ఇక పోలింగ్‌  | Telangana Panchayat Elections Notifications Ends | Sakshi
Sakshi News home page

ఇక పోలింగ్‌ 

Published Sun, Jan 13 2019 8:07 AM | Last Updated on Sun, Jan 13 2019 8:07 AM

Telangana Panchayat Elections Notifications Ends - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్నికలను సజావుగా జరిపేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ మేరకు తొలి దశలో జిల్లాలోని 10 మండలాలు 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు స్క్రూటినీ అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశమిచ్చారు. దీంతో ఆదివారం సాయంత్రానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచేదెందరో తేలనుంది. ఆ వెంటనే అభ్యర్థుల జాబితాతో పాటు గుర్తులను కూడా అధికారులు కేటాయించనున్నారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు గుర్తులు రాగానే దీనిని ముమ్మరం చేయనున్నారు.

అధికారిక ఏర్పాట్లు 
మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఓ పక్క నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ చేపట్టిన అధికారులు ఉపసంహరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. ఇదంతా జరుగుతుండగానే పోలింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందిని ఎంపిక చేయడంతోపాటు వారి విధులను కూడా విభజించారు. అలాగే, శిక్షణ కూడా పూర్తిచేశారు. కాగా, మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 21న జరగనుంది. కాగా, ఈ దశలో 249 పంచాయతీలకు కలిపి సర్పంచ్‌ స్థానాలకు 1,454, వార్డు సభ్యుల స్థానాలకు 5,103 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున అప్పటి వరకు బరిలో మిగిలిన వారి సంఖ్య తేలనుంది.

అధికారుల నియామకం 
మొదటి దశ ఎన్నికలు జిల్లాలోని పది మండలాల్లో కలిపి 249 గ్రామపంచాయతీల్లో జరగనున్నాయి. ఇందుకోసం 5,518 మంది అధికారులను నియమించారు. వీరే కాకుండా జోనల్‌ అధికారులు 58 మంది అధికారులు, స్టేజ్‌–1 అధికారులు  66 మంది, స్టేజ్‌–1 సహాయకులు 66, స్టేజ్‌–2 అధికారులు 282, పీఓలు 2,274 మంది నియామకం జరిగింది. ఇంకా అదనంగా మరో 228 శాతం మందిని ఎంపిక చేసి రిజర్వ్‌లో ఉంచారు. అలాగే ఏపీఓలు 2,742 కాగా అదనంగా 274 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మండలాల్లోని పంచాయతీలను మొత్తం 60 క్లస్టర్లుగా విభజించారు. మొదటి విడుత ఎన్నికల షెడ్యుల్‌లో ఆదివారం మద్యాహ్నం 3 గంటలలోపు  నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కానుంది. ఆ తరువాత ఎన్నికలో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. అలాగే, గుర్తులను కేటాయిస్తారు.

విత్‌డ్రా కోసం విశ్వప్రయత్నాలు 
పోటీలో అసమ్మతి లేకుండా చేసుకోవడానికి అభ్యర్థులు తమ ప్రత్యర్థులతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విత్‌డ్రాలకు ఆదివారం చివరి రోజు కావడంతో అసమ్మతి నేతలను బుజ్జగించేం దుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తమ మాట వినని వారిపై మండల, జిల్లా స్థాయి నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎక్కువగా ఉంది. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ముగ్గురు.. మరికొన్ని గ్రామాల్లోనైతే టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే నలుగురు కూడా నామినేషన్లను వేశారు. దీంతో వారిని విత్‌డ్రా చేయించేందుకు ప్రధాన అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement