సాక్షి,ఆదిలాబాద్: ఎజెండా అంశాలు 42.. సమావేశం ప్రారంభమైంది ఉదయం 11గంటలకు.. మొదటి ఎజెండా అంశం విద్య. రెండోది వ్యవసాయంపై చర్చసాగే సరికి మధ్యాహ్నం 2గంటలైంది. దీంతో భోజన విరామం నుంచి మళ్లీ 2.30 గంటల నుంచి తిరిగి సమావేశమయ్యారు. ఇక వడివడిగా ఎజెండా అంశాలను ముగించాలని చూశారు. రెండో సెషన్ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో వైద్యం మీద కొంత చర్చ జరిగినా. మిగితా ఎజెండా అంశాల పరంగా ఇలా చదివి.. అలా నెట్టేశారు. మొత్తం మీద సాయంత్రం 5.30 గంటల్లోపు 20అంశాల వరకు పూర్తి కానిచ్చారు. మిగితా అంశాల జోలికే వెళ్లలేదు. గతనెల 27న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీరిది.
మరోమారు డిమాండ్..
జెడ్పీ సర్వసభ్య సమావేశం మూడు నెలలకోసారి నిర్వహించేది. మొన్నటి సమావేశం ఆగస్టు చివరి వారంలో నిర్వహించగా, మళ్లీ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించాలనేది ఇప్పటి డిమాండ్ కాదు. గతం నుంచే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ పరంగా 52మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేవారు. సభ్యులు, ఎమ్మెల్యేలలో కొందరు 200కిలో మీటర్ల దూరం నుంచి వచ్చేవారు. అయితే అప్పుడు సమావేశాల్లో ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగడం లేదని పలువురు సభ్యులు వాపోయేవారు. దీంతో గత పాలకవర్గంలో ఒకట్రెండు సార్లు, అంతకుముందు పాలకవర్గంలో ఒకసారి రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించారు. అధిక మంది సభ్యులు ఉండడంతో వారికి వసతులు, భోజనాలు సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా పరిణమించింది. అప్పట్లో జెడ్పీకి నిధుల కొరత కారణంగా జెడ్పీ సమావేశాల నిర్వహణను ఒకరోజుతోనే కానిచ్చారు.
ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటం, ఆదిలాబాద్ జెడ్పీ 17మంది జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. సభ్యులు ఒక గంటలోపే జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. దూరభారం లేదు. 17మండలాల సభ్యులు తమ మండలాలకు వెళ్లి మరుసటి రోజుకూడా వచ్చేందుకు అవకాశం ఉంది. గతనెల నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి రెండు రోజుల పాటు ఈ సమాశాలు నిర్వహించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. సమావేశం అనంతరం అధికార పార్టీ సభ్యులతో పాటు మిగితా వారు కూడా సమస్యలను చర్చించాలి, సమస్యలందరు మాట్లాడాలంటే రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంతోనే ఇది సాధ్యమవుతుందనే రీతిలో చర్చించుకోవడం జరిగింది.
దీనిపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రధానంగా కోరం సభ్యులు కోరిన పక్షంలో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సభ్యులు కోరితే ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండు రోజులు నిర్వహించేందుకు సిద్ధమన్న రీతిలో పాలకవర్గం పేర్కొంటుంది. మళ్లీ నిర్వహించే సమావేశాల్లోనే ఇది అమలైతే ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది. గతంలో సభ్యులకు గౌరవ వేతనంతో పాటు టీఏ, డీఏలు ఉండేవి. ప్రస్తుతం సభ్యులకు గౌరవ వేతనం ఉన్నప్పటికీ టీఏ, డీఏలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. తద్వారా సభ్యులు రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొన్నా జెడ్పీపై పడే అదనపు భారం కేవలం నిర్వహణ ఖర్చులు.
సభ్యులు సబ్జెక్టుతో వస్తే..
యాభై నుంచి అరవై శాఖలకు సంబంధించి 42 ఎజెండా అంశాలను జెడ్పీ సమావేశంలో రూపొందించడం జరుగుతోంది. ఇందులో కొన్ని శాఖలకు అనుబంధంగా జోడించడంతో ఎజెండా అంశాలు శాఖల పరంగా పోల్చితే కొన్ని తక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెడ్పీ సమావేశంలో సభ్యులు పూర్తి అవగాహనతో వస్తే మాత్రం ఎజెండా అంశాలు చర్చించడానికి ఒక్కరోజు అసలుకే సరిపోదు. గత సర్వసభ్య సమావేశంలో విద్య శాఖతో ఎజెండా అంశం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు ప్రారంభం కాగా ముగ్గురు నలుగురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖపై చర్చ సాగింది.
ఈ రెండు అంశాలకే మూడుగంటల సమయం తీసుకుంది. విద్య శాఖ చర్చ సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుడు గోక జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తాను పదవీ చేపట్టిన తర్వాత తన మండలం తలమడుగులోని 75శాతం పాఠశాలల్లో పర్యటించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని వాపోయారు.
పాలకవర్గం సభ్యుని మాటలు కుదించితే మిగితా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందని పేర్కొన్నప్పుడే తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని గణేష్‌రెడ్డి పేర్కొనడం, సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తే సుదీర్ఘ చర్చ జరుగుతుందన్న వాదనను తెరపైకి తేవడం జరిగింది. సమావేశాల్లో ప్రధాన అంశాలపైనే చర్చ సాగించి మిగితావి మమ అనిపిస్తున్నారు. అంశాల వారీగా చర్చ సాగుతున్నప్పుడు సభ్యులు వాటి ప్రకారమే సమస్యలను లేవనెత్తినప్పుడే పరిష్కారానికి దోహద పడుతుంది. అలాంటప్పుడే జిల్లాలోని సమస్యలపై తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపినప్పుడు దానికి పరిష్కార మార్గం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
42అంశాల్లో ఒక్కో అంశంపై సుమారు 15నిమిషాల పాటు చర్చించినా అన్ని అంశాలపై చర్చ సాగాలంటే సుమారు 11గంటల సమయం పడుతుంది. మొన్నటి సమావేశం కేవలం ఆరు గంటలు మాత్రమే నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మొదటి రోజు సగం, రెండో రోజు సగం ఎజెండా అంశాలను చర్చిస్తే పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతుంది.
సమయం సరిపోకపోతే పరిశీలిస్తాం
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై సమయం సరిపోకపోతే మరుసటి రోజు కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తాం. ప్రజల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేసేది లేదు. సభ్యుల కోరిక మేరకు ముందుకు వెళ్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాథోడ్ జనార్దన్, జెడ్పీ చైర్మన్, ఆదిలాబాద్
డిమాండ్‌ను పరిశీలిస్తాం
రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై పరిశీలన చేస్తాం. దీనికి 1/3వ వంతు సభ్యులు కోరితే రెండు రోజులు చేపట్టేందుకు అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా దృష్టికి మాత్రం తీసుకురాలేదు. – కిషన్, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment