మద్యం దుకాణాలకోసం టెండర్ వేసేందుకు జనం పోటెత్తారు. శనివారం చివరిరోజు కావడంతో జిల్లావ్యాప్తంగా ఎంతోమంది దరఖాస్తుదారులు రావడంతో జిల్లాపరిషత్ సమావేశమందిరం కిటకిటలాడింది. రాత్రి వరకూ దరఖాస్తులు స్వీకరించడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా పరిషత్ కొత్త సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ టెండర్ల స్వీకరణకు జిల్లావ్యాప్తంగా దరఖాస్తు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఈ సారి టెండర్లు రెండేళ్ల కాలపరిమితికి మంజూరు చేయనుండటంతో గిరాకీ ఎక్కువైంది. గతంలో టెండరు వేసేందుకు దరఖాస్తు రూ. 25వేలు ఉండగా ఈ ఏడాది రూ. 40వేలకు పెంచారు. అయినా పోటీ తగ్గలేదు.
కిక్కిరిసిన జడ్పీ సమావేశమందిరం
టెండర్ల దాఖలుకు శనివారం చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో జడ్పీ సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. అందులోనూ పచ్చచొక్కల హడావుడి అధికంగా కనిపించింది. కొందరికిదరఖాస్తు నింపే విధానం తెలియక ఇబ్బందులు పడ్డారు. ఎక్సైజ్ డీసీ పి.నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల స్వీకరణలో పలాస, శ్రీకాకుళం సూపరింటెండెంట్లు ఎస్.సుఖేష్, ఏసుదాసు, సీఐలు పి. శ్రీనివాసరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి వరకూ లెక్కింపు
జిల్లాలో రెండు ఎక్సైజ్ సూపరెంటె ండెంట్ కార్యాలయాల పరిధిలో 14 సర్కిళ్లు ఉన్నాయి. సర్కిల్‌కి ఒక బాక్సు వంతున దరఖాస్తులు వేసేందుకు ఏర్పాటు చేశారు. జిల్లాలో 232 మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో ప్రభుత్వం నేరుగా 23 షాపులు నిర్వహించాలని నిర్ణయించగా, మగిలిన 209 షాపులకు దరఖాస్తులను కోరారు. ఒక్కో దరఖాస్తు ఖరీదు రూ. 40వేలుగా నిర్ణయించారు. మూడు రోజుల్లో 209 షాపులకు సుమారు 2500 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 9గంటలకు లెక్కించినవి 2100కాగా ఇంకా అర్ధరాత్రి వరకు లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల ద్వారాసుమారు రూ. 8.4 కోట్లు ఆదాయం వచ్చింది. ఇంకా లెక్కించాల్సిన దరఖాస్తులు మరో 500 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ లెక్కిస్తే మరింత ఆదాయం సమకూరవచ్చు. ఈ నెల 30న లాటరీ విధానంలో షాపులు ఖరారు చేయనున్నారు.
టెండర్ల కోలాహలం
Published Sun, Jun 28 2015 2:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement