సాక్షి, నెల్లూరు : వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణాల్లో జనం బయటకు రావడానికే భయపడుతుండగా వేలాది ఎకరాల్లో సాగుచేసిన నిమ్మ, అరటి, బత్తాయి, మామిడితో పాటు కూరగాయల తోటలు విద్యుత్ కోతల పుణ్యమాని నిలువునా ఎండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు లబోదిబోమంటున్నారు.
మరోవైపు ఆక్వారంగానికి కూడా విద్యుత్ కోతలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాకు రోజుకు దాదాపు పది మిలియన్ల విద్యుత్‌ను కోటాగా ఇస్తున్నారు. ఇందులో నగర వినియోగం దాదాపు 40 శాతంగా ఉంటోంది. గృహ విద్యుత్ కనెక్షన్లు 8.84 లక్షలుండగా కమర్షియల్ కనెక్షన్లు 71వేలు, వ్యవసాయ కనెక్షన్లు 1.35 లక్షలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులు 41వేల వరకు ఉన్నాయి. వేసవి నేపథ్యంలో ఇటీవల కాలంలో గృహ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇది రోజు రోజుకు పెరుగుతోంది.
ఇండస్ట్రియల్ లోడు సైతం పెద్ద ఎత్తున పెరగడంతో విద్యుత్ కొరత అధికంగా ఉంది. సెంట్రల్ పవర్‌గ్రిడ్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌కు వాటా 25 శాతంలోపే ఉంటోంది. దీంతో రైతన్నలకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. పేరుకు ఏడు గంటలని చెబుతున్నా కనీసం రెండు లేదా మూడు గంటల విద్యుత్ కూడా అందడం లేదు. పైగా అది కూడా విడతల వారీగా ఇస్తుండడంతో రైతులకు ప్రయోజనం కరువైంది. కరెంటు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీని కోసం రైతులు మోటార్ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయినా ప్రయోజనం లేక జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి, మినుము, నువ్వు, పత్తి, బత్తాయి తదితర పంటలు నిలువునా ఎండి పోతున్నాయి.
ఆందోళన చెందిన అన్నదాతలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండడంలేదు. పంటలు ఎండి పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రోజుకు కనీసం ఐదు గంటలకు తగ్గకుండా ఒకేసారి విద్యుత్ సరఫరా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక పట్టణాల్లో విద్యుత కోతల పుణ్యమా అని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు.
కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా వరి, కొంత మేర చెరకు సాగులో ఉంది. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో వరిపంట అధికంగా సాగు చేశారు. బోర్ల నుంచే నీటిని తోడి పంటను పండించుకోవాల్సి వస్తుంది. విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో వరితో పాటు మిగిలిన పంటలూ దెబ్బతింటున్నాయి. కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ రావడం లేదని రైతులు వాపోతున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఆక్వాకు విద్యుత్ కోతలతో మరింత ఇబ్బందులు ఎదురౌతున్నాయి. 7 గంట లు అన్న విద్యుత్ నాలుగు గంటలు కూడా వచ్చేపరిస్థితి లేకుండా పోతోంది. ఇక పొదలకూరు మండలంలో రైతలు నిమ్మ, అరటి తదితర పంటలు సాగుచేశారు. విద్యుత్ కోతల పుణ్యమాని పండ్లతోటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలోని టీపీగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం ప్రాంతాల్లో వేల ఎకరాల్లోఆక్వా సాగు జరుగుతోంది. విద్యుత్ కోతలు అధికం కావడంతో పంటలు ఎండుతున్నాయి.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, కలిగిరి, వింజమూరు ప్రాంతాల్లో మొక్క జొన్న, నువ్వు, పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. నాలుగువేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. విద్యుత్ కోతలతో అన్ని పంటలు ఎండి పోతున్నాయి.
వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, రాపూరు ప్రాంతాల్లో సుమారు 3వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగు చేశారు. విద్యుత్ కోతల పుణ్యమాని నిమ్మతోటలు ఎండి పోతున్నాయి.
రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ రావడం లేదని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు నియోజకవర్గంలో గూడూరు రూరల్, చిల్లకూరు ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలు సాగు చేశారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో కూరగాయల సాగు సైతం అధికంగా ఉంది. ఇదే సమయంలో విద్యుత్ కోతలు పెరిగి తోటలకు నీటి తడులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పర్యవసానంగా తోటలు ఎండుతున్నాయి. నష్టాలు తప్పవని రైతన్నల్లో ఆందోళన నెలకొంది.
కోతల వెతలు
Published Mon, May 19 2014 2:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement