సాక్షి, హైదరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 769 సర్పంచ్‌లు, 10,654 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలివిడతగా 4,479 పంచాయతీలు, 39,822 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవ సర్పంచ్, వార్డు స్థానాలు పోగా మిగిలే 3,701 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు నిర్వహించ నున్నారు. సర్పంచ్ పదవుల కోసం 12,202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవాలు పోగా 28,976 వార్డులకు ఎన్నికలు జరగ నుండగా 70,094 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 9 పంచాయతీలు, 192 వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాకపోవడం/చెల్లని నామినేషన్లు రావడంతో ఎన్నికలు నిర్వహించడంలేదు.
ముగిసిన 2వ విడత నామినేషన్ల పరిశీలన
రెండోవిడతగా 4,135 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ స్థానాలకు 25,419 నామినేషన్లు వచ్చాయి. 36,602 వార్డుస్థానాలకు 91,458 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల పరిశీలన సోమవారం నిర్వహించి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన నిర్ణయాలపై మంగళవారం అప్పీళ్లను స్వీకరించను న్నారు. బుధవారం ఈ అప్పీళ్లను పరిష్కరించనున్నారు. రెండోవిడత నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగియనుంది. ఈ నెల 25న రెండోవిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
మూడోవిడత పోరు షురూ
మూడోవిడత పంచాయతీ ఎన్నికల సమరం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడోవిడతలో 4,115 పంచాయతీలు, 36,718 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్లపై అప్పీళ్లను 20న స్వీకరించి 21లోగా పరిష్కరించనున్నారు. 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment