సాక్షి, కొత్తగూడెం : ఎదురుదెబ్బలు తింటున్నా కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల తగ్గడం లేదు. రాష్ట్రంలో 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. జిల్లాలో మాత్రం పోడు భూముల అంశం, సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశం టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడంతో.. కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. 2018 శాసనసభ ఎన్నికల్లో జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అత్యధికంగా కేడర్ కూడా ఆ ఎమ్మెల్యేలతో పాటు వెళ్లిపోయింది. అయినా కూడా కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి మాత్రం తగ్గలేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ విషయంలోనూ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. దీంతో జిల్లాలో పార్టీని నడిపించే నాయకత్వం కరువైంది. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో అన్ని విషయాల్లోనూ గ్రూపుల వ్యవహారం నడుస్తోంది.
నాయకులు ఎడవల్లి కృష్ణ, యెర్రా కామేష్‌ల ఆధ్వర్యంలో విడివిడిగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. జిల్లా కేం ద్రం కొత్తగూడెంలో కార్యకర్తల్లో ఒకింత గందరగోళం నెలకొంది. నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రంలో చేపట్టాల్సిన అనేక పార్టీ కార్యక్రమాలు సైతం రెండు వర్గాలు చేస్తుండడంతో ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా పరిస్థితి తయారైంది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టినప్పుడు ఎవరికివారుగా గ్రూపులుగా వ్యవహరించడంతో ఆ కార్యక్రమం అంతగా సక్సెస్ కాలే దు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ గ్రూపులుగా పనిచేయడంతో ఫలితాలు పేలవంగా వచ్చాయి. కాంగ్రెస్‌కు ఓటింగ్ ఉన్నప్పటికీ దాన్ని సమీకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో అవకాశమున్న ఎంపీటీసీలు కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణ సీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్న సమయంలో భట్టి విక్రమార్క ఆందోళన చేపట్టగా అరెస్టు చేసిన సమయంలోనూ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టాల్సిన కలెక్టరేట్ ముట్టడి సైతం ఎడవల్లి, కామేష్ వర్గాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించారు. సోనియా ఇటీవల తిరిగి ఏఐసీసీ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన సమయంలోనూ ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టారు. ఇలా అన్ని రకాల ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఇతర పార్టీ సంబంధ కార్యక్రమాలు విడవిడిగా చేస్తుండడంతో శ్రేణుల్లో ఉత్సాహం కరువైంది. భట్టి, రేణుక సైతం ఈ జిల్లావైపు దృష్టి సారించడం లేదు.
తాజాగా కొత్తగూడేనికి కో ఆర్డినేటర్..
కొత్తగూడెం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు ఈ నియామకం చేపట్టినట్లు పీసీసీ పేర్కొంది. గ్రూపుల గోల నేపథ్యంలో ఈరవత్రి అనిల్ పార్టీ కార్యకర్తలను ఏ మేరకు సమన్వయం చేస్తారనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment