పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలోకి దిగుతు న్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించడంతో, వారికి పంచాయతీ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన కాంగ్రెస్ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా తన ప్రతాపం చూపించాలని తహతహలాడుతోంది. మూడు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేటితో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఎవరు బరిలో ఉంటారో.. ఎవరు వెనక్కి తగ్గుతారోననే సందేహాలు వ్యకమ్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పోటీలో ఉంటామని ప్రజల మద్దతు కూడగట్టిన నాయకులు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గుతూ... కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలంటే డబ్బుతో ముడిపడి ఉండడంతో ఓటర్ల సంఖ్యను బట్టి ఎన్ని లక్షలు ఖర్చుపెడితే గెలుస్తామా అని బేరీజు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన తొలి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలుస్తుండడంతో పార్టీల మధ్యనే పోరు కనబడుతోంది. స్థానిక సంస్థల్లో పోటీ అంటే గతంలో అభ్యర్థిని చూసి ఓటు వేసే పద్ధతి కనబడేది. కానీ ఆ పద్ధతి రానురాను కనుమరుగవుతోంది. పనిచేసేవాడైనా.. చేయనివాడైనా... ఖర్చు పెడితేనే మద్దతు తెలుపుతామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించడంతో, వారికి పంచాయతీ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ సైతం పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన కాంగ్రెస్ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా తన ప్రతాపం చూపించాలని తహతహలాడుతోంది. మూడు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సవాలే...
శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి. రాష్ట్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలువాలంటే ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించాలని, తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సర్పంచ్‌లను గెలుపించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల హడావుడి నుంచి ఇంకా తేరుకోకముందే వచ్చిన పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు గ్రేడింగ్‌గా పరిగణించే అవకాశాలు ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే చావో రేవో అన్నట్లు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో సర్పంచ్‌ల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు తమ భుజాలపైకి ఎత్తుకొని బలం నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి తీవ్ర పోటీ నెలకొంటుండడంతో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది సంకటంగా మారింది. తాము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తమ గెలుపు కోసం పనిచేసిన వారందరూ సర్పంచ్‌లుగా అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇటు ఇంటి పోరును అటు ఎన్నికల పోరును అధిగమించి సర్పంచ్‌లను గెలిపించుకుంటేనే అధిష్టానం వద్ద తమకు ప్రతిష్టపెరిగి పదవులు దక్కుతాయనే ఆశతో ఎమ్మెల్యేలు కదనరంగంలో ముందుకు కదులుతున్నారు.
కాంగ్రెస్ నేతలపై అసెంబ్లీ ఓటమి ఎఫెక్ట్...
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యంతో 13 స్థానాల నుంచి పోరాడి ఓడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్నారు. ఊహించని విధంగా ఘోర పరాజయం అనంతరం పంచాయతీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ నేతల్లో కొంత నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీకి వచ్చి ఓట్లు ఎన్ని... ఇప్పుడు పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే అంశం ఆ పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఫలితాలు రివర్స్ కావడంతో పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అయితే ఈ పరిస్థితులను అధిగమించి ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను బరిలో నిలుపుతూ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ గెలుపు గుర్రాల వేటలో ముందుకు కదులుతున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మూడు రోజుల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశం కూడా నిర్వహించి ‘పంచాయతీ’పై చర్చించారు.
ఉనికి కోసం తపిస్తున్న బీజేపీ ఇతర పార్టీలు...
శాసనసభ పోరులో బోల్తాపడిన బీజేపీ పంచాయతీలోనైనా కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లను గెలిపించుకొని ఉనికి కాపాడుకోవాలని భావి స్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు పదకొండు చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. కరీంనగర్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు. దీంతో కమలనాథులు వెనుకడుగు వేయకుండా సర్పంచ్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తమ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కొందరు అభ్యర్థులు కోరుతుండడంతో ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఎక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలపై దృష్టి పెట్టి అక్కడి క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీకి పోటీచేసిన వారు పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటేనే పరువు కాపాడుకునే పరిస్థితి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని టీఆర్‌ఎస్ భావిస్తుండడంతో బీజేపీతో పాటు ఇతర పార్టీలు సైతం ఇరకాటంలో పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment