సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ పక్షాలన్నీ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. 2013లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలుపొందిన సర్పంచ్‌లు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలు టీఆర్‌ఎస్ ఖాతాలో చేరినట్లయింది. ఆయా పంచాయతీల్లో తిరిగి గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా.. గత ఎన్నికల్లో గెలిచిన జీపీలను తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకున్న గ్రామ పంచాయతీల్లో.. అనేక మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం సంప్రదాయ ఓటు, పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలపై దృష్టి సారించి.. ఆయా గ్రామ పంచాయతీల్లో విజయం సాధించేందుకు క్షేత్రస్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. గ్రామస్థాయిలో పార్టీ నేతలకు సర్పంచ్ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో అనేక గ్రామ పంచాయతీల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్నా.. రాజకీయ పక్షాల మధ్య ఇప్పటికిప్పుడు ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు.
ఖర్చుకు వెనుకాడకుండా..
జిల్లాలోని అనేక గ్రామాల్లో సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కొన్నిచోట్ల ఆయా పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు తటస్థులు ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఆయా పార్టీల నియోజకవర్గ నేతలు.. మండల, గ్రామస్థాయి నేతలతో సమావేశమవుతూ.. పార్టీ విజయానికి అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గురువారం పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, పార్టీ కార్యదర్శి తాతా మధు తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించి.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి కార్యకర్తలకు నిర్దేశించారు.
దీంతో గ్రామస్థాయిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైనట్లయింది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం గ్రామస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు నియోజకవర్గాలవారీగా సమాయత్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుపొందడంతో అదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీలను సైతం అదే రీతిన గెలుపొందేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ తరఫున పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కొన్నిచోట్ల నియోజకవర్గాల బాధ్యులు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రమాదకర పరిస్థితిలో ఉండడంతో గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్, టీడీపీ పరస్పర అవగాహనతో కూటమిగా ఏర్పడి పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి బలం ఉన్నచోట వారు పరస్పరం పార్టీలకు మద్దతు ఇచ్చేలా గ్రామస్థాయిలో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారమవుతోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత పంచాయతీ ఎన్నికల్లో అనేక గ్రామ పంచాయతీలను గెలుపొందింది. అదే స్ఫూర్తితో మళ్లీ పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీపీఎం, సీపీఐ సైతం పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించి.. తమకు గల పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment