Unanimous Panchayats
-
Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో 13వేలకుపైగా గ్రామాల్లో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అందులో 2,001 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 358 పంచాయతీలు, తర్వాత గుంటూరు జిల్లాలో 245, వైఎస్సార్ జిల్లాలో 248, ప్రకాశం జిల్లాలో 192 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 36 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి చదవండి: Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ ఆయా గ్రామాలకు రూ.134.95 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నాలుగు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ వివాదాల జోలికి పోకుండా ప్రజలంతా ఏకతాటిపై కొనసాగుతూ ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు వాటి స్థాయినిబట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే.. రెండువేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2,000–5,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 5,000–10,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేలకుపైన జనాభా ఉన్న గ్రామాలకు రూ.20 లక్షల వంతున ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేసింది. -
రెండో దశలో 539 ఏకగ్రీవాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 167 మండలాల పరిధిలో 3,328 పంచాయతీలకుగాను 539 ఏకగ్రీవమయినట్లు ఎస్ఈసీ ప్రకటించారు. మిగిలిన 2786 పంచాయతీలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించారు. రెండో దశలో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు.. శ్రీకాకుళం: 278 పంచాయతీలకి గాను 41 పంచాయతీలు ఏకగ్రీవం విజయనగరం: 415కి గాను 60 ఏకగ్రీవం విశాఖ: 261కి గాను 22 ఏకగ్రీవం తూర్పు గోదావరి: 247కి గాను 17 ఏకగ్రీవం పశ్చిమ గోదావరి: 210కి గాను 15 ఏకగ్రీవం కృష్ణా: 211కి గాను 36 ఏకగ్రీవం గుంటూరు: 236కి గాను 70 ఏకగ్రీవం ప్రకాశం: 277కి గాను 69 ఏకగ్రీవం నెల్లూరు: 194కి గాను 35 ఏకగ్రీవం చిత్తూరు: 276కి గాను 62 ఏకగ్రీవం అనంతపురం: 308కి గాను 15 ఏకగ్రీవం వైఎస్ఆర్ జిల్లా: 175కి గాను 40 ఏకగ్రీవం కర్నూలు: 240కి గాను 57 ఏకగ్రీవం -
1979 నుంచి ఎన్నికల ‘చింత’ లేదు
సాక్షి, మెంటాడ (విజయనగరం): పంచాయతీ ఎన్నికలనగానే కొట్లా టలు... వివాదాలు... వర్గ విభేదాలు... గొడవలు... ఇవీ మనం ఎక్కడైనా చూస్తాం. కానీ మెంటాడ మండలంలోని ఇద్దనవలస, చింతలవలస మాత్రం వాటికి అతీతం. ఒక్కమాటపై నిలబడతారు. ఒకే బాట నడుస్తారు. ఐకమత్యంగా మెలుగుతారు. కలసి కట్టుగా జీవిస్తారు. ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటారు. పంచాయతీలు ఆవిర్భవించినప్పటినుంచీ ఇదే వారి బాట. అందుకే ఎన్నికలు వస్తే ఆ ఊళ్లో హడావుడి ఉండదు. కేవలం అందరూ అనుకుని ఒకరిని ఎన్నుకుని వారిచేత నామినేషన్ వేయించి, వారికే పదవులు కట్టబెడతారు. తమ గ్రామాల్లో ఎన్నికలే వద్దు, అభివృద్ధి మాత్రమే ముద్దు అని అంతా భావిస్తారు. ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సహకాలతో పాటు పంచాయతీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. 1979 నుండి ఎన్నికల ‘చింత’ లేదు చింతలవలస గ్రామం 1979 వరకూ పిట్టాడ పంచాయతీ మధురగ్రామంగా ఉండేది. తాడ్డి సన్యాసినాయుడు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పిట్టాడ నుంచి చింతలవలస గ్రామాన్ని వేరే పంచాయతీగా మార్చారు. 1979లో పూర్తిస్థాయి పంచాయతీగా ఏర్పాటైనప్పటినుంచి ఎన్నికలకు వెళ్లకుండా గ్రామ పెద్దలంతా ఒకేమాటపై గ్రామంలో ఏకగ్రీవంగానే పాలకవర్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో కూడా అదే పంథా కొనసాగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇద్దనవలస గ్రామం యుద్ధానికి దూరం ఇద్దనవలస రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైనప్పటినుంచి ఇద్దనవలసలో ఎన్నికలు ఏకగ్రీవమే. గ్రామ అభివృద్ధి కోసం పెద్దలంతా ఒకేమాటపై ఉండి పంచాయతీ ఎన్నికలు తమ గ్రామంలో జరగకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో పాటు, ఇతర నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అంతా ఒకే మాటమీద ఉంటాం మా గ్రామంలో ఎన్ని రాజకీయపారీ్టలు నాయకులు ఉన్నా పంచాయతీ ఎన్నికలు అనేసరికి ఊరంతా ఒకటే అవుతాం. ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుంటాం. నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి మాగ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అభివృద్ధే మా అజెండా. – భవిరెడ్డి నారాయణ, చింతలవలస పెద్దల నిర్ణయమే అంతిమం రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైనప్పటినుంచి మా గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగనేలేదు. గ్రామ మంతా ఒకే మాటపై ఉండి రామమందిరం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్ద లు చెప్పిన మాటకు విలువ నిస్తూ ఏకగ్రీవం చేసుకుంటాం. ఏకగ్రీవం అవ్వడం వల్లే మా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. – రాయిపిల్లి రామారావు, ఇద్దనవలస -
ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ..
సాక్షి, కాకినాడ: ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే, ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భిన్నస్వరాలను వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అరోగ్యకరమని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరిగితేనే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయనేది పిడివాదమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం లో భిన్నస్వరాలు వినబడాలని, అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందని, ఇదే రాజ్యాంగం బాధ్యత అని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు గ్రామాల్లోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఎన్నికల నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన గొల్లలగుంట ఘటనను ప్రస్థావిస్తూ.. ఆ ఘటన చాలా బాధాకరమని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు. -
107కు చేరిన ఏకగ్రీవాలు
ఆత్మకూరు(పరకాల): అధికార పార్టీ వ్యూహం ఫలించింది. జిల్లాలో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయగలిగింది. మొదటి విడతలో 45 జీపీలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 33 ఏకగ్రీవమయ్యాయి. తాజాగా మంగళవారం మూడోవిడత ఉపసంహరణ ఘట్టం ముగియడంతో 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో 120 స్థానాలకు గాను 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చెన్నారావుపేట మండలంలో 30 జీపీలకు కాలనాయక్‌తండా, బోజెర్వు, ఖాదర్‌పేట, గొల్లభామతండా, తిమ్మరాయనిపహాడ్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. నెక్కొండ మండలంలో 39 జీపీలకు అలంకానిపేట, లావుడ్యానాయక్ తండా, వెంకటనాయక్‌తండా, రెడ్యానాయక్‌తండా, హరిచంద్‌తండా, చెరువుముందరి తండా, నెక్కొండ తండా, దేవునితండా, అప్పలరావుపేట, మూడుతండా, గొల్లపల్లి, మేడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.ఆత్మకూరు మండలంలో 16జీపీలకు గాను పెంచికలపేట, గూడెప్పాడ్, కామారం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దామెర మండలంలో 14జీపీలకు కొగిల్వాయి, సింగరాజుపల్లె, ల్యాదళ్ల, దమ్మన్నపేట, దుర్గంపేట, సీతారాంపురం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గీసుకొండ మండలంలో 21జీపీలకు గాను గీసుకొండ, మచ్చాపూర్, మరియపురం, హర్జతండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. æ ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి అవుతాయనే సంకల్ప ంతో గ్రామాల్లో అందరూ ఒక్కటై జీపీలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. జిల్లాలో ఏకంగా మొదటి విడతలో గతపర్యాయం జిల్లా మొత్తం లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇప్పుడు మొదటివిడతలోనే 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 33 జీపీలు, మూడోవిడతలో 29జీపీలు ఏకగ్రీవం కావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో అత్యధికంగా పర్వతగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో అత్యధికంగా నెక్కొండలో 12 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గులాబీ వ్యూహం సక్సెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ జీపీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైనా అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయాలని గులాబీబాస్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఏకగ్రీవం వైపు పావులు కదిపారు. ఈ దిశలో సక్సెస్ సాధించారు. నజరానా వస్తుందని.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల నజరానాకు తోడు ఎమ్మెల్యేల నిధుల నుంచి రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గ్రామానికి రూ.25లక్షల నిధులు వస్తుండడంతో గ్రామాలలో ప్రజలు పార్టీలను పక్కనపెట్టి ఏకగ్రీవం వైపు కదిలారు.107కు చేరిన ఏకగ్రీవాలు -
ఆ గ్రామానికి మెదటి సర్పంచ్‌గా..
కట్టంగూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలంలో 22 జీపీలకు నూతనంగా ఏర్పడిన రామచంద్రాపురం గ్రామం ఏకగ్రీవం అయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి మెదటి సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి సూరారపు ప్రియాంకగణేశ్ ఎన్నికకావడం పట్ల ఆ గ్రామ ప్రజలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈనెల 30న 22 జీపీలకు గాను 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 22 జీపీలకు 121 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేయగా 57 మంది ఉపసంహరించుకోవడంతో 64 మంది బరిలో ఉన్నారు. 206 వార్డులకు గాను 631 నామినేషన్లు వేయగా 158 మంది ఉపసంహరించుకోగా 473 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. రామచంద్రాపురం గ్రామంలో 8 వార్డులు సభ్యులు నందికొండ పార్వతమ్మ, రేకల చందన, సూరారపు మహేందర్, మహేశ్వరం మహేందర్, బొడ్డుపల్లి రేణుక, నీలం గణేశ్, అనంతుల సురేశ్, బోయపల్లి పద్మ, మల్లారం గ్రామంలో 5 వార్డులు, కట్టంగూర్ గ్రామంలో 13వ వార్డు సభ్యులు నిమ్మల యాదయ్య, గార్లబాయిగూడెం గ్రామంలో 6వ వార్డు, నల్లగుంటబోలు గ్రామంలో 6 వార్డులు చొప్పున మొత్తం 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బరిలో ఉన్న సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. -
తొలివిడతలో 769 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 769 సర్పంచ్‌లు, 10,654 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలివిడతగా 4,479 పంచాయతీలు, 39,822 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవ సర్పంచ్, వార్డు స్థానాలు పోగా మిగిలే 3,701 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు నిర్వహించ నున్నారు. సర్పంచ్ పదవుల కోసం 12,202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవాలు పోగా 28,976 వార్డులకు ఎన్నికలు జరగ నుండగా 70,094 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 9 పంచాయతీలు, 192 వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాకపోవడం/చెల్లని నామినేషన్లు రావడంతో ఎన్నికలు నిర్వహించడంలేదు. ముగిసిన 2వ విడత నామినేషన్ల పరిశీలన రెండోవిడతగా 4,135 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ స్థానాలకు 25,419 నామినేషన్లు వచ్చాయి. 36,602 వార్డుస్థానాలకు 91,458 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల పరిశీలన సోమవారం నిర్వహించి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన నిర్ణయాలపై మంగళవారం అప్పీళ్లను స్వీకరించను న్నారు. బుధవారం ఈ అప్పీళ్లను పరిష్కరించనున్నారు. రెండోవిడత నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగియనుంది. ఈ నెల 25న రెండోవిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడోవిడత పోరు షురూ మూడోవిడత పంచాయతీ ఎన్నికల సమరం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడోవిడతలో 4,115 పంచాయతీలు, 36,718 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్లపై అప్పీళ్లను 20న స్వీకరించి 21లోగా పరిష్కరించనున్నారు. 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. -
మచ్చికకే మొగ్గు.
సాక్షి, వరంగల్ రూరల్: పంచాయతీ ఎన్నికలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారాయి. పోటీ ఉన్నచోట ఏకగ్రీవాలు చేసేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నా పెద్ద నాయకులను మచ్చిక చేసుకుంటు న్నారు. పార్టీల కతీతంగా పోటీ ఉన్న వారిని బుజ్జగిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేటీఆర్ వీలైనంత ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో ఎలాగైనా అధికార పార్టీవే ఎక్కువ స్థానాలు ఉండేందుకు శాసనసభసభ్యులు పొద్దనకా.. రాత్రనకా కష్టపడుతున్నారు. ఏ విధంగానైనా అభ్యర్థులను ఉపసంహరించే విధంగా చేసి ఎక్కువ ఏకగ్రీవాలు చేయించిన ఘనత ఉండాలని పాకులాడుతున్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు గ్రామ ప్రథమ పౌరుడి పీఠాన్ని దక్కించుకునేందుకు పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి కనిపించడంలేదు. కొత్త జీపీలు ఏర్పాటు కావడం వల్ల మొదటి సర్పంచ్‌గా గెలిస్తే చిరస్థాయిగా మొదటి సర్పంచ్ పేరు ఉంటుందని ప్రలోభాలకు లొంగకుండా పోటీలో ఉండేందుకు నిర్ణయించుకున్నవారు ఉన్నారు. అలాంటి వారి బలహీనతలను ఆసరాగా తీసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన అభ్యర్థుల ఉపసంహరణ, ఎన్నికలు తదితర అంశాలపైనే చర్చ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్‌లో 58 గ్రామాలు ఏకగ్రీవాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి దశలో 608 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 58 గ్రామ పంచాయతీల్లో ఒకొక్కరే నామినేషన్లు వేశారు. దాదాపు ఈ 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైట్టే. అధికారులు ప్రకటించాల్సి ఉంది. వరంగల్ అర్బన్‌లో 5, వరంగల్ రూరల్‌లో 21, జయశంకర్ భూపాలపల్లిలో 13, మహబూబాబాద్‌లో 10, జనగామలో 9 గ్రామ పంచాయతీల్లో ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అధికంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే ఉన్నారు. అభివృద్ధిపై ఆశలు.. ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధి జరుగుతుంది.. అధిక నిధులొస్తాయని ఎమ్మెల్యేలు పలు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామసభలు పెట్టి మరీ వివరిస్తున్నారు. అభివృద్ధిపై ఆశలు చూపుతున్నారు. వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివరాలు తెలుపుతున్నారు. ఏకగ్రీవం చేసే గ్రామ పంచాయతీలకు జనాభా 5 వేల లోపు ఉంటే రూ.9 లక్షలు, 5 వేల కంటే పైగా ఉంటే రూ.15 లక్షలు నజరానా అందుతుంది. ఎమ్మెల్యేల సీడీఎఫ్ నుంచి మరో రూ.10 లక్షలు నిధులు కేటాయిస్తామని ఇటీవల టీఆర్ఎస్ అధినేత ప్రకటించిన విషయం విధితమేనని గుర్తు చేస్తున్నారు. ఏకగ్రీవం చేస్తే ఇవన్నీ నిధులు వస్తాయని గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు. రేపటి వరకు ఉపసంహరణ గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడతలో 608 గ్రామ పంచాయతీలు, 5,458 వార్డులకు నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. ఈ నెల 13వరకు నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు లేవు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి మాజీ స్పీకర్ సిరికొండ మధుసుధనాచారి, ములుగు నుంచి మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ పోటీ చేసి ఒడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులే ఇన్చార్జిలుగా కృషి చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలను ఆయా గ్రామాలకు ఇన్చార్జిలుగా ఏర్పాటు చేసి ఏకగీవ్రమయ్యే విధంగా చేయాలని వారికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, భూపాలపల్లిలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో గతంలో జరిగింది పునరవృతం కావద్దని టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడొంతుల గ్రామ పంచాయతీలు కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కసరత్తు ప్రారంభించింది. మాట వినేదెవరో.. ? ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో రేపు తేలనుంది. గ్రామ పంచాయతీల వారీగా అధికార పార్టీ ఎన్ని ఏకగ్రీవ జెండా ఎగుర వేస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవాలు చేసి కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని ఎమ్మెల్యేలు చాయశక్తులా కృషి చేస్తున్నారు. విశేషమేమిటంటే అధికార పార్టీలోనే ఎక్కువమంది అభ్యర్థులు తామంటే తామని పోటీ పడడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. -
ఆధిపత్యం కోసం..
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. జిల్లాలో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 5 స్థానాలకు 3 చోట్ల గెలు పొంది ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ప్రధానంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సర్పంచ్ల గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. పార్టీ ఆదేశాలతో ఇప్పటికే సర్పం చ్ల అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఆపార్టీ టికెట్ల కోసం గ్రామాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. తమకు అంటే తమకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. 50శాతం జనరల్ స్థానాలు కావడంతో పోటీ తీవ్రమైంది. జనరల్ స్థానాల్లో అధికార పార్టీలో టికెట్ల కోసం పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నా రు. అయితే టికెట్ కోసం ఆశపడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. జిల్లాలో స్థానికంగా పట్టుకలిగే సర్పంచ్ పదవులు గెలిపించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్, మున్సిపల్ సహకార ఎన్నికల్లో ముందుకు పోవాలని టీఆర్ఎస్ నాయకత్వం పక్కా ప్రణాళిక వేస్తుంది. కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నాలు ము మ్మరం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పంచా యతీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న సంకల్ప ంతో సిద్ధమవుతుంది. అయితే నాయకత్వం మ ద్దతు ఆశిస్తున్న వారు గ్రామాల్లో అధికంగా ఉన్నా రు. శాసనసభ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించాలంటే గ్రామస్థాయిలో గెలుపు గుర్రాలను నిలపాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. డబ్బులే ప్రధానం! గ్రామపంచాయతీకి ఈనెల 21, 25, 30తేదీల్లో జరిగే ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులకు డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆశావాహులు లక్షల్లో వెచ్చించడానికి ముందుకు వస్తున్నారు. అయితే అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాల్లో కూడా డబ్బు సంచులతో ముందుకు వస్తున్న ఆశావాహుల సంఖ్య పెరగడంతో వారిని బుజ్జగించడం నేతలకు తలనొప్పిగా మారింది. రానున్న సింగిల్‌విండో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పి పోటీ నుంచి ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకగ్రీవానికి ప్రాధాన్యత ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవానికి అధిక ప్రా« దాన్యతను ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తుంది. ప్రధానంగా చిన్న గ్రామపంచాయతీలు, నూతన గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా పాలకవర్గాలు ఎంపికైతే ప్రభుత్వం రూ.10లక్షలు, స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మొత్తం రూ.25లక్షలు గ్రామానికి కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలు చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. ఆలేరు నియోజకవర్గంలో మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..? యాదగిరిగుట్ట : మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది. ఇందులో ఎస్టీ మహిళా రిజర్వేషన్ అయిన లప్పానాయక్‌తండాలో ధీరావత్ బుజ్జి, బీసీ మహిళా రిజర్వుడు స్థానం మహబూబ్‌పేటలో ఆరె రమ్య ఎన్నికయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కంఠంగూడెం గ్రామ పంచాయతీ జనరల్ స్థానం కావడంతో అక్క డ కంటం లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. -
ఆదర్శం.. నక్కవానికుంట తండా
కోయిల్‌కొండ (నారాయణపేట): మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని నక్కవాని కుంట తండా కొద్దినెలల క్రితం గ్రామపంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. ఈ మేరకు ఎన్నికలు రావడంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకునే పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10లక్షలు అందజేయనున్నారన్న విషయం తండా పంచాయతీ వాసులకు తెలిసింది. ఇంకేం.. పంచాయతీ కార్యవర్గాని ఏకగ్రీవం చేసుకుందామని నిర్ణయించి, సర్పంచ్, వార్డు సభ్యులపేర్లను కూడా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 770 మంది జనాభా.. 462 మందిఓటర్లు కోయిల్‌కొండ మండలంలో గ్రామపంచాయతీగా మారిన నక్కవాని కుంట తండాలో 770 జనాభా, 462 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు జీపీని 8 వార్డులుగా విభజించారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి మాజీ సర్పంచ్ రాజునాయక్ అధ్యక్షతన తండా వాసులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ మేరకు సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా డి.రాందాస్, ఉపసర్పంచ్‌గా ముడావత్ బాలునాయక్, వార్డు సభ్యులుగా హరిచన్, రుక్కమ్మ, బి.చంద్రమ్మ, శాంతమ్మ, బాలునాయక్, లక్ష్మీబాయి, ధారాసింగ్, హూమ్లానాయక్ పేర్లను 1నుంచి 8వ వార్డులకు నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయితీలో పోటీ జరగకుండా తండా ప్రజలందరూ ముందుకొచ్చి ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ సర్పంచ్ రాజునాయక్, స్థానికులు బాల్‌రాంనాయక్, హరినాథ్, మోహన్, ధారాసింగ్‌స్వామి, రాందాస్, బాబునాయక్, సక్రునాయక్, గౌడనాయక్ తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నిత్యం తండాలోనే ఉంటూ స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రభుత్వం నుంచి అందే నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. – డి.రాందాస్, సర్పంచ్ అభ్యర్థి తండాలకు వరం.. కొత్త గ్రామపంచాయితీలుగా తండాలు ఏర్పాటు కావడం ఒక వరం. గతంలో మా తండాలను ఎవ్వరు పట్టించుకునే వారే కారు. ఇప్పుడు మా తండాలు పంచాయితీలు మారడంతో నేరుగా నిధుల వస్తాయి. ఈ నిధులతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. – బాలునాయక్, ఉపసర్పంచ్ అభ్యర్థి గతంలో నిధులు రాలేదు.. గిరిజన తండా కావడంతో గత ఉమ్మడి గ్రామపంచాయితీలో ఎక్కువ నిధులు వచ్చేవి కావు. ఎక్కువగా గ్రామానికే వెళ్లేవి. కొత్తగా గ్రామపంచాయితీ ఏర్పడడంతో ఈసారి మా తండా ను అభివృద్ధి చేసుకునే అవకాశం మాకే లభించింది. – రాజునాయక్, మాజీ సర్పంచ్ -
నజరానా.. హైరానా!
♦ నగదు ప్రోత్సాహకం కోసం రెండేళ్లుగా ఎదురుచూపు ♦ జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలు ♦ నజారానా పెంచుతున్నట్లు ప్రకటన ♦ ఇప్పటికీ నయాపైసా విదల్చని సర్కార్ ♦ {పభుత్వం తీరుపై సర్పంచ్ల అసంతృప్తి ఏకగ్రీవ పంచాయతీలకు రిక్తహస్తం ‘ఎన్నికలు వద్దు ఏకగ్రీవం ముద్దు.. ఏకగ్రీవమైతే నజరానా’ అంటూ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రోత్సహించిన సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోంది. సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకుని ప్రభుత్వం అందజేసే నజరానాతో పల్లెలు బాగుచేసుకుందామనుకున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు రెండేళ్లుగా నజారానా కోసం ఎదురుచూస్తున్నా ఫలితం కానరావటంలేదు. గత పాలకుల కంటే నజారానా పెంచుతున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు నయాపైసా విదల్చలేదు. అభివృద్ధి నిల్ గ్రామాభివృద్ధిని కోరి గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. రెండేళ్లయినా నగదు ప్రోత్సాహకం ఇవ్వకపోవడంతో గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు. అందోల్ కృష్ణ, చక్రియాల సర్పంచ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ మైనర్ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం రూ.7 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.15 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం కాగా వీటిలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేవు. మౌలిక సదుపాయాలూ కరువయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహక నగదుతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని సర్పంచ్‌లు భావించారు. అయితే నజరానా అందకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. రెండేళ్లుగా ఎదురుచూపులు.. జిల్లాలో మొత్తం 1,066 పంచాయతీలకు 2013-జూలైలో 26, 29, 31 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 29 మండలాల్లోని 62 పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి రెండేళ్లుగా సర్పంచ్‌లు తమకు రావాల్సిన నగదు ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు అందే ప్రోత్సాహకాలతో సర్పంచ్‌లు గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణంతోపాటు రోడ్లు వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఇంకా నజారానా అందజేయకపోవటంతో తమ పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోందని వాపోతున్నారు. కాగా 2009లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం మేజర్, మైనర్ పంచాయతీలకు అన్న తేడా లేకుండా అన్ని పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికి ఇస్తుందోనని సర్పంచ్‌లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. రెండేళ్లుగా ఎదురుతెన్నులే.. ప్రభుత్వం నజరానాను ప్రకటించినా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. నిధులు మంజూరైతే గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇతర చిన్న చిన్న అభివృద్ధి పనులు జరిగేవి. - పెద్దగోల్ల మల్లమ్మ, సర్పంచు కంబాలపల్లి ప్రభుత్వానికి లేఖ రాశాం జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున త్వరలోనే నగదు ప్రోత్సాహకాలు అందజేసే అవకాశం ఉంది. - సురేశ్‌బాబు, డీపీఓ -
ఏడాదైనా.. ఏదీ నజరానా?
- ఏకగ్రీవ పంచాయతీలకు ‘ప్రోత్సాహం’ కరువు - సంవత్సరం కావస్తున్న జాడలేని నిధులు - ఎన్నికల తర్వాత పట్టించుకోని ప్రభుత్వం - జిల్లాలో 74 ఏకగ్రీవ పంచాయతీలు - రూ.11కోట్ల 10లక్షల కోసం ఎదురు చూపులు ఇందూరు: ఎన్నికల ప్రక్రియ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామపంచాయతీలకు రూ. 15లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో 74 గ్రామాలు ఏకగ్రీవంగా తమ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నాయి. ప్రభుత్వం నుంచి నజరానా అందితే.. గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశించారు. ఎన్నికలు ముగిసి ఏడాది దగ్గర పడుతున్నా ప్రోత్సాహక నిధులు మాత్రం జాడలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త సర్కారు సైతం ‘ప్రోత్సాహం’ మాటే ఎత్తడం లేదు. వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని కలలు గన్న గ్రామపంచాయతీలకు ఏడాదిగా ఎదురు చూపులు తప్పడం లేదు. నయాపైసా అందలేదు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఎన్నికలకు పోకుండా తమ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు మార్పులు చోటుచేసుకోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నజరానాల ముచ్చటే మరిచిపోయింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలకు నయాపైసా అందలేదు. అనంతరం కిరణ్ ప్రభుత్వం పోయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. అప్పుడు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొత్త రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇలా ఏడాది కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వాలు ఎలాగు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారైనా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అందించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు. ఈ నిధులు వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని వారు ఎదురు చూస్తున్నారు. జిల్లాకు రావాల్సినవి రూ.11కోట్ల 10లక్షలు జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు గాను 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2006లో ఏకగ్రీవ పంచాయతీలకు ఒక్కో దానికి రూ. ఏడున్నర లక్షలు చొప్పున చెల్లించారు. అయితే 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులను పెంచారు. 10వేల జనాభా కన్నా తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు, అంతకన్న ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షలు నజరానాగా అందజేయనున్నట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని బట్టి జిల్లాలో 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఇందులో అన్ని 10వేల కన్న తక్కువగా జనాభా ఉన్నవే. ఈ లెక్కన ప్రతీ పంచాయతీకి రూ.15లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.11కోట్ల 10లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే ఎవరి సాయం అక్కర లేకుండానే గ్రామాలను అభివృద్ధి చే సుకోవచ్చని ఆయా గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. ప్రకటించి.. పట్టించుకోలేదు ఎన్నికల ఖర్చులను వీలైనంత తక్కువగా చేసుకోవాలని అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం భావించిం ది. ఒక్కో పంచాయతీలో ఎన్నిక నిర్వహించాలంటే దాదాపు రూ.7నుంచి 8లక్షల వరకు ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, సిబ్బందితో పాటు వారి చెల్లించాల్సిన భత్యాలు, తదితరాలను కలుపుకుని చూస్తే ఖర్చు తడిసి మోపెడు కావస్తుండటంతో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రకటనకు ఆకర్షితులైన జిల్లాలోని 74 గ్రామాల ప్రజలు తమ ఊరికి ఒకే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకటనలు చేసిన ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వమే పోవడంతో నిధులకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఈ నిధులు అందించాలని వారు కోరుతున్నారు.