లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ అరుదైన ఘనత | Kaleshwaram Lakshmipur Pump House Displayed on New York Times Square Screen | Sakshi
Sakshi News home page

లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ అరుదైన ఘనత

Published Sat, Aug 17 2019 4:03 PM | Last Updated on Sat, Aug 17 2019 10:16 PM

Kaleshwaram Lakshmipur Pump House Displayed on New York Times Square Screen - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్‌ అరుదైన రికార్డు సాధించింది. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించిన ఈ పంప్‌హౌజ్‌.. ప్రాజెక్టు విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేసేలా ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌స్క్వేర్‌ స్క్రీన్‌పై ప్రసారమవుతోంది. మూడు రోజుల పాటు రోజుకు ఐదుసార్లు న్యూయార్క్‌ కూడలిలోని అతిపెద్ద తెర మీద గాయత్రి పంప్‌హౌజ్‌ వీక్షకులకు కనువిందు చేసింది.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద  నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్‌ ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పంపుహౌజ్‌గా ప్రసిద్ధి పొందినది. ఈ పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉన్నాయి. భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న ఈ పంప్‌హౌజ్‌లోని ఐదు భారీ విద్యుత్‌ మోటార్లు(బాహుబలులు) ద్వారా నీటి పంపింగ్‌ జరుగుతుంది. ఇక ఇందులోని బాహుబలి విద్యుత్‌ మోటార్లు నిత్యం 117 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలోకి నీటిని పంపింగ్‌ చేస్తాయి.

‘మేఘా’మహాద్భుత సృష్టి
ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్‌ లక్ష్యం, పరిమాణం... ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్‌ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూ గర్భ పంపింగ్‌ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్‌వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. 

ఈఫిల్‌ టవర్‌ కన్నా పెద్దది.. 
లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం పొడవు ఈఫిల్‌ టవర్‌ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్‌హౌస్‌ పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంప్‌హౌస్‌ లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్‌హౌస్‌ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్‌ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. 

.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement