కల నెరవేరెను..!
► మంత్రి హోదాలో జెడ్పీలో అడుగుపెట్టిన కళా వెంకటరావు
► ఎమ్మెల్యేగా దూరంగా ఉన్న వైనం
అరసవల్లి(శ్రీకాకుళం): ‘‘జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయాలు నెరిపిన నేత ఆయన. విభిన్నమైన శైలితో ఉన్నత స్థానాలను దక్కించుకోవడం అతని ప్రత్యేకత. మనసులో ఏం అనుకున్నా...అది జరిగేంత వరకు బయట పడకుండా వ్యవహారం నడిపే నాయకుడాయన... ఆయనే తాజాగా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు. అనుకున్నది ఎట్టకేలకు సాధించుకుని కల నెరవేర్చుకున్నారు’’.
ఇంతకీ విషయం ఏమిటంటే!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన కళా ..జిల్లా పరిషత్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు. దీని వెనక పెద్ద కథే ఉంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్‌లోనే మంత్రి పదవి ఆశించినప్పటికీ.. కళాకు కాదని, ఆయన వ్యతిరేకవర్గ నేత అచ్చెన్నాయుడికి మంత్రి పదవి వరించింది. దీంతో కళాకు ఆశాభంగమే మిగిలింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజావసరాలు, బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే కీలకమైన జనరల్ బాడీ, స్థాయీ సంఘ సమావేశాలు, బడ్జెట్, డీఆర్సీ తదితర సమావేశాలు జరుగుతుంటాయి.
వీటికి తప్పనిసరిగా జిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతి ఎమ్మెల్యే హాజరుకావాలి. తమ నియోజకవర్గంలో సమస్యలు తెలియజేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే హోదాతో జెడ్పీ సమావేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కాకూడదని, ఎలాగైనా మంత్రిగానే వేదికపై కూర్చోవాలనే ప్రధాన లక్ష్యంగా మనస్సులో గట్టి నిర్ణయమే పెట్టుకున్నారట..కళా...! పైగా జెడ్పీలో జరిగే సమావేశాలకు మంత్రులు మాత్రమే ప్రధాన డయాస్‌లో కూర్చొనగా, ఎమ్మెల్యేలంతా క్రింద వరుసలోనే కేటాయించిన సీట్లలోనే కూర్చోవాల్సి ఉంది.
ఇదే క్రమంలో తన వైరివర్గ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా డయాస్ పైన కూర్చుంటే...సీనియర్‌గా ఉన్న తాను కింద వరుసలో కూర్చుని అతడి ఆదేశాలు పాటించడమా...అనేది కళా అవమానంగా భావించారని సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. దీంతో ఎలాగైనా తాను కూర్చుంటే డయాస్ పైనే కూర్చుంటానని, అంతవరకు జెడ్పీలో అడుగుపెట్టనని ఆయన పంతం పట్టారని అతని సన్నిహితులు చెబుతారు.
మూడేళ్ల తర్వాత ..
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత.. టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత జెడ్పీలో ఈ మూడేళ్లలో 36 సమావేశాలు జరిగాయి. అయితే ఎమ్మెల్యేగా జెడ్పీలో గానీ, జెడ్పీ సమావేశాలకు గానీ ఒక్కసారి కూడా అడుగు పెట్టని కళా...సరిగ్గా మూడేళ్ల తర్వాత తాను అనుకున్నట్లుగానే మంత్రిగానే సోమవారం తొలి అడుగు వేశారు. వ్యూహాత్మకంగా సమావేశానికి ఆలస్యంగా వచ్చి, పెద్ద సంఖ్యలో తన అనుయాయులతో జెడ్పీలో అడుగుపెట్టారు. వచ్చీ రాగానే నేరుగా ప్రధాన వేదికపైకి ఎక్కి.. నవ్వుతూ అందరినీ ఆకర్షించారు.
తొలిసారి జెడ్పీలో మంత్రిగా అడుగుపెట్టడం, అధికారులు, ప్రజాప్రతినిధుల సన్మానాలతో తన కల నెరవేరిందని చెప్పకనే చెప్పారు. ఇదిలావుంటే సోమవారం జెడ్పీలో జరిగే పంచాయితీరాజ్ దినోత్సవానికి మంత్రి కళా వస్తున్నారని తెలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అప్పటికప్పుడు వేరే ప్రోగ్రాం ఎంగేజ్ చేసుకున్నారని అధికారులు, కొందరు నేతలు చర్చించుకున్నారు.