వేడెక్కిన బల్దియా | have suspense on corporation mayor positions | Sakshi
Sakshi News home page

వేడెక్కిన బల్దియా

Published Tue, Jul 1 2014 4:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వేడెక్కిన బల్దియా - Sakshi

వేడెక్కిన బల్దియా

కార్పొరేషన్, మున్సిపాలిటీల పరోక్ష ఎన్నికలకు రెండురోజులే గడువు ఉంది. బల్దియాల్లో బలప్రదర్శన చాటుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే క్యాంపులకు తెరదీశాయి.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్  కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలి టీల కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఐదురోజుల నుంచి క్యాంపుల్లోనే ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలి చిన వారిలో సైతం కొందరు టీఆర్‌ఎస్.. మరికొందరు కాంగ్రెస్ శిబిరాల్లో కొనసాగుతున్నారు. కాస్తోకూస్తో బలమున్న ఇతర పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు టీ ఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతున్నా యి.
 
నిజామాబాద్ కార్పొరేషన్‌లో కీలకంగా మారిన ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతు కోసం ఇరు పార్టీలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీరిలో ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయమై తేలడం లేదు. కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియోలుగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు కాం గ్రెస్ ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, డి.రాజేశ్వర్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తమ ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, అరికెల నర్సారెడ్డి మాత్రం తమ ఓటుహక్కును నమోదు చేసుకోలేదు.
 
మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్

నిజామాబాద్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు ఎం ఐఎం ఎవరితో కలిసి నడుస్తుందనే సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు 16, ఎంఐఎంకు 16, టీఆర్‌ఎస్‌కు 10, బీజేపీ 6డివిజన్లు దక్కగా, రెండుచోట్ల స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తే ఆ రెండు పార్టీల కార్పొరేటర్ల సంఖ్య 26కు చేరనుంది. టీఆర్‌ఎస్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఓటుతో మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. ఈ దిశగానే టీఆర్‌ఎస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక 16 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులను కలుపుకుని 18 మందితో క్యాంపు వేసింది.
 
బీజేపీకి చెందిన ఆరుగురి మద్దతునూ కూడగడితే.. ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, రాజేశ్వర్ ఓట్లను కలిపితే కాంగ్రెస్ బలం 26కు చేరుతుంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్-టీఆర్‌ఎస్ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బులు ఎర వేసి కార్పొరేటర్లను లాగేందుకు పోటీపడుతుండటంతో మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ నుంచి 47వ డివిజన్ కార్పొరేటర్ కాపర్తి సుజాత పేరు ఖరారు కాగా, టీఆర్‌ఎస్ నుంచి 49వ డివిజన్‌కు చెందిన వైశాలినిరెడ్డి, 7వ డివిజన్‌కు చెందిన సూదంలక్ష్మీల పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి.
 
కామారెడ్డి కాంగ్రెస్‌కే

కామారెడ్డ్డి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 17, టీఆర్‌ఎస్ 8, బీజేపీ 5, ఎంఐఎం, సీపీఎం, ఇండిపెండెంట్ ఒక్కొక్క స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉండటంతో మున్సిపల్ చైర్మన్‌గా చాట్ల లక్ష్మి ఎన్నికయ్యే అవకాశం ఉంది. వైస్‌చైర్మన్ పదవికి కాంగ్రెస్‌కే చెందిన నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాస్ లక్ష్మణ్‌రావు పోటీ పడుతున్నారు.
 
కిడ్నాప్‌లతో ఆర్మూర్‌లో ఉద్రిక్తత
కౌన్సిలర్ల కిడ్నాప్‌లతో ఆర్మూరు మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. టీఆర్ ఎస్‌కు చెందిన కౌన్సిలర్ సుంకరి రంగన్నను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీఆర్‌ఎస్ నాయకులు శంకర్‌ను వెదికే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్(చిన్నా)తో పాటు పలువురు మాజీ నక్సల్స్‌పై కేసులు పెట్టారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 11 స్థానాలను కాంగ్రెస్, పది స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకున్నాయి. బీజేపీ, టీడీపీలు చెరొక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. చైర్మన్ పీఠం మహిళకు రిజర్వు అయింది.
 
టీఆర్‌ఎస్ నుంచి కశ్యప్ స్వాతిసింగ్ బబ్లు, కాంగ్రెస్ నుంచి శ్రీదేవిశ్రీనివాస్ పోటీ పడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్లుగా సమ్మతం తెలుపడంతో టీఆర్‌ఎస్ బలం పెరిగింది. కీలకంగా మారిన బీజేపీ, టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇరు పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. 20వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ సుంకరి రంగన్నను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేయడం వివాదాస్పదమైంది.
 బోధన్‌లో ఎంఐఎం కీలకం
 
బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 35వార్డులున్నాయి. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. కాంగ్రెస్ 15, టీఆర్‌ఎస్ 9, ఎంఐఎం 7, బీజేపీ 3, టీడీపీ 1 వార్డులో గెలుపొందాయి. చైర్మన్ పదవికి 18మంది కౌన్సిలర్ల సంఖ్య అవసరం. ఇక్కడ ఎంఐఎం కీలకంగా మారింది. మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు హోరాహోరీగా పోటీ పడుతుండటం జిల్లాలో బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement