ramadugu
-
పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో
సాక్షి, కరీంనగర్: రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెతో పాటు వారం క్రితం నిర్మించిన వైఎస్సార్టీపీ జెండా గద్దెను సోమవారం స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పంచాయతీ సిబ్బందితో తొలగించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై వివేక్, ట్రెయినీ ఎస్సై నరేశ్, సిబ్బంది గోపాల్‌రావుపేటకు చేరుకొని టీఆర్ఎస్ నాయకులతోపాటు సర్పంచ్‌కు నచ్చ జెప్పి పంపించారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం) అనంతరం కూల్చిన స్థలంలోని టీఆర్ఎస్ నాయకులు గద్దె నిర్మించి జెండా ఎగురవేశారు. కాగా ఘటనపై వైఎస్సార్టీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో-కన్వీనర్ తడగొండ సత్యరాజ్‌వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై గోపాల్రావుపేట సర్పంచ్‌పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని జితేందర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్టీపీ జెండాను కూల్చివేసిన సర్పంచ్‌ను తక్షణం అధికారులు సస్పెండ్ చేయాలని సత్యరాజ్‌వర్మ ప్రకటనలో డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేత, సర్పంచ్ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ -
Karimnagar: తల పైకెత్తి అరుస్తున్న పాము?!
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఓ పాము అరుస్తోందంటూ వదంతులు వ్యా పించాయి. వింతగా కనిపించిన ఆ పాము అరుస్తోందని, దానిని తాను వీడియో తీశానంటూ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఆదివారం సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. అయితే, ‘ఈస్టర్న్ హాగ్నోస్ స్నేక్’గా పిలిచే ఈ పాము నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని, భారత్‌లో కనిపించదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. కాగా, ఇది నెల క్రితం యూ ట్యూబ్‌లో ఓ విదేశీయుడు పోస్ట్ చేసిన వీడియో అని తేలింది. చదవండి: సిరిసిల్ల: బలవంతంగా కోడలిని కౌగిలించుకున్న కోవిడ్ పాజిటివ్ అత్త -
రామడుగులో విషాదఛాయలు
సాక్షి, హాలియా: రామడుగు గ్రామం ఒక్కసారిగా కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. గోదావరి లాంచీ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారనే వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలై కంటిమీద కునుకులేకుండా పోయింది. తమ కుమారుడి ఆచూకీ లభించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశపడ్డ కుటుంబ సభ్యులకు పాశం తరుణ్‌రెడ్డి(27) విగతజీవిగా మారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రామడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుచ్చులూరు సమీపంలో గోదావరి నదిఒడ్డుకు చేరిన తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వారి బంధువులకు తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని అప్పగించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకుని మంగళవారం రాత్రి 12 గంటలకు గ్రామానికి తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. విగతజీవిగా మారిన తరుణ్‌రెడ్డిని చూసి రామడుగు వాసులు ఘోల్లుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నకుమారుడు తరుణ్‌రెడ్డి ఇక తిరిగిరానిలోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు గుం డెలవిసెలా రోదించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రంలో చుట్టి తీసుకురావడంతో వారు చూసి తట్టుకోలేక పోయారు. తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం రామడుగులో కుటుంబ సభ్యులు తరుణ్‌రెడ్డికి అశ్రనయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌రెడ్డి కడసారి చూపుకోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రామడుగు శోకసంద్రంగా మారిపోయింది. నాలుగు రోజులైనా లభించని సురభి రవీందర్ ఆచూకీ.. పాపికొండల పర్యటనకు వెళ్లి లాంచీ ప్రమాదంలో గోదావరిలో గల్లంతయిన హాలియా పట్టణానికి చెందిన సురబి రవీందర్ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజులు గడిచినా రవీం దర్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కచ్చలూరులోనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో హాలియాలో వారి తల్లితండ్రులు సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు నేతల పరామర్శ.. రామడుగు గ్రామానికి తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు గ్రామానికి చేరుకుని తరుణ్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్ మజ్జిగపు వెంకట్రామ్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, సైదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. -
మహిళ దారుణహత్య
రామడుగు(చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్న రాగమల్ల అమల (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం హత్య చేసి పరారయ్యారు. సిద్దిపేట జిల్లాకేంద్రం సమీపంలోని పుల్లూరుకు చెందిన అమల రెండు నెలలక్రితం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అమలపై కత్తులతో దాడి చేశారు. ఆమె తప్పించుకునే యత్నం చేసినా దుండగులు వెంటపడి హత్య చేసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అమల భర్త రామగల్ల రామస్వామి బ్యాంకు ఉద్యోగి అని సమాచారం. అమల భర్తతో గొడవ పడి విడిపోయి వచ్చి బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారు. అమలకు కొడుకు, కూతురు ఉన్నారని వారు తండ్రి వద్ద ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్ అరుదైన రికార్డు సాధించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన ఈ పంప్‌హౌజ్.. ప్రాజెక్టు విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేసేలా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ స్క్రీన్‌పై ప్రసారమవుతోంది. మూడు రోజుల పాటు రోజుకు ఐదుసార్లు న్యూయార్క్ కూడలిలోని అతిపెద్ద తెర మీద గాయత్రి పంప్‌హౌజ్ వీక్షకులకు కనువిందు చేసింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్ ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పంపుహౌజ్‌గా ప్రసిద్ధి పొందినది. ఈ పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉన్నాయి. భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న ఈ పంప్‌హౌజ్‌లోని ఐదు భారీ విద్యుత్ మోటార్లు(బాహుబలులు) ద్వారా నీటి పంపింగ్ జరుగుతుంది. ఇక ఇందులోని బాహుబలి విద్యుత్ మోటార్లు నిత్యం 117 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలోకి నీటిని పంపింగ్ చేస్తాయి. ‘మేఘా’మహాద్భుత సృష్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్ లక్ష్యం, పరిమాణం... ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూ గర్భ పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఈఫిల్ టవర్ కన్నా పెద్దది.. లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్‌హౌస్ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. . -
నీటి కోసం ఓ రైతు వినూత్న నిరసన
సాక్షి, కరీంనగర్ : సాగునీటి కోసం ఓ రైతు వినూత్న నిరసన చేపట్టాడు. రామడుగు మండలం దత్తోజిపేట గ్రామానికి చెందని రైతు లక్ష్మారెడ్డి లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌజ్ వద్ద బాహుబలి మోటర్లను ఎత్తిపోసే గ్రావిటీ కాలువలో బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ సమీపంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తమ గ్రామాలకు సాగునీరు అందడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారుల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చే వరకు కాలువలోనే కూర్చొని ఉంటానని హెచ్చరించారు. ల స్థానిక రైతులు, గ్రామ ప్రజలు లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. -
సాహో.. బాహుబలి
సాక్షి, రామడుగు(కరీంనగర్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరోఘట్టం ఆవిష్కృతమైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్లో ఐదో మోటార్ వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం రిజర్వాయర్ నుంచి ఇంజినీరింగ్ అధికారులు గత సోమవారం ఎల్లంపల్లి నీటిని ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌లకు వదిలారు. రాత్రి 9 గంటలకు సర్జిపూల్‌కు నీరు చేరింది. సర్జిపూల్, టన్నల్‌కు సరిపడా నీరు చేరిన తర్వాత నీటి విడుదలను నిలిపివేశారు. పరీక్షల అనంతరం.. లక్ష్మీపూర్ టన్నల్తోపాటు, సర్జిపూల్, మోటార్లు, సబ్‌స్టేషన్ నుంచి మోటార్లుకు పంపించే విద్యుత్ తీగల్లో సాంకేతిక సమస్యలను ఇంజినీరింగ్ అధికారులు పరీక్షించారు. లీకేజీలకు మరమ్మతులు చేశారు. టెక్నికల్ టెస్ట్ నిర్వహించారు. చిన్నచిన్న లోపాలు సవరించారు. అన్నీ పరీక్షలు పూర్తిచేసిన తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఎల్లంపల్లి నీటిని టన్నెల్ ద్వారా లక్ష్మీపూర్ సర్జిపూల్‌కు విడుదల చేశారు. నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతోంది. నిజంగా బాహుబలే.. ఆదివారం సాయంత్రం ఐదో మోటార్‌కు అధికారులు వెట్‌రన్ నిర్వహించారు. 5:30 గంటలకు అధికారులు మోటార్ ఆన్‌చేశారు. పది నిమిషాల తర్వాత సుమారు 117 మీటర్ల ఎత్తలో ఉన్న సిస్టర్న్ ద్వారా గంగమ్మ ఉబికి వచ్చింది. దీంతో అధికారులు ఆనందంలో మునిగిపోయారు. వెట్‌రన్ కోసం ఉదయం నుంచి శ్రమించిన అధికారులు విజయవంతం కావడంతో సంతోషంలో మునిగిపోయారు. ఒక్క మోటార్ వెట్రన్తోనే సిస్టర్న్ వద్ద నీరు భారీ వరదను తలపిస్తూ నిజంగా బాహుబలి మోటారే అని స్థానికులు చర్చించుకున్నారు. మోటారును దాదాపుగా 40 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు. ఈ పంపు ద్వారా సుమారు వంద క్యూసెక్కుల నీళ్లు పంపింగ్ జరిగింది. ఈనీరు లక్ష్మీపూర్ నుంచి 5.77 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి శ్రీరాములపల్లి గ్రామ శివారులో ఉన్న వరదకాలువలో చేరింది. వరద కాలువ నుండి మరో రెండు కిలోమీటర్ల మేర నీరు చేరిందని శ్రీరాములపల్లి గ్రామ రైతులు తెలిపారు. మొత్తం ఏడు మోటార్లు.. లక్ష్మీపూర్ పంపుహౌస్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉండగా, వీటిలో ఇప్పటికి ఐదు మోటార్లు డ్రైరన్ చేశారు. తాజాగా అదివారం ఒక మోటారు వెట్‌రన్ విజయంతంగా నిర్వహించారు. దశవారీగా మొత్తం మోటార్ల ద్వారా వెట్‌రన్ చేయడానికి అధికారుల సిద్ధమవుతున్నారు. సోమవారం మరో రెండు మోటార్లకు వెట్‌రన్ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల్లో ఆనందం.. లక్ష్మీపూర పంపుహౌస్‌లో బాహుబలి మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించిన విషయం తెలియడంతో మండలంలోని రామడుగు, లక్ష్మీపూర్, దత్తోజీపల్లి, గుండి, రాంచెంద్రాపూర్, చిప్పకుర్తి, గోపాల్రావుపేట, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు కాలువ ద్వారా వెళ్లే నీటిని చూడడం కోసం పరుగులు తీశారు. కాలువలో నీరుపారుతున్న దృశ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు. వెట్‌రన్‌పై జాగ్రత్తలు.. ఆదివారం సాయంత్రం అధికారులు వెట్‌రన్ చేయడానికి ముందు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. పంపుహౌస్ పరిసరాలలోకి కనీసం మీడియాను కూడా అనుమతిలేదు. పంపుహౌస్ వద్దకు వెళ్లిన మీడియా వాళ్లను పంపించివేశారు. అంతేకాకుండ ఆ చుట్టు పక్కల కూడా ప్రజలు , రైతులు లేకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. నీరు కాలువలోకి రావడంతో విషయం తెలుసుకున్న ప్రజలు, రైతులు ఒక్కసారి పంపుహౌస్ పరిసరాలకు చేరుకుని సంతోషం పంచుకున్నారు. రెండుమూడు రోజుల్లో ఎత్తిపోత.. భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న ఐదు భారీ విద్యుత్ మోటార్లు(బహుబలులు) ద్వారా అధికారులు రెండు లేదా మూ డు రోజులల్లో నీటి పంపింగ్ చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. 8వ ప్యాకేజీలో ఉన్న ఐదు భారీ మోటార్లుతో నీటిని పంపింగ్ ప్రక్రియ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహుబలి విద్యుత్ మోటార్లు నిత్యం 117 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలోకి నీటిని పంపింగ్ చేయనున్నారు. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్‌కు.. వరద కాలువ నుంచి గోదావరి నీరు ఓవైపు మిడ్ మానేరుకు, మరోవైపు ఎస్సారెస్పీ ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా తరలించే అవకాశం ఉంది. వరదకాలువలో నీరు నిల్వస్థాయికి చేరుకోగానే జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద ఏర్పాటు చేసి రివర్స్ పంపింగ్ విధానంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని పంపింగ్ చేస్తారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లి శంకరయ్య (53) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రామడుగులో సైకో హల్చల్
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో ఓ వ్యక్తి స్థానికులకు హడలు పుట్టించాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ దుండగుడు కత్తి చేతబట్టుకుని అటుగా వెళ్తే వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. రెండు బస్సులను, మూడు కార్లను అడ్డుకుని అద్దాలు పగులగొట్టాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఉన్మాదంతోనే ఈ చర్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. అతని గురించి వివరాలు తెలియాల్సి ఉంది. -
సందర్శకుల తాకిడి
ధర్పల్లి: రామడుగు ప్రాజెక్ట్‌లోకి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని లింగాపూర్ వాగుతో పాటు పరసర ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,278.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. వచ్చిన నీరు వచ్చినట్లు అలుగు నుంచి వెళ్లిపోతోంది. మరోవైపు, ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. జల సిరులను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ధర్పల్లి, డిచ్పల్లి, భీమ్‌గల్, వేల్పూర్ మండలాలకు చెందిన సందర్శకులు వచ్చి ప్రాజెక్ట్‌ను తిలకించారు. -
పీజీ విద్యార్థి బలవన్మరణం
మల్యాల: మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన రామడుగు నరేశ్(22) అనే పీజీ విద్యార్థి సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరేశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తల్లి గంగవ్వ బీడీలు చుట్టుకునేందుకు పక్కింటికి వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చేసరికి తలుపువేసి కనబడడంతో ఆదుర్దాగా తలుపులు తీయగా.. నరేశ్ ఉరివేసుకుని కనిపించాడు. పక్కింటివారి సాయంతో నరేశ్‌ను కిందికి దింపగా కొద్దిసేపటికే వృతిచెందాడు. నరేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై నీలం రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చొప్పదండి : మండలంలోని రుక్మాపూర్ గురుకుల విద్యాలయంలో పదో విద్యార్థి గొలిపల్లి శ్రీనివాస్(15) అదశ్యంపై చొప్పదండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు శ్రీనివాస్ ఐదేళ్లుగా రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదువుతున్నాడు. ఈనెల మూడోతేదీ సాయంత్రం తనకు జ్వరం వచ్చిందని, కరీంనగర్లో ఉండే తన సోదరిని కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి పాఠశాల నుంచి వెళ్లాడు. కాగా.. ఆదివారం గురుకుల విద్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులకు వారం క్రితమే బడి నుంచి వెళ్లాడని సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందిన వారు చొప్పదండి పోలీసులను సంప్రదించారు. చంద్రయ్య ఫిర్యాదుపై ఎస్సై కేసు నమోదు చేశారు. కాగా.. విద్యార్థి శ్రీనివాస్ వద్ద మొబైల్ ఉందని, దాని నుండి తరచూ బంధువులకు మెసేజ్‌లు పంపిస్తూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి జాడ తెలుసుకునేందుకు మొబైల్ ట్రేస్ చేయడమే మార్గంగా మారింది. శ్రీనివాస్ ఫేస్బుక్లో కూడా ఫోటోలు అప్లోడ్ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం కూడా శ్రీనివాస్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
జెడ్పీ తెరపైకి వీర్ల కవిత
- తుల ఉమ వద్దన్న ఎమ్మెల్యేలు - టీఆర్ఎస్లో అనూహ్య పరిణామం - నిర్ణయాధికారం అధినేత కేసీఆర్‌దే కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా అనూహ్యంగా రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత తెరపైకి వచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ వైపు మొగ్గుచూపుతున్న అధిష్టానానికి జిల్లా ఎమ్మెల్యేలు షాక్‌నిచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై చర్చించేందుకు సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు బొడి గె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్ , పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే క్ర మంలో రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవితను చైర్పర్సన్ చేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు 41 జెడ్పీటీసీలను గెలుచుకొని అన్ని పదవులను సొంతం చేసుకొనేందుకు టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో స్వయంగా కేసీఆర్ పార్టీలో సీనియర్, అధిష్టానానికి సన్నిహితురాలైన తుల ఉమను జెడ్పీటీసీకి పోటీ చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా ఉమ విజయం సాధించడంతో చైర్పర్సన్ కావడం ఖాయమని అంతా భావిస్తూ వచ్చారు. స్వ యంగా పార్టీ అధినేత కేసీఆర్ అంతర్గత సంభాషణ ల్లో తుల అభ్యర్థిత్వాన్ని నిర్ధారించారు కూడా. దీంతో ఇతర పోటీదారులు కూడా తమ ప్రయత్నాలను దాదాపుగా విరమించుకున్నారు. ఈ దశలో కీలకమైన సమావేశంలో ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వానికి విముఖత చూపుతూ.. వీర్ల కవితను చైర్పర్సన్ చేయాలని సూచించడం పార్టీలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమకు బదులు కవితను చైర్పర్సన్ చేయాలని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సదరు ఎమ్మెల్యే వాదనతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకీభవించినట్లు సమాచారం. వీర్ల కవిత భర్త, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు పార్టీలో చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటాడని మద్దతు పలికినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఈటెల, ఎంపీ వినోద్‌లు చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికను పార్టీ అధినేతకు వదిలివేయాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు సమావేశంలో తీర్మానించారు. ఎమ్మెల్యేలు సైతం చైర్పర్సన్ ఎంపికలో తమ అభిప్రాయాలు మాత్రమే చెప్పామని, అంతిమంగా అధినేత తీసుకొనే నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం చైర్పర్సన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.