- జెడ్పీకాంప్లెక్స్ నిర్మాణ పనులకు మరోసారి గడువు పొడిగింపు
- అంచనావ్యయం పెంచేందుకు పావులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం అనవసర ప్రేమను కురిపిస్తోంది. నాలుగేళ్లయినా పునాదులు దాటని జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణ గడువును మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ బహుళ అంతస్తు భవన సముదాయం నిర్మించే పనిని 2012లో కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఒక్కో అంతస్తులో 20వేల చదరపు అడుగులు ఉండేలా డిజైన్ చేసిన ఈ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించింది. గత మే నెలాఖరునాటికే ఈ భవనం అందుబాటులోకి రావాల్సివుండగా పనుల జాప్యం కారణంగా ఇప్పటికీ పునాదులకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మరో ఏడాది కాలపరిమితిని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయినప్పటికీ, నిర్మాణం పూర్తయ్యే అవకాశాల్లేకపోవడంతో మరోసారి కాంట్రాక్టు కాలపరిమితిని పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీట ర్ 2015 మార్చినాటికీ జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులతో ప్రతి పాదించిన ఈ బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని వెనుకేసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు అంచనా వ్యయాన్ని కూడా మరో రూ.రెండు కోట్లు పెంచేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుచూపు లేకుండా 2003లో నేలమట్టం చేసిన పాత భవనం స్థానే బహుళ అంతస్తుల సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. నిర్మాణం మొదలు పెట్టింది తడువు రాజకీయ వివాదంతో కొన్నేళ్లు బిల్డింగ్ పనులు నిలిచిపోగా, తాజాగా పనులు మొదలైనప్పటికీ, నల్లా కనెక్షన్ తీసుకోవడంలో చేస్తున్న జాప్యంతో పనులు పెండింగ్‌లో పెట్టడం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాసట
Published Sun, Sep 28 2014 2:12 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM