‘పవర్‌’ లేని పదవి | Telangana New Sarpanch Problems With Funds Released | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ లేని పదవి 

Published Fri, Apr 26 2019 9:10 AM | Last Updated on Fri, Apr 26 2019 10:01 AM

Telangana New Sarpanch Problems With Funds Released - Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సర్పంచులు గెలిచి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వారికి చెక్‌పవర్‌ ఇవ్వలేదు. హామీలిచ్చి గెలిచిన నాయకులు మాట నిలబెట్టుకోలేక.. ప్రజలకు సమాధానం ఇవ్వలేక లోలోన మదన పడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు చేయిద్దామని ముందుకు వచ్చే సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. కావాల్సిన నిధులు ఖాతాల్లో పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
 
సొంత ఖర్చులతో పనులు.. 
గెలిచిన ఆనందంలో కొత్త సర్పంచ్‌లు సొంత ఖర్చులతో గ్రామాల్లో కొన్ని పనులు చేయించారు. పంచాయతీ కార్యాలయాల్లో ఫర్నీచర్‌ కొనుగోలు, వీధి లైట్ల మరమ్మతులు, తాగునీటి అవసరాల ఏర్పాట్లు, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం, సిబ్బందికి జీతాలు, మరుగుదొడ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వంటికి చేతినుంచి ఇచ్చి చెక్‌పవర్‌ వచ్చాక బిల్లులు చేసుకుందామని అనుకున్నారు. కానీ ఆ అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల వసూలైన పన్నులతో సిబ్బందికి కొంత వరకు జీతాలు ఇస్తుండగా, మరుగుదొడ్ల నిధులు జీపీల ఖాతాల్లో ఉన్నా విడిపించలేక పోతున్నారు.
 
పెరిగిన అదనపు ఖర్చులు 
గెలిచిన సర్పంచ్‌లంతా ఫిబ్రవరి 2వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. సీట్లో కూర్చొగానే వారికి సమస్యలు స్వాగతం పలికాయి. వీధి లైట్లు, గేట్‌వాల్వ్‌లు లీకవుతున్నాయని, నెలల తరబడి మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలని ప్రజలనుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం పాడైన విద్యుత్‌ మోటార్ల స్థానంలో కొత్తవి బిగించాలని కోరారు. దీంతో గెలిచిన ఉత్సాహంతో సర్పంచ్‌ ప్రజల విన్నపాలకు స్పందించి సొంత ఖర్చులతో పనులు చేయించారు. తెలిసిన వారి దుకాణాల్లో ఖాతాలు తెరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. చెక్‌పవర్‌ రాబోతుందని తెలిసి నిధులు డ్రా చేసి బకాయిలు చెల్లించవచ్చని భావించారు. తీరా నెలలు గడుస్తున్నా సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ రాలేదు. దీంతో బిల్లుల చెల్లింపు పెండింగ్‌ పడింది.

సిబ్బంది వేతనాలకూ ఇబ్బంది 
మండల కేంద్రాలుగా పంచాయతీల్లో సుమారు 10 మంది వరకు సిబ్బంది పని చేస్తుంటారు. చిన్న పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు పని చేస్తారు. కారోబార్లు, బిల్‌ కలెక్టర్లు, పంప్‌ ఆపరేటర్లు, విద్యుత్‌ మెకానిక్‌లు, రోడ్లు, మురికి కాల్వలు శుభ్రం చేసే కార్మికులు ఉంటారు. పన్నుల రూపేన వసూలు చేసిన డబ్బులను ఉద్యోగులు ఏ రోజుకారోజు జీపీ ఖాతాలో జమ చేస్తారు. వీరందరికి ప్రతి నెల పంచాయతీ నుంచే జీతాలు చెల్లించాలి. కొత్త సర్పంచ్‌లు తమ జీపీ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించ లేకపోతున్నారు. కొన్ని చోట్ల పన్నుల రూపేన వసూలు  చేసిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఒక్కొక్కరికి జీతాలు చెల్లిస్తారు.

అభివృద్ధిపై ప్రభావం 
కొత్త పాలకులు కొలువుదీరినా అధికారాలు బదిలీ కాకపోవడంతో గ్రామ పాలన పూర్తిగా గాడి తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ప్రకటించినట్లుగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ అప్పగించిన కొంత మేరకు గ్రామ సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ అప్పగించిన కొంత మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కానీ చెక్‌ పవర్‌ సర్పంచ్‌లకు ఇస్తే నిధులు దుర్వినియోగం జరుగుతుందన్న వాదన కూడా లేక పోలేదు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో తాగునీరు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పనులకు సర్పంచ్‌లు సొంత ఖర్చులతో చేయిస్తుండడంతో వారి బేబులకు చిల్లు పడుతున్నాయి.

మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులకు బ్రేక్‌ 
కేంద్రం ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టింది. పంచాయతీల ద్వారా ఒక్కో మరుగుదొడ్డి నిర్మించినందుకు గాను రూ.12 వేలు అందిస్తోంది. లబ్ధిదారులకు మొదటి దఫా 6 వేలు, రెండో దఫా 6 వేల చెక్కుల రూపంలో అందుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్ధిదారుల పేర్లపై బిల్లులు చేసి జీపీ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ లేని కారణంగా కూడా బిల్లులకు బ్రేక్‌ పడినట్లవుతోంది.

కారణాలేంటో
కొత్త సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రాకపోవడానికి పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో మాట్లాడగా కొన్ని కారణాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన పంచాయతీ రాజ్‌ చట్టం–2018లో తొలుత సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కలిపి చెక్‌పవర్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ స్థానంలో పంచాయతీ కార్యదర్శలకు చెక్‌పవర్‌ ఇవ్వాలని పేర్కొనలేదు. దీంతో సర్పంచ్‌లతో కలిపి ఎవరికీ చెక్‌పవర్‌ ఇవ్వాలో తేలలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్పా తామేమి చేయలేమని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.  

అప్పుల పాలవుతున్నాం  
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిధుల్లేక చేతినుంచి పెట్టుకుని అప్పుల పాలవుతున్నాం. ఎన్నో ఆశలతో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యాం. కానీ చెక్‌ పవర్‌ లేక ప్రజల సమస్యలను పరిష్కరించలేక పోతున్నాం. కనీసం నీటి సమస్య, వీధి లైట్ల సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. చెక్‌ పవర్‌ను త్వరగా ఇస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.  – శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాపూర్‌ సర్పంచ్‌ 

ఓపిక పట్టండి.. తప్పదు 
సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే ఎంపీడీఓలకు ఆదేశాలు ఇస్తాం. ఎంపీడీఓలు తమ పరిధిలో గల బ్యాంకులకు లేఖలు రాస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేదాక సర్పంచ్‌లు ఓపిక పట్టాలి తప్పదు.  – వెంకటేశ్వర్లు, డీపీఓ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement