ఆంధ్రాలో పనిచేయలేం
* తేల్చి చెప్పిన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు
* మార్గమధ్యంలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి
సాక్షి, అమరావతి: తెలంగాణలో పుట్టిపెరిగి ఆంధ్రాలో ఉద్యోగం చేయడం తమ వల్ల కాదంటూ ఉద్యానశాఖ ఉద్యోగులు తేల్చిచెప్పారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడే పనిచేయమంటే సెలవుపెట్టి హైదరాబాద్ వెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఏపీ కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపులో భాగంగా గురువారం ఉద్యానవన శాఖ ఉద్యోగులను గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని పాత మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఆ శాఖ కొత్త కార్యాలయానికి వీరు రాత్రి ఏడు గంటలకు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ఆ కార్యాలయానికి చేరుకోగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రిటైరయ్యేవారిని కూడా పంపారని మండిపడ్డారు. చివరి క్షణం వరకు తమను తెలంగాణలోనే ఉంచుతామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 7 గంటలకు చేరడం గమనార్హం. మార్గంమధ్యలో రామచందర్ అనే ఉద్యోగికి గుండెనొప్పి రావడంతో చికిత్స చేయించుకుని వచ్చేసరికి వీరి ప్రయాణం ఆలస్యమైంది.