ఉదయగిరి రూరల్/ సంగం, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై నెల రోజులు దాటినా ఇంత వరకూ ‘పవర్’ దక్కలేదు. గ్రామాల అభివృద్ధిలో కీలకమైన సర్పంచ్‌లకు ‘చెక్’ పెడుతూ పవర్‌కు ఆంక్షలు విధించింది. రెండేళ్లుగా పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన కొనసాగింది. సర్పంచ్‌లు ఎన్నికైనా ‘చెక్‌పవర్’ లేకపోవడం, సమైక్య ఉద్యమం ప్రభావంగా ప్రస్తుతం అనివార్యంగా ప్రత్యేక పాలనే అమలవుతోంది. ప్రస్తుత పరిణామాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ ఎన్నికలు ముగిసీ ముగియక ముందే సోనియాగాంధీ సీడబ్ల్యూసీ నిర్ణయంగా రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రకటించింది. దీంతో సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల పవర్‌పై ఆంక్షలు విధిస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విధాన నిర్ణయాన్ని సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఏపీ ఎన్జీఓల సమ్మె కారణంగా కొత్త ఉత్తర్వులు కూడా సంబంధిత పంచాయతీ కార్యాలయాలకు అందలేదు. పంచాయతీ కార్యదర్శులూ సమ్మెలో ఉన్నారు. జాయింట్ చెక్‌పవర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నా.. మండల పరిషత్‌ల నుంచి జిల్లా కలెక్టరేట్ల వరకు అన్నీ మూతపడి ఉండటంతో సర్పంచులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్‌లకు మాత్రమే చెక్ పవర్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల డ్రా చేసుకునే వీలు కూడా లేదు. పంచాయతీల బిల్లులు, చెక్‌లు క్లియర్ చేసే ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పంచాయతీ నిధుల్లో రూపాయి ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన తలపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, సమస్యల పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది.
మురుగు కూపాలుగా పల్లెలు
సర్పంచ్‌ల పాలన వచ్చినా తాజా పరిస్థితుల్లో ప్రత్యేక పాలనే తలపిస్తోంది. ఫలితంగా పారిశుధ్యం, తాగునీరు సమస్యలు జఠిలమవుతున్నాయి. ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఇటీవల అడపా దడపా వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కాలువల్లో మురుగు పేరుకుపోయి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
వీధిలైట్లు వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రోడ్డు నిర్మాణం, ట్యాంకుల్లో క్లోరినేషన్ వంటి పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. పంచాయతీల్లో నూతన పాలక వర్గం కొలువు తీరినా సర్పంచ్‌లకు చెక్ ‘పవర్’ లేకపోవడంతో ఈ దుస్థితి నెల కొంది. కొన్ని గ్రామాల్లో ఆర్థిక స్తోమత ఉన్న సర్పంచ్‌లు తమ సొంత నిధులు వెచ్చించి తాగునీరు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఖాతాల్లో నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగించుకునేందుకు చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది. సంగం మండలంలోని సిద్దీపురం, దువ్వూరు, సంగం, కొరిమెర్ల, చెన్నవరప్పాడు పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీరు సమస్యలు తిష్టవేశాయి.
ము రుగునీరు ముందుకు కదలక దోమలు ప్రబలుతున్నాయి. గతంలో సంగంలో డెంగీతో అనేక మంది మృత్యువాత పడిన దాఖలాలు ఉన్నాయి. రెండు రోజులుగా ఆత్మకూరు, వింజమూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో విష జ్వరం, డెంగీతో పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ చిత్తడిగా మారాయి. ఇప్పటికైనా కొత్త సర్పం చులు, అధికారులు చొరవ తీసుకోకపో తే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
దోమల బెడద ఎక్కువైంది
చెత్తా చెదారం నిల్వతో దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి.
వెంకటలక్ష్మమ్మ, కొరిమెర్ల, సంగం
పడకేసిన పాలన
Published Sun, Sep 15 2013 5:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement