)పై అవగాహన లేకపోవడంతో వెనుదిరుగాల్సి వస్తోంది.

కోవిడ్‌ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో అధికారులు సెకండ్‌ డోస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేశారు. వాస్తవానికి ఇది కొత్త నిబంధనేం కాదు, షెడ్యూల్‌ విడుదలైన సెప్టెంబరు 28వ తేదీన కలెక్టర్‌ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అంతా సెకండ్‌ డోస్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలని, మాస్క్, శానిటైజేషన్‌ నిబంధన విధిగా పాటించాలని స్పష్టంచేశారు. కానీ, నామినేషన్‌ మొదలైన రోజు నుంచి వస్తున్న అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ నిబంధనలను పాటించారు. గుర్తింపులేని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా అనుచరులతో వస్తూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నామినేషన్‌ పత్రాలు సమర్పించే విషయంలోనూ పలు లోపాలు ఉన్న వాటిని అధికారులు తిరస్కరిస్తున్నారు.
చదవండి: నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే

నియోజకవర్గంలో డ్రోన్లతో నిఘా..
ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు నిఘా, తనిఖీలు ముమ్మరం చేశారు. అభ్యర్థులు నామినేషన్లువేస్తున్న ఆర్డీవో కార్యాలయంతోపాటు పలు సమస్మాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను రంగంలోకి దింపారు. కరోనా జాగ్రత్తల నేపథ్యంలో శాంతిభద్రతలతోపాటు, రాజకీయ పార్టీల నాయకులు, సమావేశాలపై నిఘా కోసమే వీటితో పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్‌కు వెళ్లే అన్ని రహదారులపై పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. హన్మకొండ– కరీంనగర్‌ జిల్లాసరిహద్దులోని పెంచికల్‌పేట స్టేజీ వద్ద నిర్వహించిన తనిఖీల్లో సీపీ సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ (ఎల్‌ అండ్‌ వో)లు పాల్గొన్నారు.
చదవండి: కుట్ర మామది.. ఆచరణ అల్లుడిది: ఈటల

8న రాజేందర్, వెంకట్‌ నామినేషన్లు
ఈనెల 1వ తేదీన నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ రెండు, మరో ఇండిపెండెంట్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. తరువాత 2, 3వ తేదీలు సెలవుదినాలు. సోమవారం ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఒక సెట్, ఇద్దరు ఇండిపెండెంట్లు రెండేసి చొప్పున మొత్తం 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
చదవండి: ఏం జరిగినా హుజురాబాద్‌లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మంగళవారం కేవలం ఒకే ఒక్కనామినేషన్‌ దాఖలైంది. కూకట్‌పల్లికి చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చాలిక చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్రులు అబ్బాడి బుచ్చిరెడ్డి, నూర్జహాన్‌ బేగం, రమేష్‌బాబు, మురుగు రామచంద్రు, బరిగె గట్టయ్య (టీఆర్‌ఎస్‌ రెబల్‌ ), మహ్మద్‌ మన్సూర్‌ అలీ (అన్న వైఎస్సార్‌ పార్టీ), రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ను సెకండ్‌ డోస్‌ సర్టిఫికెట్‌ లేదని అధికారులు తిప్పిపంపారు. చేసేదిలేక ఆ అభ్యర్థులంతా వెనుదిరిగారు. కానీ, తహసీల్దార్‌తో రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు.

బుధవారం ఎంగిలిపూల అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధానపార్టీ అభ్యర్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. మిగిలింది 7, 8 తేదీలు. ఈ క్రమంలో ఆఖరు రోజైన అక్టోబరు 8వ తేదీన బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ నుంచి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లు తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి ఆర్టీసీ కార్గో బస్సులో వచ్చిన ఈవీఎంలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. వీటిని సిబ్బంది ప్రభుత్వం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు.

కరీంనగర్‌ ఎస్సారార్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్, ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ ఓం ప్రకాశ్, అబ్జర్వర్‌  అనుపమ్‌ అగర్వాల్‌ పరిశీలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరచడం, కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించారు. అదనపు  కలెక్టర్లు జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్, గరిమ అగర్వాల్, కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌ పాల్గొన్నారు.

నామినేషన్లు వేయకుండా ప్రభుత్వం కుట్ర 
ప్రభుత్వం మా నామినేషన్లు దాఖలు కాకుండా రోజుకో కుట్ర చేస్తోంది. సోమవారం మాస్కుల్లేవని మా అభ్యర్థులను బయటికి పంపిన అధికారులు మంగళవారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ సర్టిఫికెట్‌ లేదని వెళ్లగొట్టారు. మా నామినేషన్లు దాఖలైతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనతో ప్రభుత్వం ఇలా కుట్రలు చేస్తోంది. ఈ రోజు 16 మంది అభ్యర్థులను తిప్పిపంపడం దారుణం. క్యాండిడేట్లను ప్రపోజ్‌ చేసే స్థానిక అభ్యర్థులు కూడా కోవిడ్‌ సర్టిఫికెట్‌ కావాలనడం చాలా అన్యాయం. 
– శ్యామలయ్య ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్‌

నిబంధనల ప్రకారమే
కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ను మాత్రమే అమలు చేస్తున్నాం. కోవిడ్‌ రెండోడోస్‌ ఉంటేనే అనుమతించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అభ్యర్థులంతా వాటిని ఒకసారి చదువుకోవా లి. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చు.
– శ్రీనివాస్, అడిషనల్‌ డీసీపీ (లాఅండ్‌ఆర్డర్‌)

మంత్రుల వాహనాలు తనిఖీ 
మంగళవారం హుజూరాబాద్‌ శివారులో మంత్రి గంగుల కమలాకర్‌ వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు పంపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సింగాపురం వద్ద మంత్రి హరీశ్‌రావుకు చెందిన కారును సైతం పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. హుజురాబాద్‌ ఉపఎన్నికల నేపథ్యంలో మంగళవారం టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్‌ స్క్వాడ్, జమ్మికుంట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా దాదాపు రూ.15లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. మోత్కులగూడెం వద్ద రూ.4 లక్షలు, జమ్మికుంటలో రూ.5 లక్షలు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పై రూ.1.40 లక్షలను, అలుగునూర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.


సీవిజిల్‌ యాప్‌

ఉపఎన్నిక సమయం.. యాప్‌లే కీలకం
కరీంనగర్‌ అర్బన్‌:
ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడే పాట్లు వర్ణనాతీతం. గతంలో కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగిన అభ్యర్థులు, అనుచరగణం ఇకపై యాప్‌లపై ఆధారపడాల్సిందే. పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించనున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే సదరు విభాగాలకు నోడల్‌ అధికారులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. ప్రచారానికి సంబంధించిన అనుమతులకు సువిధ యాప్‌ ఏర్పాటు చేయగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఉన్నచోటు నుంచే ఫిర్యాదు చేసేలా సీవిజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికల అధికారులు ఈ యాప్‌ల పని తీరుపై ఎప్పటికప్పు డు అప్రమత్తంగా వ్య వహరించనున్నారు.

ప్రతీ నిమిషం విలువైందే..
∙ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులకు ప్రతీ నిమిషం విలువైందనే కోణంలో ఎన్నికల సంఘం సువిధ యాప్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే జిల్లా ఎన్ని కల అధికారికి ఈ విషయమై స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు, పార్టీలు ఒకే వేదిక ద్వారా ప్రచార అనుమతులు పొందడానికి అవకాశం కల్పించింది. ఏ పార్టీ అయినా ఈ యాప్‌ ద్వారా 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి.

ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు
సీవిజిల్‌ యాప్‌ను ఎవరైనా తమ ఫోన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించినవారిపై ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారులు అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం లేదు. యాప్‌లో ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలను తీసి, ఫిర్యాదు చేస్తే సరి. నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారు. లేదంటే వారే బాధ్యులవుతారు.

సమాధాన్, మ్యాట్‌డాటా, సుగమ్, మాట్‌దాన్‌
ఓటర్లు ఫిర్యాదు చేయడానికి సమాధాన్‌ యాప్‌ అందుబాటులో ఉంది. ఇదివరకు ఆన్‌లైన్, టోల్‌ఫ్రీనంబర్‌ 1950, ఈ–మెయిల్, ఫ్యాక్స్, ఎస్‌ఎంఎస్, తపాలా ద్వారా ఫిర్యాదు చేసే మార్గాలున్నాయి. అందరూ సునాయాసంగా స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తుండటంతో ఈ యాప్‌ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో వచ్చిన ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి, సమాధానమివ్వనుంది. ఇక పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రం గుర్తించేందుకు మ్యాట్‌డాటా యాప్‌ను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి సుగమ్‌ యాప్‌. అలాగే పోలింగ్‌ రోజున ఓటింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఉపయుక్తమయ్యేది మాట్‌దాన్‌. ఇది అధికారులకు మాత్రమే అవసరమయ్యే యాప్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement