మనమే నంబర్‌1 | National Level Award For Adilabad Zilla Parishad | Sakshi
Sakshi News home page

మనమే నంబర్‌1

Published Thu, Apr 12 2018 12:14 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

National Level Award For Adilabad Zilla Parishad - Sakshi

జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం

ఆదిలాబాద్‌అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల పథకాలు, కార్యక్రమాలను అమలు పర్చడంలో ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల అమలులో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. జెడ్పీ ద్వారా అమలవుతూ అన్ని సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లోపురోగతి సాధించింది. ఈ ప్రగతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్వశక్తి కిరణ్‌’ కింద ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ను పురస్కారం–2018కి ఎంపిక చేసింది. 100 మార్కులున్నా ఈ పోటీలో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ పోటీపడగా ఆదిలాబాద్‌ 72 మార్కులతో ముందు వరుసలో నిలబడి అవార్డు దక్కించుకుంది. ‘జాతీయ పంచాయతీ దినోత్సవం’ సందర్భంగా ఈ నెల 24న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారత పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ వల్లకొండ శోభ సత్యనారాయణగౌడ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు పురస్కారం కూడా అందజేయనున్నారు. ఏడాదికోసారి జరిగే జాతీయస్థాయి పోటీలో మొదటిసారిగా ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌కు అవార్డు దక్కడం హర్షించదగ్గ విషయం.

ప్రగతి సాధించిందిలా..  
ఉమ్మడి జిల్లాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, జన్‌ధన్‌ యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్, పారిశుధ్య, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను జిల్లా పరిషత్‌ సక్రమంగా అమలు చేస్తోంది. ఉన్నతస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారి వరకు పథకాలను అమలు పర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్‌ ద్వారా వివిధ సెక్టార్ల కింద అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో కాకున్నా ఇతర జిల్లాలతో పోల్చితే బాగానే అమవుతున్నాయి. ఆదిలాబాద్‌లో జిల్లా పరిషత్‌ సమావేశాల నిర్వహణ, స్థాయి సంఘా సమావేశాలు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ సరిగ్గా ఉండడంతోపాటు సగం కన్నా ఎక్కువ మంది ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల చక్కని భాగస్వామ్యం భారత ప్రభుత్వాన్నే మెప్పించింది. దీనిని దష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జాతీయ అవార్డుకు సిఫార్సు చేసింది.

అయితే భారత ప్రభుత్వం నియమించబడిన అధికారుల బృందం 2018 జనవరిలో ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించింది. వివిధ శాఖల సమన్వయంతో పలు గ్రామాల్లో వివిధ సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిందీ బృందం. జిల్లా, మండల ప్రజా పరిషత్‌ సమావేశాలు, నిర్వహణ తీరు, చర్చించిన అంశాలు (మినిట్స్‌), మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, వివిధ పథకాలకు నిధులు ఆమోదం, వాటి ఖర్చులు, ఆడిటింగ్, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారుల బృందం పరిశీలించింది. దీంతో పాటు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం, సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా పరిషత్‌ దృష్టికి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలు వంటి అంశాలను పరిశీలించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన జిల్లాలో చేపట్టిన హరితహారం, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, పారిశుధ్యం, తాగునీటి వసతి కల్పించడం వంటి వాటిని అధికారుల బృందం పరిశీలించింది. దీనికి తోడు జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పాలీహౌస్‌ల నిర్మాణం, వైద్యారోగ్య శాఖ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భీంపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం అధికారుల బృందం సందర్శించింది. తద్వారా అధికారుల బృందం ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు భేష్‌గా ఉన్నాయంటూ భారత ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.  

జాతీయస్థాయి అవార్డు దక్కడం హర్షణీయం  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాలను సక్రమంగా అమలు పరుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ను జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమం. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, సిబ్బంది, మీడియా కృషి ఈ అవార్డు ఎంపికకు దోహదపడింది. జాతీయస్థాయిలో మన జిల్లా మెరిసే విధంగా చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేందుకు మరింత ఉత్సహాన్ని ఇస్తోంది. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అన్ని సమావేశాలు, రికార్డులు, నిధులు, విధులు, ఖర్చులు సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరి కృషి ఫలితమే ఈ అవార్డు. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement