National Level Award
-
ఆగ్రోస్‌కు ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయి ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానం పొందిన ఆగ్రోస్‌కు మంగళవారం ఆన్లైన్ ద్వారా అవార్డును అందజేశారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆగ్రోస్ ఎండీ రాములును వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు సత్కరించారు. నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాములు వివరించారు. వాటి ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను నేరుగా అందిస్తున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్‌రావు ప్రోత్సాహంతో ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. రూ. 5 వేల ప్రోత్సాహకం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహిం చేందుకు కేంద్రం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు సమాచారం పంపింది. రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు అభినందన సర్టిఫికెట్‌ను అందించనున్నట్లు పేర్కొంది. అత్యంత విలువైన సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపింది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. -
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. అనే దాన్ని నిజం చేసింది
సాక్షి,శేరిలింగంపల్లి(హైదరాబాద్): ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’అనే దాన్ని నిజం చేస్తోందీ చిన్నారి. ప్రాథమిక విద్యనభ్యసిస్తూనే జిల్లా, రాష్ట్ర స్థాయి దాటి జాతీయస్థాయిలో సత్తా చాటింది. నాలుగేళ్ల వయస్సులోనే చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ చిన్నారి అద్వితీయ ప్రతిభతో జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పలు పతాకాలను కైవసం చేసుకొని అప్రతిహతంగా ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది చిన్నారి సాయివర్షితా రెడ్డి. ► శేరిలింగంపల్లిలో నివాసముండే కిరణ్‌కుమార్ రెడ్డి, సంతోషి దంపతుల కుమార్తె ఎంచల సాయివర్షిత రెడ్డి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమెకు స్కేటింగ్‌పై ఉన్న మక్కువను తల్లిదండ్రులు గమనించారు. అనంతరం స్కేట్–9 అకాడమిలో కోచ్ విఠలా ఉప్పలూరి ఆధ్వర్యంలో స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. మదీనాగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతూనే రాష్ట్ర, జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటూ అనేక విజయాలు సొంతం చేసుకొని పలువురి మన్ననలను పొందుతోంది. సాధించిన పతకాలు ► 2017లో రోలర్ స్కేటింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పథకం ► 2018లో అండర్ 8 విభాగంలో రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయిలో కాంస్య పథకం ► 2019లో అండర్ 9 విభాగంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నోయిడాలో జరిగిన పోటీల్లో 500, 300 మీటర్ల విభాగాల్లో సిల్వర్ మెడల్స్ ► 2019లో సీబీఎస్ఈ సౌత్ జోన్ బెల్గాంలో జరిగిన పోటీలో 300 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించింది. ► 2019లో ఇందిరాపార్కులో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మూడు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుంది. ► 2020లో ఛంఢీగఢ్‌లో 57వ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 300 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని 500 మీటర్ల విభాగంలో ఫైనల్లో పాల్గొంది. మాకెంతో గర్వకారణం అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో దేశం తరపున మా అమ్మాయి ప్రాతినిథ్యం వహించాలనేది మాకల. అందుకోసం అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాం. మా అమ్మాయి సాయివర్షిత స్కేటింగ్‌లో పతకాలు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. స్కేట్–9 కోచ్ విఠలా ఆధ్వర్యంలో శిక్షణతో మరింతగా రాణిస్తోంది. – కిరణ్‌కుమార్ రెడ్డి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది లక్ష్యం. మా అమ్మానాన్న, కోచ్ విఠలా, టీచర్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. మొదట్లో ఎంతో సరదాగా స్కేటింగ్ నేర్చుకున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉంది. – సాయివర్షితా రెడ్డి చదవండి: పెళ్లైన నెలకే మెడ కోసి.. -
అరటి ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక రైతుల ఆసక్తి, ఉద్యాన శాఖ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. వివరాలు చిరంజీవి చౌదురి మాటల్లోనే.. – అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరింది. – దిగుబడిలోనూ మన రైతులు గణనీయమైన పురోగతి సాధించారు. 2014–15లో హెక్టార్‌కు 44 టన్నులుగా ఉన్న దిగుబడి 2019 నాటికి 60 టన్నులకు చేరింది – టిష్యూ కల్చర్ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, ఫలదీకరణలో కొత్త పోకడలతో అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ పెరిగాయి. టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత సుమారు 50 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగింది. – మరోవైపు ఉద్యాన శాఖ రైతులకు అనుకూల విధానాలను అమలు చేసింది. కాయ కోత, కోత అనంతర జాగ్రత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ఏర్పాటు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం వంటి వాటితో రైతులకు మేలు చేకూర్చింది. – ఎఫ్‌పీవోలను క్రియాశీలకంగా మార్చి బనానా క్లస్టర్లను నెలకొల్పి ఎగుమతులకు అనువైన కాయల్ని ఎలా తీర్చిదిద్దాలో నేర్పించింది. – దీంతో మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. – లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ప్రస్తుతం ఎగుమతులు ఊపందుకున్నాయి. 75కి పైగా ఎఫ్‌పీవోలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. – 2016–17లో 246 టన్నులుగా ఉన్న ఎగుమతులు 2019–20 నాటికి 55 వేల టన్నులకు చేరాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతులకు హెక్టార్‌కు అదనంగా రూ.2.90 లక్షల ఆదాయం వస్తోంది. -
శ్రమకు దక్కిన ఫలితం..
భీమదేవరపల్లి(హుస్నాబాద్)/కమలాపూర్ : వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, కమలాపూర్ మండలం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్సీ) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీలుగా గుర్తింపు పొందిన ఈ రెండు పీహెచ్‌సీలకు తాజాగా జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సంస్థ(ఎన్‌క్వాస్)గుర్తింపు లభిం చినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపా యి. దీంతో ఆయా పీహెచ్సీ వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు రోగులకు సక్రమంగా అందేవి కావు. దీనికి తోడు ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్సీలలో కనీస వసతులు లేకపోవడంతో ప్రభుత్వ దవాఖానా అంటేనే రోగులకు ఒకింత అసహనభావం ఏర్పడేది. కానీ మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సైతం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు ప్రజామన్ననలు పొందుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా జాతీయ స్థాయిలో పీహెచ్‌సీలు గుర్తింపును కైవసం చేసుకోవడంపై స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరు భేష్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. దీంతో పాటుగా జిల్లాలో ముల్కనూర్, ఉప్పల్ పీహెచ్‌సీలు ‘కాయకల్ప’ అవార్డులు సైతం లభించిన విషయం విధితమే. నెల రోజుల క్రితమే రెండు పీహెచ్సీలలో కేంద్ర బృందం తనిఖీ చేసింది. కాగా ఈ రెండు పీహెచ్‌సీలకు జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్తో పాటుగా మూడేళ్ల పాటుగా ఏడాదికి రూ. 3లక్షలు చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయి. కాగా ముల్కనూర్ వైద్యాధికారి కేశవరావు, ఉప్పల్ వైద్యాధికారి రాకేష్‌తో పాటు సిబ్బందిని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజు అభినందించారు. -
మనమే నంబర్1
ఆదిలాబాద్‌అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల పథకాలు, కార్యక్రమాలను అమలు పర్చడంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల అమలులో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. జెడ్పీ ద్వారా అమలవుతూ అన్ని సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లోపురోగతి సాధించింది. ఈ ప్రగతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తి కిరణ్’ కింద ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌ను పురస్కారం–2018కి ఎంపిక చేసింది. 100 మార్కులున్నా ఈ పోటీలో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ పోటీపడగా ఆదిలాబాద్ 72 మార్కులతో ముందు వరుసలో నిలబడి అవార్డు దక్కించుకుంది. ‘జాతీయ పంచాయతీ దినోత్సవం’ సందర్భంగా ఈ నెల 24న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో భారత పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ వల్లకొండ శోభ సత్యనారాయణగౌడ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు పురస్కారం కూడా అందజేయనున్నారు. ఏడాదికోసారి జరిగే జాతీయస్థాయి పోటీలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌కు అవార్డు దక్కడం హర్షించదగ్గ విషయం. ప్రగతి సాధించిందిలా.. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, జన్‌ధన్ యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్, పారిశుధ్య, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను జిల్లా పరిషత్ సక్రమంగా అమలు చేస్తోంది. ఉన్నతస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారి వరకు పథకాలను అమలు పర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్ ద్వారా వివిధ సెక్టార్ల కింద అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో కాకున్నా ఇతర జిల్లాలతో పోల్చితే బాగానే అమవుతున్నాయి. ఆదిలాబాద్‌లో జిల్లా పరిషత్ సమావేశాల నిర్వహణ, స్థాయి సంఘా సమావేశాలు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ సరిగ్గా ఉండడంతోపాటు సగం కన్నా ఎక్కువ మంది ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల చక్కని భాగస్వామ్యం భారత ప్రభుత్వాన్నే మెప్పించింది. దీనిని దష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జాతీయ అవార్డుకు సిఫార్సు చేసింది. అయితే భారత ప్రభుత్వం నియమించబడిన అధికారుల బృందం 2018 జనవరిలో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. వివిధ శాఖల సమన్వయంతో పలు గ్రామాల్లో వివిధ సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిందీ బృందం. జిల్లా, మండల ప్రజా పరిషత్ సమావేశాలు, నిర్వహణ తీరు, చర్చించిన అంశాలు (మినిట్స్), మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, వివిధ పథకాలకు నిధులు ఆమోదం, వాటి ఖర్చులు, ఆడిటింగ్, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారుల బృందం పరిశీలించింది. దీంతో పాటు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా పరిషత్ దృష్టికి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలు వంటి అంశాలను పరిశీలించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన జిల్లాలో చేపట్టిన హరితహారం, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, పారిశుధ్యం, తాగునీటి వసతి కల్పించడం వంటి వాటిని అధికారుల బృందం పరిశీలించింది. దీనికి తోడు జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పాలీహౌస్‌ల నిర్మాణం, వైద్యారోగ్య శాఖ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భీంపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం అధికారుల బృందం సందర్శించింది. తద్వారా అధికారుల బృందం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు భేష్‌గా ఉన్నాయంటూ భారత ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. జాతీయస్థాయి అవార్డు దక్కడం హర్షణీయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాలను సక్రమంగా అమలు పరుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌ను జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమం. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, సిబ్బంది, మీడియా కృషి ఈ అవార్డు ఎంపికకు దోహదపడింది. జాతీయస్థాయిలో మన జిల్లా మెరిసే విధంగా చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేందుకు మరింత ఉత్సహాన్ని ఇస్తోంది. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అన్ని సమావేశాలు, రికార్డులు, నిధులు, విధులు, ఖర్చులు సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరి కృషి ఫలితమే ఈ అవార్డు. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో -
ఇంటర్ బోర్డుకు జాతీయ స్థాయి అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్ బోర్డుల నిర్వహణలో సంస్కరణలు, వినూత్న ప్రయోగాలు, కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, అందిస్తున్న సేవల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు ‘టాప్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ అవార్డు లభించింది. రీ థింక్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని 35 ఇంటర్, ప్లస్ టు బోర్డులను పరిశీలించి పై అంశాలతో పాటుగా విద్యలో నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సాంకేతికతను ఉపయోగించుకోవడంలో.. ఆన్లైన్ సర్వీసెస్ వంటి వాటిని ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉందని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు. -
పోతన పేరిట జాతీయ అవార్డు
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : పోతన రచనలపై విసృ్తతంగా పరిశోధనలు చేసిన రచయితలకు జాతీయ స్థాయి అవార్డు అందజేయాలి.. ఇందుకోసం ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపుతాం.. మహాభాగవత రచన చేసి దేశ సమైక్యతకు దారి చూపిన పోతన రచనలు ప్రపంచానికి తెలియజేసే విధంగా వెబ్సైట్ ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ ప్రకటించారు. శనివారం సాయంత్రం పోతన విజ్ఞానపీఠం 15వ సర్వసభ్య సమావేశాన్ని ఆడిటోరియంలో నిర్వహించారు. పీఠం చైర్మన్ జిల్లా కలెక్టర్ కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడిటోరియం, గ్రంథాలయం, సంగీత కళాశాల భవనం, ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు రూపొందించిన పొతన చిత్రపటాలను పరిశీ లించారు. అనంతరం 2013 వరకు జరిగిన ఆడిట్ అకౌంట్స్ అమోదం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతన విజ్ఞాన పీఠానికి పూర్వవైభవం తేవడానికి కార్యవర్గ సభ్యులు జిల్లాలోని పెద్దలతో సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. విజ్ఞాన పీఠం ద్వారా నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలపై వార్షిక ప్రణాళికను ముంగానే తయారుచేసి దాని ప్రకారం నిర్వహించాలని చెప్పారు. నేటి తరం యువతీ యువకులలో పోతన సాహిత్యంపై అవగాహన కల్గించడానికి పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలన్నారు. విజ్ఞాన పీఠం ఆడిటోరియం ను ఆధునికరించే విషయం పరిశీలిస్తానని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండా ప్రకాశ్ మాట్లాడుతూ తమ అల్లూరి మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులచే వెబ్సైట్ రూపొందించడంలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ బమ్మెర పోతన రాసిన మహాభాగవత రచన తరువాతే మనదేశంలో భక్తి సంప్రదాయం వచ్చిందని, దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచిందని అన్నారు. జిల్లా పద్యనాటక పరిషత్ ప్రధాన కార్యదర్శి మారెడోజు సదానందచారి మాట్లాడుతూ తాము ఏదేళ్లుగా పద్యనాటిక ఏకాంకిక పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జిల్లా యంత్రాంగ ఆర్థికంగా సహకరించాలని, ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదని చెప్పారు. ప్రసారిక సంపాదకులు, న్యాయవాది నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ పీఠంలో ప్రతి సంవత్సరం శాశ్వత కార్యక్రమాల క్యాలెండర్ ఏర్పాటు చేసి, ఇందుకు శాశ్వత నిధిని సమకూర్చాలని కోరారు. వల్సపైడి మాట్లాడుతూ జిల్లా యంత్రాగం నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలను పోతన విజ్ఞాన పీఠం వేదికపై నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, పోతన విజ్ఞాన పీఠం మేనేజర్ జమ్మలమడక నాగమణీంద్ర శర్మ, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య పాండురంగారావు, కుందావర్జుల కృష్ణమూర్తి, వ్యాకరణం నాగేశ్వరరావు, అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయినీ విద్మహే, ఆకారపు రాజాచెన్నవిశ్వేశ్వరరావు, డాక్టర్ విశ్వనాథ్‌రావు, వీఆర్ విద్యార్థి, వర్జుల రంగాచార్య, జి.పద్మజ, పొట్లపల్లి శ్రీనివాసారావు, జీవీ బాబు, పుల్లయ్య, కేవీఎన్.చారి, సురేష్ పాల్గొన్నారు.