
సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం హుజురాబాద్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దళిత బంధును తమకు భారీ విజయాన్ని కట్టబెడుతుందని భావించిన కారు పార్టీకి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల పరిస్థితే ఎదురైంది. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థి ఈటలకే ఓటర్లు మద్దతు పలికారు.
దళిత బంధుతో గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయగా.. అంచనాలకు విరుద్ధంగా ఓటర్లను ఈ పథకం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్‌ఎస్‌కు బిగ్ షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు పడ్డాయి.
దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 రౌండ్ల ఫలితాలకు గాను మెజార్టీ రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.