నేడు రెండో విడత నోటిఫికేషన్‌ | Panchayat Election Second Phase Notification | Sakshi
Sakshi News home page

నేడు రెండో విడత నోటిఫికేషన్‌

Published Fri, Jan 11 2019 11:40 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Panchayat Election Second Phase Notification - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌:  గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. సొంత పార్టీల నుంచే పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విత్‌ డ్రాకు మరోరెండు రోజుల సమయం ఉండడంతో పోటీ నుంచి తప్పుకునేలా నాయకులు పావులు కదుపుతున్నారు. మొదటి విడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1,264 వార్డు స్థానాలకు గురువారం తెల్లవారుజాము వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. 145 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 819 నామినేషన్లు, 1264 వార్డు స్థానాలకు 2987 నామినేషన్లు  వచ్చాయి.
 
టీఆర్‌ఎస్‌ నుంచి పోటాపోటీ.. 
గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. తమకు కలిసి వచ్చిన రిజర్వేషన్‌ ఆధారంగా సొంత పార్టీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ పంచాయతీలో 12 మంది నామినేషన్‌ వేయగా అందులో 8 మంది టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అలాగే పెద్దతండాలో 10 మందికి 9 మంది, కొంకపాకలో 10 మందికి 8 మంది, రావూరులో ఏడుగురికి ఐదుగురు, దౌలత్‌నగర్‌లో ఏడుగురికి ఐదుగురు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నామినేషన్‌ వేయడం విశేషం. వర్ధన్నపేట మండలంలోని  ఇల్లంద, కట్య్రాల, తాచగుడెం, ల్యాబర్తి, రామోజీ కుమ్మరిగూడెంతండా, దమ్మన్నపేట, రామవరం, కడారిగూడెంలో సైతం ఎక్కువగా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే నామినేషన్లు వేశారు.

సముదాయిస్తున్న నేతలు.. 
సొంత పార్టీ  నుంచే ఇద్దరి నుంచి10 మంది వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో బరి నుంచి తప్పించడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ నుంచే పోటీ ఉంటే  గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వారిని తప్పించడానికి బుబ్జగింపులు మొదలుపెట్టారు. వారి అవసరాలను తెలుసుకుని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నారు. రాబోయే ఎంపీటీసీ, సహకార ఎన్నికల్లో పోటీ చేయిస్తామని భరోసా ఇస్తున్నారు.
  
21 గ్రామాలు ఏకగ్రీవం 
మొదటి విడతలో జరగనున్న 145 గ్రామపంచాయతీల్లో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. అందులో 20జీపీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే దక్కించుకోబోతున్నారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి నుంచి కౌడగాని కవిత ఇండిపెండెంట్‌గా ఎన్నిక కాబోతున్నారు.  పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ నుంచి కె.రామ్మోహన్, చెరువు కొమ్ముతండా నుంచి దేశ్‌రామ్, తూర్పుతండా నుంచి బానోత్‌ విజయ, మల్లెతండా నుంచి బోడ సుజాత, శ్రీనగర్‌ నుంచి పరిటాల సుబ్బారావు, గోరుగుట్టతండా నుంచి బానోత్‌ వెంకన్న, దూపతండా నుంచి జూమిర్రి , జమలాపురం నుంచి పిడుగు రేణుక, దుగ్గొండి మండలం పోనకల్‌  నుంచి బొమ్మగాని ఊర్మిళ, పీజీతండా నుంచి నునావత్‌ మంగమ్మ, గుడి మహేశ్వరం నుంచి అడప సుధాకర్, స్వామిరావుపల్లి నుంచి అంబరగొండ సుమలత, సంగెం మండలంలోని కాపులకనుపర్తి నుంచి ఎర్రబెల్లి గోపాల్‌ రావు, కొత్తగుడెం నుంచి వాసం రజిత, ఎలుగూరుస్టేషన్‌ నుంచి గూగులోతు భద్రమ్మ, బీకోజినాయక్‌ తండా నుంచి బానోత్‌ విద్యారాణి నర్సంపేట మండలంలోని రాజపల్లి నుంచి నామాల భాగ్యమ్మ, బోజ్యనాయక్‌తండా నుంచి భూక్యా లలిత,  వర్ధన్నపేట మండలం బొక్కలగూడెం నుంచి ఆకుల వెంకట్‌ నారాయణ, రామ్‌ధన్‌తండా నుంచి గుగులోతు లక్ష్మి ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.

నేడు రెండో విడత నోటిఫికేషన్‌.. 
గ్రా
మ పంచాయతీ రెండో విడత ఎన్నికల కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. పరకాల, నడికూడ, శాయంపేట, నల్లబెల్లి, ఖానాపురం, రాయపర్తి మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలు, 1210 వార్డు స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్లు స్వీకరిస్తారు. తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

షెడ్యూల్‌.. 
11వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ 
13వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు 
14న నామినేషన్ల పరిశీలన 
17న  నామినేషన్ల ఉపసంహరణ(మధ్యాహ్నం 3గంటల వరకు), అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement