జిల్లా పరిషత్‌లో నెలకొన్న ఉత్కంఠ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది.
ఒంగోలు: జిల్లా పరిషత్‌లో నెలకొన్న ఉత్కంఠ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు ఉదయం 10 గంటలకే ఈదర హరిబాబు చేరుకున్నారు. గురువారం ఎదురైన అనుభవమే శుక్రవారం కూడా సాక్షాత్కరించింది. అయితే తొలిరోజు కనీసం కుర్చీ కూడా లేకుండా మెట్లమీదనే కూర్చోగా, శుక్రవారం జెడ్పీ సిబ్బంది మాత్రం ఒక బల్ల, కుర్చీ ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్ ఛాంబర్‌తోపాటు సీఈవో గదికి కూడా తాళాలు వేసి ఉండడంతో ఈదర హరిబాబు తన నిరసనను రెండో రోజు కూడా మెట్లమీదనే నిరసన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం భోజన సమయం వరకు కూడా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. దీనిపై ఈదర హరిబాబు మాట్లాడుతూ తాను కోర్టు ఉత్తర్వులను ఇచ్చినపుడే తాను జెడ్పీ చైర్మన్ కాదని సీఈవో స్పష్టం చేసి ఉంటే తాను జెడ్పీ కార్యాలయం వద్దకు కూడా వచ్చి ఉండేవాడిని కాదన్నారు. కానీ ఆ సమయంలో తనకు చెప్పకపోగా రెండుసార్లు తన అనుమతితో శెలవు తీసుకున్నారని, అందువల్ల తాను జిల్లా పరిషత్ చైర్మన్‌గా గుర్తించినట్లే అన్నారు. కానీ నేడు న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించకపోగా, తాను జెడ్పీ చైర్మన్‌గా ఉన్న జెడ్పీలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తట్టుకోలేకే తాను మెట్లమీదనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నానన్నారు.
తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనకు కలెక్టర్ భవనం నుంచి వచ్చిన ఉత్తర్వులతోటే గ్రహణం పట్టిందని, అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తనకు గ్రహణం వీడిందన్నారు. కానీ సూర్యగ్రహణం వీడినా ఇంకా చంద్రగ్రహణం వీడలేదంటూ ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ, అధికారులు సహకరించి తనకు అవకాశం కల్పించి తనకు పరిపాలన చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు నూకసాని బాలాజీతోపాటు పోలీసులు కూడా జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకొని చైర్మన్ ఛాంబర్‌కు ఈదర హరిబాబు వేసిన తాళం తీపిస్తారంటూ ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున జనం కూడా గుమికూడారు.