- ఏకగ్రీవ పంచాయతీలకు ‘ప్రోత్సాహం’ కరువు
- సంవత్సరం కావస్తున్న జాడలేని నిధులు
- ఎన్నికల తర్వాత పట్టించుకోని ప్రభుత్వం
- జిల్లాలో 74 ఏకగ్రీవ పంచాయతీలు
- రూ.11కోట్ల 10లక్షల కోసం ఎదురు చూపులు
ఇందూరు: ఎన్నికల ప్రక్రియ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామపంచాయతీలకు రూ. 15లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో 74 గ్రామాలు ఏకగ్రీవంగా తమ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నాయి. ప్రభుత్వం నుంచి నజరానా అందితే.. గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశించారు. ఎన్నికలు ముగిసి ఏడాది దగ్గర పడుతున్నా ప్రోత్సాహక నిధులు మాత్రం జాడలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త సర్కారు సైతం ‘ప్రోత్సాహం’ మాటే ఎత్తడం లేదు. వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని కలలు గన్న గ్రామపంచాయతీలకు ఏడాదిగా ఎదురు చూపులు తప్పడం లేదు.
నయాపైసా అందలేదు
జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఎన్నికలకు పోకుండా తమ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు మార్పులు చోటుచేసుకోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నజరానాల ముచ్చటే మరిచిపోయింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలకు నయాపైసా అందలేదు. అనంతరం కిరణ్ ప్రభుత్వం పోయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. అప్పుడు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
కొత్త రాష్ట్రంలోనైనా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇలా ఏడాది కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వాలు ఎలాగు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారైనా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అందించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు. ఈ నిధులు వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని వారు ఎదురు చూస్తున్నారు.
జిల్లాకు రావాల్సినవి రూ.11కోట్ల 10లక్షలు
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు గాను 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2006లో ఏకగ్రీవ పంచాయతీలకు ఒక్కో దానికి రూ. ఏడున్నర లక్షలు చొప్పున చెల్లించారు. అయితే 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులను పెంచారు. 10వేల జనాభా కన్నా తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు, అంతకన్న ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షలు నజరానాగా అందజేయనున్నట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీని బట్టి జిల్లాలో 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఇందులో అన్ని 10వేల కన్న తక్కువగా జనాభా ఉన్నవే. ఈ లెక్కన ప్రతీ పంచాయతీకి రూ.15లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.11కోట్ల 10లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే ఎవరి సాయం అక్కర లేకుండానే గ్రామాలను అభివృద్ధి చే సుకోవచ్చని ఆయా గ్రామాలు ఎదురు చూస్తున్నాయి.
ప్రకటించి.. పట్టించుకోలేదు
ఎన్నికల ఖర్చులను వీలైనంత తక్కువగా చేసుకోవాలని అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం భావించిం ది. ఒక్కో పంచాయతీలో ఎన్నిక నిర్వహించాలంటే దాదాపు రూ.7నుంచి 8లక్షల వరకు ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, సిబ్బందితో పాటు వారి చెల్లించాల్సిన భత్యాలు, తదితరాలను కలుపుకుని చూస్తే ఖర్చు తడిసి మోపెడు కావస్తుండటంతో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రకటనకు ఆకర్షితులైన జిల్లాలోని 74 గ్రామాల ప్రజలు తమ ఊరికి ఒకే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకటనలు చేసిన ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వమే పోవడంతో నిధులకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఈ నిధులు అందించాలని వారు కోరుతున్నారు.
ఏడాదైనా.. ఏదీ నజరానా?
Published Thu, Jun 26 2014 3:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement
Advertisement