జెడ్పీ తెరపైకి వీర్ల కవిత | Unpredictable evolution in trs | Sakshi
Sakshi News home page

జెడ్పీ తెరపైకి వీర్ల కవిత

Published Tue, Jul 1 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

జెడ్పీ తెరపైకి వీర్ల కవిత

జెడ్పీ తెరపైకి వీర్ల కవిత

- తుల ఉమ వద్దన్న  ఎమ్మెల్యేలు
- టీఆర్‌ఎస్‌లో అనూహ్య పరిణామం
- నిర్ణయాధికారం అధినేత కేసీఆర్‌దే

 కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అనూహ్యంగా రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత తెరపైకి వచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ వైపు మొగ్గుచూపుతున్న అధిష్టానానికి జిల్లా ఎమ్మెల్యేలు షాక్‌నిచ్చారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై చర్చించేందుకు సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు బొడి గె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్ , పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే క్ర మంలో రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవితను చైర్‌పర్సన్ చేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు 41 జెడ్పీటీసీలను గెలుచుకొని అన్ని పదవులను సొంతం చేసుకొనేందుకు టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. జెడ్పీ చైర్‌పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో స్వయంగా కేసీఆర్ పార్టీలో సీనియర్, అధిష్టానానికి సన్నిహితురాలైన తుల ఉమను జెడ్పీటీసీకి పోటీ చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ క్రమంలోనే కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా ఉమ విజయం సాధించడంతో చైర్‌పర్సన్ కావడం ఖాయమని అంతా భావిస్తూ వచ్చారు. స్వ యంగా పార్టీ అధినేత కేసీఆర్ అంతర్గత సంభాషణ ల్లో తుల అభ్యర్థిత్వాన్ని నిర్ధారించారు కూడా. దీంతో ఇతర పోటీదారులు కూడా తమ ప్రయత్నాలను దాదాపుగా విరమించుకున్నారు. ఈ దశలో కీలకమైన సమావేశంలో ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వానికి విముఖత చూపుతూ.. వీర్ల కవితను చైర్‌పర్సన్ చేయాలని సూచించడం పార్టీలో సంచలనం సృష్టించింది.

తొలుత ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమకు బదులు కవితను చైర్‌పర్సన్ చేయాలని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సదరు ఎమ్మెల్యే వాదనతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకీభవించినట్లు సమాచారం. వీర్ల కవిత భర్త, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు పార్టీలో చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటాడని మద్దతు పలికినట్లు తెలిసింది.

దీంతో మంత్రి ఈటెల, ఎంపీ వినోద్‌లు చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికను పార్టీ అధినేతకు వదిలివేయాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు సమావేశంలో తీర్మానించారు. ఎమ్మెల్యేలు సైతం చైర్‌పర్సన్ ఎంపికలో తమ అభిప్రాయాలు మాత్రమే చెప్పామని, అంతిమంగా అధినేత తీసుకొనే నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం చైర్‌పర్సన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement