తల్లాడ మండలం బిల్లుపాడులో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ మద్దతుదారులు రెండో విడతలోనూ సత్తా చాటారు. జిల్లాలోని మొత్తం 204 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీకి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో శుక్రవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. మొత్తం 91.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు వరుసలో బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెదురు మదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రాత్రి వరకు కొనసాగింది.
ఈ విడతలో సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు, వైరా నియోజకవర్గంలోని రెండు మండలాల్లోని జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇటు సత్తుపల్లి.. అటు వైరా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల్లో అత్యధిక జీపీలను దక్కించుకున్న టీఆర్‌ఎస్.. ఎన్నికల్లో కూడా తన హవా చాటింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో టీఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధించింది. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాల్లోనూ టీఆర్‌ఎస్ పట్టు నిలుపుకుంది. టీఆర్‌ఎస్ తర్వాతి స్థానంలో స్వతంత్రులు నిలిచారు.
అయితే టీఆర్‌ఎస్‌కు.. స్వతంత్ర అభ్యర్థులకు భారీ వ్యత్యాసం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో అసలు ఖాతా తెరవలేకపోయింది. ఇక టీడీపీ కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో 15 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం 31 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంమీద ఏకగ్రీవాలతో కలిసి టీఆర్‌ఎస్ 139 స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 31, కాంగ్రెస్ 9, టీడీపీ 15, సీపీఐ ఒకటి, సీపీఎం 7, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒకస్థానాన్ని గెలుపొందాయి. వేంసూరు మండలంలో 26 స్థానాలకుగాను.. 21 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, టీడీపీ స్థానాలకు పరిమితమయ్యాయి. సత్తుపల్లి మండలంలో 21 జీపీలు ఉండగా.. 15 జీపీలను టీఆర్‌ఎస్ గెలుపొంది సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడు స్థానాల్లో గెలుపొందాయి. తల్లాడ మండలంలో 27 జీపీలకుగాను.. టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో, సీపీఎం 3, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment