సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల్లో సారథులు కొలువుదీరే వేళ ఆసన్నమైంది. పురపాలకులకు నేడే పట్టాభిషేకం జరగనుంది. ము న్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇటు నాయకులు, అటు అధికారు లు బిజీబిజీగా ఉన్నారు.
జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో గురువారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల క్యాంపు రాజకీయాలకు తెరపడనుంది. 4న మండల పరిష త్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఇంకా క్యాంపుల్లోనే కొనసాగుతున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెల కొనడంతో ఆయా పార్టీల నాయకులు బుధవారం రాత్రే నిజామాబాద్‌కు చేరుకున్నారు. గురువారం జరిగే కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల ఎన్నికలపై వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు జరిగే వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.
వ్యూహప్రతివ్యూహాలు
పరోక్ష ఎన్నికల్లో తమదే విజయం కావాలని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరి నిమిషం వరకు సర్వశక్తులొడ్డేందుకు.. తమ అస్త్రశస్త్రాలన్నీ సంధించేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు గురువారంతో ఎన్నికలు ముగియనుండగా.. శుక్ర, శనివారాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పటికే టీఆర్‌ఎస్ కైవసం కాగా.. అత్యధిక ఎంపీపీ స్థానాలను సాధించుకునేందుకు ఇరుపార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.
దీంతో జిల్లాలో పరోక్ష పోరు రసవత్తరంగా మారనుంది. ఇంతకాలం బుజ్జగింపులు, సమీకరణలు, వ్యూహప్రతివ్యూహాలు, చేరికలపై దృష్టి సారించిన ఈ పార్టీల నేతలు బుధవారం నుంచి మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మకాం వేసి రాజకీయాలు నడిపిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌కు చేరుకున్నారు.
‘గీత’ దాటొద్దు
మున్సిపల్, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు విప్ జారీ చేశాయి. నిజామాబాద్ మేయర్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ, ఎంఐఎంల మద్దతు లేకుండా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీల్లో గట్టెక్కే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ, ఎంఐఎంలు సైతం తమ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు బుధవారం సాయంత్రం విప్ జారీ చేశాయి. నిజామాబాద్‌లో అందుబాటులో లేని కొందరు కార్పోరేటర్ల ఇళ్లకు ‘విప్’ పత్రాలను అంటించారు.
పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ఇలా
మున్సిపల్, పరిషత్ పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 3, 4, 5 తేదీలలో వరుసగా జరిగే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించనున్నారు.
గురువారం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఉదయం 11గంటలకు ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరై ఎన్నుకోవాల్సి ఉంటుంది. పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం అదేరోజు మొదటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తారు.
శుక్రవారం జిల్లాలోని 36 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అంతకంటే ముందు మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రకటిస్తారు. 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అనంతరం మొదటి సర్వసభ్య సమావేశం ఉంటుంది.
శనివారం జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఒక్కరోజు ముందుగా ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటన, సమావేశం ఉంటుంది. 5న ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం మూడుగంటల తర్వాత జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక జరుగుతుంది. అనంతరం జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు.
ఎవరి జెండా ఎగురునో!
Published Thu, Jul 3 2014 2:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement