ఆసక్తికరంగా వీఐపీల గ్రామాల పోరు | Telangana Panchayat Election Nomination Nalgonda | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా వీఐపీల గ్రామాల పోరు

Published Wed, Jan 9 2019 10:31 AM | Last Updated on Wed, Jan 9 2019 10:31 AM

Telangana Panchayat Election Nomination Nalgonda - Sakshi

బ్రాహ్మణవెల్లెంల గ్రామ వ్యూ

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ పోరు ఆసక్తి రేపుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడినన్ని పార్టీలు ఈసారి తెరపై కనపడకపోవడం, రెండు ప్రధాన రాజకీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని తలపడనుండడంతో పంచాయతీ పోరు రక్తికడుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ అధిష్టానం మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నాయకులు సవాల్‌గా తీసుకున్నారు. ఇన్నాళ్లు అడపాదడపా మాత్రమే సొంత గ్రామాలవైపు కన్నెత్తి చూసినవారు ఇప్పుడు తమ సొంత ఊళ్లలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలను తమ సొంతూరునుంచే మొదలు పెట్టి ఆదర్శంగా నిలవాలని తలపోస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు.

ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అంతటా రాజకీయమే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన వారిలో అత్యధికులు టీఆర్‌ఎస్‌లో చేరగా, మరి కొందరు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఈసారి గ్రామ పోరు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే హోరాహోరీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆయా పార్టీల్లోని ముఖ్య నాయకుల సొంతూళ్లు ఈ సారి కొత్తగా పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. దీంతో సహజంగానే ఇరు పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
అందరి దృష్టిని ఆకర్శిస్తున్న నకిరేకల్‌ నకిరేకల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో ముఖ్య నాయకులు ఉన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మ¯న్‌ నేతి విద్యాసాగర్, టీచర్స్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌  కేతేపల్లి మండలంచెరుకుపల్లి పంచాయతీకి చెందిన వారు.

నేతి విద్యాసాగర్‌ కృషితో గత ఎన్నికల్లో ఈ పంచాయతీని కాంగ్రెస్‌ ఏకగ్రీవం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ కేతేపల్లి మండలం బీమారం వాసి. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యది నకిరేకల్‌ మండలం నోముల గ్రామం. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిది నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామం. కాంగ్రెస్‌ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి, సీపీఎం సీనియర్‌ నేత చెరుపల్లి సీతారాములు ఇద్దరిదీ చిట్యాల మండలం నేరేడ గ్రామం. ఈ గ్రామాల్లో  పోరు పూర్తిగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మ«ధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వీటిల్లో గత ఎన్నికల్లో నక్కలపల్లి (టీఆర్‌ఎస్‌), నేరేడ (సీపీఎం) గెలుపొందాయి.  నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన వారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉరుమడ్లలో గెలిచిన సర్పంచ్‌.. ఆ తర్వాత కంచర్ల భూపాల్‌ రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .. ఈ ముగ్గురు నార్కట్‌పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన వారే. ఈ గ్రామంలో ఎప్పుడూ కాంగ్రెస్సే విజయం సాధిస్తూ వస్తోంది. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సొంతూరు శాలిగౌరారం మండలం ఉట్కూరు కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో ఈ సారి ఈ నేతల సొంతూళ్లలో ఎన్నిక చర్చనీయాంశమవుతోంది. 
ఇవిగో ... మరికొన్ని వీఐపీ పంచాయతీలు !

  • మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సొంతూరు సంస్థాన్‌ నారాయాణ్‌పూర్‌ మండలం లింగవారిగూడెం. ఈ గ్రామం మొన్నటి వరకు సర్వేల్‌ పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడినుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఈసారి లింగవారిగూడెం కొత్త పంచాయతీగా ఏర్పడింది. దీంతో ఈ గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 
  • మునుగోడు నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సొంత గ్రామం సంస్థాన్‌నారాయణ్‌ పూర్‌. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. 
  • దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ సొంత గ్రామం దేవరకొండ మండలం రత్యతందా. జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌  సొంతూరు సూర్యతండా,  మరోనేత బిల్యానాయక్‌ స్వగ్రామం చింతపల్లి మండలం ప్రశాంతపురి తండా. ఈ మూడు తండాలు ఇప్పుడు కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వంద శాతం తండాల జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడి ఎన్నిక ఆసక్తి గొల్పుతోంది.
  •  నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డి స్వగ్రామం అనుముల, కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో విలీనం అయ్యింది. టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి తిరుమలగిరి మండలం బోయగూడెంవాసి. కోటిరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఈ పంచాయతీ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉంది. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌లోకి మారడంతో ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందా అన్న అంచనాలు మొదలయ్యాయి. 
  •  జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డిది పెద్దవూర కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈసారి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ బలంగానే ఉంటుందని అంటున్నారు. 
  • మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావు స్వగ్రా మం నిడమనూరు మండలం శాఖాపురం. గత ఎన్ని కల్లో కాంగ్రెస్‌ ఈ పంచాయతీని ఏకగ్రీవంగా దక్కిం చుకుంది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌లో ఉండడంతో పోటీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
  • మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సొంతూరు సుబ్బారెడ్డిగూడెం. ఇది ఆలగడప పంచాయతీ పరిధిలో ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. ఈసారి సుబ్బారెడ్డి గూడెం కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. మొత్తంగా రాజకీయ ముఖ్యులకు చెందిన సొంతూళ్లను ఈసారి ఏ పార్టీలు గెలుచుకుంటాయి..? ఇక్కడ సర్పంచ్‌ పీఠం ఎవరి సొంతం కానుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement