సాక్షి, నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన పడింది. సర్వేపల్లి నియోజక వర్గంలో అత్యధికంగా 16 సెంటిమీటర్లు వర్షపాతం నమోదు కాగా కావలి నియోజకవర్గంలో 15 సెంటీ మీటర్లు, కోవూరు నియోజక వర్గంలో 14 సెంటీ మీటర్ల వర్షం పాతం నమోదైంది. నెల్లూరులో 8 సెంటీ మీటర్లు, సూళ్లూరుపేట, ఆత్మకూరులలో 7 సెంటీమీటర్లు, వెంకటగిరి, గూడూరులలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయగిరి నియోజకవర్గంలో అత్యల్పంగా 2 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వ ర్షం. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం వల్ల పెద్దగా నష్టం లేక పోగా జిల్లాలో వరిసాగుకు మరింత అనుకూలంగా ఉంటుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారుమళ్ల ఏర్పాటుతోపాటు ఇప్పటికే నారుమళ్లు పోసి ఉంచిన బోరుబావుల కింద నాట్లు వేసేందుకు మరింత అనువుగా మారింది. మరో రెండుమూడు రోజు లు వర్షం కురిస్తే చెరువులు,కుంటలలోకి నీళ్లు చేరే అవకాశముంది. వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు లాంటి మెట్ట ప్రాంతాల్లో చీనీ, నిమ్మ, మామిడి తదితర ఉద్యాన వన పంటలకు వర్షం ఉపయోగకరంగా మారింది. సోమశిల నుంచి పది రోజుల్లో నీటిని విడుదల చేస్తున్న సమయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షం మరింత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
కావలిలో అధిక వర్షం కురిసింది. పెద్దపట్టపుపాళెం, చెన్నాయపాళెం, నందిమాపురం, తుమ్మలపెంట, తాళ్లపాళెం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ లేన్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గూడూరులో భారీవర్షం కురవడంతో రైతులు నారుమళ్లకు సిద్ధమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పైర్లకు, ముఖ్యంగా 25 వేల హెక్టార్లలో సాగులో ఉన్న నిమ్మకు వర్షం మరింత ఉపయోగకరం. సర్వేపల్లి నియోజక వర్గంలో టీపీగూడూరు, ముత్తుకూరు, మండలాల్లో మధ్యాహ్నం నుంచి కుంభవృష్టి కురింది. ఈ వర్షాల వల్ల నార్లు పోసుకోనేందుకు అవకాశం కలిగింది.
ఉదయగిరి నియోజక వర్గంలో 25 వేల ఎకరాల మినుము పంటకు, మెట్టపైర్లకు ఉపయోగం. 12వేల ఎకరాలలో సాగైన పసుపు, కంది తదితర పంటలకు లాభదాయకంగా మారింది. సూళ్లూరుపేటలో భారీవర్షం కురిసింది. వరిపంటకు 900 ఎకరాల్లో ఎలిది పైర్లకు లాభం. 120 హెక్టార్లలో నారుమళ్లు పోసుకోగా, 6 వేల ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమవుతున్నారు. 700 హెక్టార్లలో నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమవుతన్నారు. వర్షం మరో రెండురోజులు కురిస్తే అన్ని చెరువుల్లోకి నీరు చేరుతుంది. వరిసాగుకు మరింత అనుకూలం. కోవూరు నియోజక వర్గంలో భారీవర్షం కురిసిం ది. బుచ్చిలో ప్రభుత్వ పాఠశాలల, హాస్టళ్ల భవనాలు ఉరిశాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎడతెరపిలేని వాన
Published Wed, Oct 23 2013 3:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement