సాక్షి, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పాటు బీజేపీ కూడా ఖమ్మం సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బీజేపీలో బలమైన నేతలు లేకపోయినా.. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతల్ని చేర్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. మంత్రి పువ్వాడకు సైతం వచ్చే ఎన్నికలు చాలా కీలకం అనే చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మం బరిలో నిలవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చదవండి: పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. తర్వాత నామా నాగేశ్వరరావు సైకిల్ దిగి కారెక్కేశారు. తుమ్మల, నామా వంటి బలమైన నేతలు చేరడంతో టీడీపీ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్‌కు షిప్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పువ్వాడ అజయ్ కుమార్ ఆశిస్తున్నారు. సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మంత్రికి కొంచెం ఇబ్బంది కలిగించగా.. ఈ విషయంలో ఆందోళనలు చేసిన బీజేపీ తనకు ప్లస్‌అవుతుందని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పువ్వాడను ఓడిస్తామని బీజేపీ అంటోంది.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన రేణుకా చౌదరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. తన అనుచరులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేణుక చౌదరి బరిలో నిలిస్తే ఖమ్మం కాంగ్రెస్‌లోని రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ ఆమెకు మద్దతివ్వదని అంటున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములపై క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయనే చెప్పాలి.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న ఏకైక నియోజకవర్గం మధిర అని చెప్పాలి. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం వల్లనే గత మూడు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మధిరలో కాంగ్రెస్ నేత మల్లు దూకుడుకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్. వచ్చే ఎన్నికల్లో భట్టి విక్రమార్కపై గెలుపోందాలంటే పాత అభ్యర్థి కమల్ రాజ్ నే మళ్లీ టీఆర్ఎస్ నిలబెడుతుందా లేక మార్పు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం ఏమాత్రం లేదనే చెప్పాలి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. సీపీఎంలోని కీలక నేతలు ఇతర పార్టీలలో చేరడంతో ఓటు బ్యాంక్ సైతం చెల్లాచెదురైంది. టీడీపీ ఓట్ బ్యాంక్ పూర్తిగా టీఆర్ఎస్‌వైపు షిఫ్ట్ అయింది.
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే పాలేరులో పొలిటికల్ హీట్ మొదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో పాలేరులోని టీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. తుమ్మల వర్సెస్ కందాల ఉపేందర్ రెడ్డిగా టీఆర్‌ఎస్ వ్యవహారాలు రచ్చకెక్కాయి. చివరికి రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టే వరకు పరిస్థితి దిగజారింది. దీంతో అప్పటి నుంచి పాలేరు రాజకీయం మరింత ముదురుతూ వస్తోంది. ఇదే సమయంలో తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను తుమ్మల కొట్టిపారేశారు. అసంతృప్తితో ఉన్న తుమ్మలను కేటీఆర్ కలిసి బుజ్జగించే ప్రయత్నాలు సైతం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. ఎవరికి వారు టికెట్ తమకే అనే ధీమాతో ఉన్నారు.
మొదటి నుంచి కాంగ్రెస్‌కు పాలేరు కంచుకోట అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం నడిపించే నాయకుడే లేడు. రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పై నమ్మకం పెట్టుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో బీజేపీ ప్రభావం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఇక వైఎస్సార్‌టీపి నుంచి వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షర్మిలకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కారణంగా టీడీపీ ఓట్‌బ్యాంక్ చెల్లాచెదురైంది. మెజారిటీ ఓటింగ్‌గులాబీ పార్టీకి మళ్ళింది. టీడీపీ తరపున గెలిచి కారు పార్టీలో చేరిన సండ్ర వెంకటవీరయ్య దూకుడుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు పార్టీ మారితే సత్తుపల్లిలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతారాయ్ కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ ఆ పార్టీ కి చెప్పుకోదగ్గ నేతలు లేరనే చెప్పాలి.
ప్రస్తుతం వైరాలో రాజకీయమంతా టీఆర్ఎస్‌చుట్టే తిరుగుతోంది. కారు ఓవర్ లోడ్‌తో సాగుతోంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు నడిపించే నాయకులే కరువయ్యారు. ఈ రెండు పార్టీలు వైరా నియోజకవర్గంలో ఉన్నాయా లేవా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్న పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలు చేరితే తప్ప ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పుంజుకునే పరిస్తితులు కనిపించడంలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపోందారు. గెలిచాక రాముల్ నాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూపులు ఎక్కువ అయ్యాయి. ఎమ్మెల్యే రాములు నాయక్, గత ఎన్నికల్లో ఈయన మీద ఓడిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య వర్గ పోరు కొనసాగుతోంది.
వీరిద్దరితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి సైతం ఈసారి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. టికెట్ ఎవరికి వస్తుందన్నది పక్కన పెడితే నియోజకవర్గంలో టిఆర్ఎస్ మూడు గ్రూపులుగా చీలిపోవడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా లేకపోయినా..అధికార పార్టీలోని వైరి వర్గాలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఎమ్మెల్యే రాములు నాయక్‌మాత్రం ఎవరెన్ని డ్రామాలు ఆడినా ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని.. కేసీఆర్ ఆశీర్వాదాలు తనకే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.
అయితే రాముల్ నాయక్ తన కొడుకు జీవన్ లాల్ కు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాములు నాయక్ పలు సందర్బాల్లో అసందర్భంగా నోరుజారి అధిష్టానం నుంచి మొట్టికాయలు వేయించుకున్న సందర్బాలు ఉన్నాయి. పార్టీకి ఇబ్బందికలిగే విధంగా మాట్లాడతారనే అపవాదు ఎమ్మెల్యే మీద ఉండటం ఆయనకు మైనస్‌అని ప్రత్యర్థులు అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలిద్దరూ మూడు వర్గాలుగా చీలి ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్‌మీద ముగ్గురూ ఆశలు పెట్టుకున్నారు.
వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు చాలా బలహీనంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ఒకప్పుడు బలంగానే ఉన్నా..నాయకుల వలసలతో పరిస్థితి దిగజారింది. బీజేపీలో మాత్రం అప్పుడూ..ఇప్పుడూ ఎదుగదల ఏమీ లేదు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పూర్తిగా నిండిపోయిన కారు నుంచి ఎవరైనా దిగుతారేమోనని చూస్తున్నాయి. గులాబీ పార్టీలో టిక్కెట్‌రాని మాజీలు పార్టీ మారతారనే ప్రచారం అయితే ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment