సీల్డ్‌ కవర్లో జెడ్పీ చైర్మన్లు | The list of Ktr districts has been finalized | Sakshi
Sakshi News home page

సీల్డ్‌ కవర్లో జెడ్పీ చైర్మన్లు

Published Sat, Jun 8 2019 3:07 AM | Last Updated on Sat, Jun 8 2019 3:07 AM

The list of Ktr districts has been finalized - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు ఏకపక్ష ఫలితాలు రావడంతో అన్ని జెడ్పీ పీఠాలనూ తన ఖాతాలో వేసుకోనుంది. అయితే, ఆ పదవులు ఎవరికి దక్కుతాయో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులతో పాటు ఇద్దరేసి చొప్పున కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం ఆయా జిల్లా పరిషత్‌ల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పదవులకు పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా టీఆర్‌ఎస్‌ వ్యూహం రచించింది. జెడ్పీ చైర్మన్‌ పదవులు ఎవరికి అప్పగించాలనే అంశంపై మూడు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసిన టీఆర్‌ఎస్‌.

కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. జిల్లాలవారీగా జాబితాను ఖరారు చేశారు. అయితే, చాలాచోట్ల జెడ్పీ చైర్మన్‌ పదవులకు పార్టీలో అంతర్గత పోటీ ఉండటంతో చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్‌ పదవులకు ఎంపిక చేసిన పేర్లను ప్రాదేశిక ఎన్నికల కోసం ఇదివరకే నియమించిన పార్టీ జిల్లా ఇన్‌చార్జిలకు శుక్రవారం రాత్రి సీల్డ్‌ కవర్‌లో అందజేశారు. అన్ని చోట్లా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని వారిని కేటీఆర్‌ ఆదేశించారు.

30 జెడ్పీలపై ఉత్కంఠ...
ఈనెల 4న పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్‌ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు ముందే ఆసిఫాబాద్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ల పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఆసిఫాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎంపిక చేయగా.. ప్రస్తుతం మరో 30 జెడ్పీ చైర్మన్ల పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాదేశిక ఫలితాలు వెలువడిన వెంటనే.. పార్టీ పక్షాన గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులతో జిల్లాలవారీగా క్యాంపులు ఏర్పాటు చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు మొత్తం 28 మందిని 32 జిల్లాలకు ప్రాదేశిక ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించారు. ఆ క్యాంపుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చిన పార్టీ ఇన్‌చార్జీలు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపి.. జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్నవారి జాబితాను అందజేశారు. అలాగే జిల్లాలవారీగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా కేటీఆర్‌కు నివేదించారు.నేరుగా సమావేశ మందిరానికే..: జిల్లాల వారీగా వివిధ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చైర్మన్, వైస్‌ చైర్మన్ల పేర్లను కేటీఆర్‌ ఖరారు చేశారు.

చాలా చోట్ల ఆయా పదవులపై ఏకాభిప్రాయం కుదిరినా, కొన్ని జిల్లాల్లో మాత్రం అంతర్గత పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతుదారులకు పదవి దక్కేలా చివరి నిమిషం వరకు లాబీయింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా పార్టీ, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు పేర్లను ఖరారు చేసిన కేటీఆర్‌.. సీల్డ్‌ కవర్‌లో వాటిని ఇన్‌చార్జీలకు అందజేశారు. శనివారం సాయంత్రం 3 గంటలకు జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. క్యాంపులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులు నేరుగా సమావేశ మందిరానికి వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేశారు. అంతర్గత పోటీ నెలకొన్న చోట పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాల్సిన బాధ్యతను పార్టీ ఇన్‌చార్జీలకు అప్పగించారు.

449 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు...
గతనెల 6, 10, 14 తేదీల్లో మూడు విడతల్లో రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో (హైదరాబాద్‌ జిల్లాను మినహాయించి) 538 జిల్లా, 5,816 మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 4న ఫలితాలు విడుదల కాగా.. టీఆర్‌ఎస్‌ 449, కాంగ్రెస్‌ 75, బీజేపీ 8, ఇతరులు ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పరిధిలో టీఆర్‌ఎస్‌ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్‌ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement