* జెడ్పీ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు
* ప్రభుత్వ నిబంధనలకు పాతర
* నేటితో బదిలీలకు తెర
ఏలూరు టూటౌన్ : జిల్లా పరిషత్‌లో ఎంపీడీవోలు, ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి జెడ్పీ చైర్మన్, సీఈవో తమ ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 979 నంబర్ జీవోను తుంగలోకి తొక్కుతున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. జెడ్పీలోని కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బదిలీల్లో సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కోరుకునే వారి వద్ద రూ. 25 నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. నాలుగు రోజులుగా ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద నుంచి భారీస్థాయిలో సిఫార్సు లేఖలు జెడ్పీ సీఈవో, చైర్మన్‌కు అందాయి. నిబంధనల ప్రకారం ఎంపీడీవోలకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీలు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కోరిక మేరకు బదిలీలు జరుగుతున్నాయి.
జిల్లా పరిషత్‌లో మినిస్ట్రీరియల్ ఉద్యోగులైన సూపరింటెండెంట్‌లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లతో కలిపి మొత్తం వెయ్యి మంది వరకు ఉద్యోగులున్నారు. వీరిని జీవో నంబర్ 709 ప్రకారం 5 సంవత్సరాలు నిండిన వారిని 20 శాతం బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో జరపాల్సి ఉంది. అయితే ఆ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. గతంలో జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో యూనియన్ నాయకులతో కూడా సీఈవో, చైర్మన్ సంప్రదింపులు జరిపేవారు. కాని ఈసారి దానికి విరుద్ధంగా తమ ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల మేరకే చేస్తాం : ఇన్‌చార్జి సీఈవో పి.సుబ్బారావు
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బదిలీల నిబంధనల మేరకే చేస్తామని ఇన్‌చార్జి జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా కౌన్సిలింగ్ జరపాలనే నిబంధన లేదు. అందుకే ఉద్యోగుల ద్వారా అన్‌లైన్‌లో ఆప్షన్ తీసుకుని బదిలీలు చేస్తున్నాం. జీవో నెం.709 ప్రకారం బదిలీ చేయాలన్న నిబంధనతో ఫైల్ తయారు చేసి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు పంపామని చెప్పారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఎవరైనా డబ్బులు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డబ్బు ఇచ్చుకో.. కోరిన చోటకు బదిలీ పుచ్చుకో
Published Sat, Nov 22 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement