
సాక్షి, అమరావతి: అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక రైతుల ఆసక్తి, ఉద్యాన శాఖ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. వివరాలు చిరంజీవి చౌదురి మాటల్లోనే..
– అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరింది.
– దిగుబడిలోనూ మన రైతులు గణనీయమైన పురోగతి సాధించారు. 2014–15లో హెక్టార్‌కు 44 టన్నులుగా ఉన్న దిగుబడి 2019 నాటికి 60 టన్నులకు చేరింది
– టిష్యూ కల్చర్ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, ఫలదీకరణలో కొత్త పోకడలతో అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ పెరిగాయి. టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత సుమారు 50 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగింది.
– మరోవైపు ఉద్యాన శాఖ రైతులకు అనుకూల విధానాలను అమలు చేసింది. కాయ కోత, కోత అనంతర జాగ్రత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ఏర్పాటు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం వంటి వాటితో రైతులకు మేలు చేకూర్చింది.
– ఎఫ్‌పీవోలను క్రియాశీలకంగా మార్చి బనానా క్లస్టర్లను నెలకొల్పి ఎగుమతులకు అనువైన కాయల్ని ఎలా తీర్చిదిద్దాలో నేర్పించింది.
– దీంతో మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
– లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ప్రస్తుతం ఎగుమతులు ఊపందుకున్నాయి. 75కి పైగా ఎఫ్‌పీవోలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి.
– 2016–17లో 246 టన్నులుగా ఉన్న ఎగుమతులు 2019–20 నాటికి 55 వేల టన్నులకు చేరాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతులకు హెక్టార్‌కు అదనంగా రూ.2.90 లక్షల ఆదాయం వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment